Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ రాత్రి తెల్లవారకపోతే బాగుండు' అని ఎన్నిసార్లు అనుకుందో కావ్య. కానీ అన్ని రాత్రులకంటే ఈ రాత్రే ఎందుకో త్వరగా తెల్లారిపోయింది. 'మరికాసేపట్లో సురేంద్ర వస్తాడు. తన కడుపులో సరిగ్గా ఊపిరి కూడా పోసుకోని పసి గుడ్డు ప్రాణం తీయిస్తాడు' అని తలచుకుంటే ఆమె గుండెలు జారిపోతున్నాయి. కండ్ల నుంచి నీరు ప్రవహిస్తున్నది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
సురేంద్ర రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని మాటలు చెప్పాడో. బుజ్జగించాడు ఆమె వినలేదు. నచ్చజెప్పాడు.. ఒప్పుకోలేదు. చివరకు సెంటిమెంట్‌గా బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు. ఇక తప్పదనుకుంది. ఇప్పటికే ఓసారి అబార్షన్ చేయించుకుంది. ఇప్పుడు రెండో సారి. పుట్టకముందే బిడ్డల్ని హత్య చేస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతున్నది. కానీ ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఆమెకు ధైర్యం చెప్పేవారే లేరా? కాదు.. ఎవరి తోడూ లేకుండా తనే ప్రపంచం అన్నట్లు తయారు చేశాడు సురేంద్ర ఆమెను.
పదేండ్ల కిందట సురేంద్ర పరిచయమైనప్పుడు ఎంత సంతోషించిందో. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న తనకు ఓ తోడు దొరకబోతుందని మురిసిపోయింది. అన్న, అక్క ఉన్నా పెండ్లిళ్లు అయిన తర్వాత ఎవరి సంసారాలు వారివే. చిన్న ఉద్యోగం చేసుకుంటూ, మంచాన పడ్డ తండ్రిని చూసుకుంటూ బతుకుతున్నది కావ్య.
ఆమె ఇంటి దగ్గర్లోనే ఉండేవాడు సురేంద్ర. చూడటానికి ఎంత అందగాడో అంతే అందంగా మాట్లాడతాడు. ఆడపిల్లలంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తాడు. కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చుతాడు. తండ్రితో బతుకుతున్న కావ్య ఒంటరి తనాన్ని గమనించాడు. ఆమెను ఏం చేసినా మాట్లాడేవారు లేరని తెలుసుకున్నాడు. మెల్లగా మాటలు కలిపి ప్రేమలో పడేశాడు.
మంచిగా కబుర్లు చెబుతూ కావ్యను పెండ్లి చేసుకుని మంచి జీవితాన్ని చూపిస్తానని ఆమె తండ్రిని నమ్మించాడు. మంచంలో కదలలేని స్థితిలో ఉన్న ఆయన అంతకంటే ఏం చేయగలడు. మరోమాట మాట్లాడలేకపోయాడు. సొంత మేనమామ కొడుకునని చెప్పి వాళ్ళిద్దరినీ వేరే ఇంట్లో అద్దెకు దించాడు.
ఆఫీస్‌కు వెళ్ళేటప్పుడు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు... బండిపై తీసుకు వెళ్లేవాడు. రోజూ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఎటూ పెండ్లి చేసుకోబోతున్న వాళ్ళమే కదా అని తొందరపడ్డారు. తాళికట్టకపోయినా సురేంద్ర ఆమెకు భర్తగా మారిపోయాడు. దాంతో గర్భవతి అయింది. పెండ్లికాకుండా బాగుండదని ఏవో కబుర్లు చెప్పి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత వీరి మధ్య బంధం మరింత బలపడింది. తాగి అప్పుడప్పుడు ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఆఫీస్‌లో ఆలస్యమైతే కావ్య ఎప్పుడైనా తెలిసిన వారి బండిపై ఇంటికి వచ్చేది. అది చూసిన సురేంద్ర ఆమెతో గొడవపెట్టుకునేవాడు. అనుమానించేవాడు.
ఆమె ఏదైనా గట్టిగా మాట్లాడితే కొట్టేవాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఆమె మళ్ళీ గర్భవతి అయింది. సురేంద్ర ఇంట్లో ఈ విషయాలేమీ తెలియదు. 'మా అన్నకు ఇంకా పెండ్లి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుడితే మంచిది కాదని మళ్ళీ కావ్యకు నచ్చజెప్పి కాదు బెదిరించి చివరకు అబార్షన్‌కు ఒప్పించాడు. రాత్రి చెప్పిన సమయానికి రానే వచ్చాడు. కావ్యను తీసుకెళ్ళి అబార్షన్ చేయించాడు.
రెండోసారి కూడా అబార్షన్ చేయించడం, ఆమెను కొట్టడం ఇవన్నీ కావ్యలో అనుమానాన్ని పెంచాయి. అదే సమయంలో సురేంద్ర అన్న పెండ్లి కూడా జరిగింది. కావ్య తండ్రి ఆరోగ్యం పూర్తిగా పాడై చనిపోయాడు. దాంతో తనని వెంటనే పెండ్లి చేసుకోవాలని కావ్య, సురేంద్రను ఒత్తిడి చేసింది. ఎప్పుడైతే కావ్య పెండ్లి గురించి ఒత్తిడి చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి అతని నిజ స్వరూపం బయటపడింది.
'నాకు బయట పది లక్షలు కట్నం ఇస్తామంటున్నారు. మీ అన్న, అక్కను అడిగి అంత కట్నం తెస్తేనే చేసుకుంటా' అన్నాడు. కావ్య గొడవపెట్టుకుంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య యుద్ధం మొదలైంది.
ఓ పక్క సురేంద్ర ఇంట్లో అతనికి పెండ్లి సంబంధం చూశారు. నిశితార్ధం కూడా చేశారు. మరికొన్ని రోజుల్లో అతను పెండ్లి చేసుకోబోతున్నాడు. మరోపక్క కావ్య పెండ్లి గురించి సురేంద్రను అడుగుతూనే ఉంది. అతను తాగి ఫోన్లో ఆమెను బూతులు తిట్టేవాడు. ఇదంతా గమనించిన సురేంద్ర తల్లి కావ్య గురించి తెలుసుకుంది.
ఫోన్ చేసి 'నా కొడుకు మంచి వాడు కాదు. వాడిని మర్చిపో. లేదంటే నీ జీవితం నాశనమైపోతుంది' అంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బాధపడుతుంటే తెలిసిన వారు ఐద్వా లీగల్‌సెల్‌కు వెళ్ళమని సలహా ఇచ్చారు. దాంతో ఆమె వచ్చి తన సమస్య చెప్పుకుని, సురేంద్రతో ఎలాగైన తాళి కట్టించమంటూ ఏడ్చేసింది.
కావ్య కష్టాన్ని విన్న సభ్యులు 'ఇన్నేండ్లు అతను నిన్ను మోసం చేశాడు. నిన్ను ఏంచేసినా అడిగే వాళ్ళు లేరని, నీ పరిస్థితిని తెలుసుకుని ఇలా చేశాడు. నువ్వు కూడా అమాయకంగా అతని మాయలో పడ్డావు. పైగా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్నావు. ఆడపిల్లలు ఇంత అమాయకంగా ఉండబట్టే అబ్బాయిలు మోసం చేస్తున్నారు. పైగా తాగొచ్చి కొట్టడం, బూతులు తిట్టడం ఇదంతా ఇన్నాళ్ళు ఎలా భరించావు.
మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నావు. నీ కాళ్ళపై నువ్వు నిలబడగలవు. అలాంటి వ్యక్తిని నమ్మి మోసపోయావు. ఇప్పటికి కూడా అతనితో తాళి కట్టించమని అడుగుతున్నావు. పెండ్లికి ముందే అతని వల్ల ఎన్నో కష్టాలు పడ్డావు. నువ్వు పెండ్లి గురించి నిలదీసేసరికి తప్పించుకు తిరుగుతున్నాడు. అలాంటి వాడితో తాళి కట్టించుకుంటే సుఖంగా ఉండగలవా. నీకు మంచి భవిష్యత్ ఉంది. అనవసరంగా నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దు' అన్నారు.
'మరి ఏం చేయమంటారు మేడమ్, అతన్నే నేను పెండ్లి చేసుకుంటానని మా ఆఫీస్‌లో, బంధువుల్లో, ఇంటి చుట్టుపక్కల వారందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను అతన్ని పెండ్లి చేసుకోకపోతే మళ్ళీ నన్ను ఎవరు పెండ్లి చేసుకుంటారు. వాడితో జీవితాంతం కాపురం చేయాలని నాకూ లేదు. ఒకవేళ నేను ఎవరినైనా పెండ్లి చేసుకుంటే, తర్వాత ఈ విషయం తెలిస్తే మళ్ళీ నా పరిస్థితి ఏమిటి. అందుకే ఇతన్నే పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
'ఎందరికి తెలిసినా సమస్యేమీ లేదు. రేపు నీకు కష్టాలు వస్తే వాళ్ళందరూ వచ్చి ఆదుకోరు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అయినా ఇతరులకు వేరే పనులేమీ ఉండవా?. ఎప్పుడూ నీ గురించే ఆలోచి స్తుంటారా? మహా అయితే ఆరునెలలు, ఏడాది. తర్వాత అన్నీ మర్చి పోతారు. నీగురించి పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఇక వేరే వాళ్ళను పెండ్లి చేసుకుంటే అతనికి నీ పాత విషయాలు తెలిస్తే ఎలా అని నీ సందేహం. ప్రేమించు కున్నవారందూ పెండ్లి చేసుకుంటున్నారా? ఎంతో మంది సమస్యలు వచ్చి ఇంట్లో చూసిన సంబంధాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకేమీ ఆలోచించకు' అని కావ్యకు అర్థమయ్యే విధంగా వివరించారు.
'మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు. కనీసం అతని నుంచి నాకు కొంత డబ్బు ఇప్పించండి' అంది. అతని నుంచి నీకు కచ్చితంగా నష్టపరిహారం వచ్చే విధంగా చేద్దాం' అని చెప్పి సురేంద్ర తల్లిని తీసుకురమ్మని లెటర్ పంపారు. కానీ అతను రాలేదు. పైగా సభ్యులు ఫోన్ చేస్తే 'కావ్య ఎవరో నాకు తెలియదు. అసలు నాకు అమ్మాయిలతో పరిచయాలే లేవు. నేను ఎక్కడికీ రాను' అని ఫోన్ పెట్టేశాడు. అయితే తర్వాత ఐద్వా లీగల్‌సెల్ గురించి ఎంక్వైరీ చేసిన అతను తల్లిని వెంటబెట్టుకుని వచ్చాడు. అతని తల్లి మాట్లాడుతూ 'అమ్మా ఇప్పుడు మా వాడికి నిశితార్థం కూడా జరిగిపోయింది. త్వరలో పెండ్లి కూడా పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెండ్లి ఆగిపోతే మరో అమ్మాయి జీవితం నాశనం అవుతుంది' అంటూ చెప్పుకొచ్చింది.
'ఇంకా పెండ్లి కూడా కాని మరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు. మరి పదేండ్ల నుంచి తాళికట్టకుండా మీవాడు కావ్యతో సంసారం చేస్తున్నాడు. రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఇప్పుడు అతను మరో పెండ్లి చేసుకుని సుఖంగా జీవిస్తాడు. మరి కావ్య పరిస్థితి ఏమిటి?' అని ప్రశ్నించాడు. 'ఆ అమ్మాయి బాధ్యత నేను చూసుకుంటాను. నా కూతురులా చూసుకుంటాను. జరగబోయే పెండ్లిని మాత్రం ఆపకండీ' అంటూ బతిమలాడుకుంది.
అలా అయితే కావ్య పేరుతో పదిలక్షలు ఫిక్స్ చేయండి. ఆమె జీవితం ఆమె చూసుకుంటుంది. లేదంటే కావ్య పోలీస్‌స్టేషన్‌లో కేసుపెడుతుంది. ఆమె దగ్గర అన్ని రకాల సాక్షాలు ఉన్నాయి' అన్నారు.
మా దగ్గర అన్ని డబ్బులు లేవు. లక్ష రూపాయలు మాత్రం ఇవ్వగలం. అంతకు మించి ఇవ్వలేం అన్నారు. కానీ దానికి సభ్యులు అంగీకరించలేదు. చివరకు నాలుగు లక్షలు ఇస్తామని అంగీకరించారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇద్దరితో ఒప్పంద పత్రాలు రాయించి పంపించారు. ప్రస్తుతం కావ్య ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఐద్వా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనలా సమస్యలు ఎదుర్కొనే మహిళలకు తన వంతు సాయం చేస్తుంది.
- సలీమ