Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక చిత్రం... చూడగానే ముఖాన నవ్వు విరబూయాలి. కంట తడి అయినా పెట్టించాలి. జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాలి. ఏదో ఒకటి చూసినవాళ్లు దానితో మమేకమైపోవాలి. తమను తాము మైమరచిపోవాలి. పోట్రెయిట్ అయినా... సీనరీ అయినా కళాకారుల అంతరంగం... వీక్షకుల మనసులను తాకాలి. అలా మనసులను కదిలింపజేసే చిత్రకారిణి ఉషా పాటిబండ్ల. ఆమె పోట్రెయిట్స్ పలికించే హావభావాలు చూస్తే... ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆయిల్, ఆక్రిలిక్, పోర్స్లేన్, పేస్టల్స్, అబ్స్ట్రాక్ట్, మిక్స్డ్ మీడియా... ఆమె వర్క్ చేయని మీడియం అంటూ లేదు. అంతర్జాతీయ ఖ్యాతిపొందిన రెజిన్ వర్క్‌లోనూ తనైదన ఇమేజ్ను సృష్టించుకున్న ఆర్టిస్టు ఉష అంతరంగం... ఈ శుభోదయాన మీకోసం!
బాల్యంనుంచే...
బాల్యంలో అందరూ బొమ్మలతో ఆడుకుంటారు. కానీ ఆమె రంగులతో ఆడుకున్నారు. ఏ చిన్నపాటి బొమ్మ కనిపించినా దాని అవుట్లైన్స్ గీస్తుండేవారు. పెన్సిల్స్ స్కెచ్చెస్ ఎక్కువగా వేస్తుండే ఆర్టిస్టు సంజరుదేవ్ని చూసి ఆమె పెన్సిల్ స్కెచెస్పై ఆసక్తి చూపిస్తారు. మొదట ఆయన గీసిన బొమ్మలే కొన్ని ప్రయత్నించారు. తరువాత తనకేం కావాలో తెలుసుకున్నారు. అయితే పిల్లలు ఏం కావాలన్నది తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాధికారాన్ని పిల్లలకు ఇచ్చే తల్లిదండ్రులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి తండ్రి ప్రొఫెసర్ కె.కోటేశ్వరరావు. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయినా.. ఆయనకు కళలు, సంస్కృతి అంటే చాలా ఇష్టం. అందుకే కూతురు ఉషకు తనకిష్టమైంది ఎంచుకునే స్వేచ్ఛనిచ్చారు. ఆమె ఇంటర్ చేస్తున్నప్పుడే డిప్లొమా కట్టించారు. అలా రెగ్యులర్ చదువుతోపాటు, కళనూ అవపోసన పట్టారు.
తెగని బంధం...
అప్పటికే ఆర్ట్ వర్క్ చేస్తున్నా... ఇంకా ఏదో చేయాలి, నేర్చుకోవాలన్న తపన ఉండేది. అందుకే పెండ్లయిన తరువాత బీఎఫ్‌ఏలో చేరారామె. కోర్సు పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినా.. పెయింటింగ్‌లో లోతైన అవగాహన మాత్రం వచ్చింది. అదే సమయంలో పీహెచ్డీ కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అయినా కళతో అనుబంధం తెగిపోలేదు. అక్కడ బాతిక్ పెయింటింగ్, హ్యాండ్‌వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు.
ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లోనూ...
తిరిగి వైజాగ్ వచ్చాక... కొన్నాళ్లు ఫ్యాబ్రిక్, కొన్నాళ్లు తంజావూరు పెయింటింగ్స్ కూడా నేర్పించారు. కొంతకాలం పాటు మొదట్లో ఫెవిగ్రిల్ ఆర్ట్ టీచర్‌గా పని చేశారు. తోటి ఆర్టిస్టులతో కలిసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ షోస్ ఎన్నో పెట్టారు. ఆర్ట్ టీచర్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. ఇప్పుడామె శిష్యులు ఎంతోమంది ఆర్ట్ టీచర్స్‌గా కొనసాగుతున్నారు. కాన్వాస్‌మీద వర్క్ లోతైన అధ్యయనం మొదలయ్యాక... వాటిని తగ్గించేశారు.
సమయమంతా చిత్రాలకే...
పిల్లలు మహిళల జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తారు. ఆ మార్పులను సైతం తనకు అనుకూలంగా మల్చుకున్నారామె. పాప, బాబుకు ఏడెనిమిదేండ్లు వచ్చేదాక కొంచెం ఇబ్బంది పడ్డా... తరువాత వాళ్లు స్కూల్ వెళ్లిపోయి తిరిగి వచ్చేదాక... తన సమయాన్నంతా పెయింటింగ్‌కే కేటాయించారు. ఇక చిత్రకళ చాలా ఖరీదైనది. కాన్వాస్నుంచి రంగుల వరకు అన్నీ కొనడం కష్టమే. అయితే దానినుంచి ఆదాయం కొంచెం ఉన్నా... ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనిపిస్తుంది. రెండు ఎవరైనా ఖరీదు చేసినా... ఇంకో నాలుగు గీయాలనిపిస్తుంది. ఆమె విషయంలో ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. ఆమె గీసిన ప్రతి పెయింటింగ్ బంధువులో, తెలిసినవాళ్లో ఎంతోకొంత చెల్లించి తీసుకెళ్లారు.
రెజిన్ వర్క్‌పై ఆసక్తితో...
పోర్స్లేన్, ఆయిల్ .. అన్నీ అందరికీ తెలిసిన మాధ్యమాలే. కాలిఫోర్నియాలో ఉన్న కూతురి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ రెజిన్ వర్క్‌కు ఉన్న క్రేజ్ ఆమెలో ఆసక్తి పెంచింది. వెంటనే అధ్యయనం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ మీడియంలో వచ్చే డిజైన్స్ చేతితో వేయలేం. దేవుడి బొమ్మలో, క్యాలెండర్ బొమ్మలో, సీనరీసో ఎవరైనా వేయొచ్చు. కానీ తాను కొంత భిన్నంగా ఉండాలనుకున్నారు. అక్కడే నేర్చుకుని రెజిన్ పెయింటింగ్స్ వేశారు. ఆ మీడియమ్‌కు ఇండియాలో ప్రాచుర్యం తక్కువ. మెటీరియల్ దొరకడం కూడా కష్టమైంది. పరిశోధించి, ప్రయత్నించి మెటీరియల్ పట్టుకున్నారు. దానిమీద వర్క్ చేసి.. గత ఏడాది నవంబర్లోనే హైదరాబాద్‌లో ప్రదర్శన పెట్టారు. చూసినవాళ్లుచాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ఇది ప్రింటా, మార్బులా అని ఆశ్చర్య పోయారు. కానీ ఎక్కువ మందిని రీచ్ అవ్వలేకపోయింది. అందుకే కాకినాడలో ఉన్న మరో రెజిన్ ఆర్టిస్టుతో కలిసి షో చేసే ప్రయత్నంలో ఉన్నారు.
సంతృప్తి ముఖ్యం...
పోట్రయిట్స్ వేయడంలో ఆమె నిపుణ. ముఖంలో లోతైన భావాలను పలికిస్తారు. ఆమె చిత్రాల్లోని కళ్లు... చూపరులను కనుతిప్పుకోనివ్వవు. ఎన్నో లోతైన భావాలను తెలియజెప్పుతాయి. అందుకే 'మనకు తెలిసిన కళతో కొంతమందిని ఆనందపరుస్తున్నాం అంటే ఇంకేం కావాలి. అన్ని డబ్బుల కోసమే కాదు... సంతృప్తినిచ్చేవి కూడా ఉంటాయి కదా!' అంటారామె.