Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల వచ్చే ఆదాయాన్ని, ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించే వారు బాగా పొదుపు చేయగలరని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు. ఎక్కువ ఇబ్బందులు పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేది ముఖ్యం. ఎదైనా సరే ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకోవాలి. లేదంటే డైరీలో రాసుకోవడం వంటివి చేయాలి. సాధారణంగా ప్రతి కుటుంబంలో చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయం. కానీ కొంతకాలానికి అవే పెద్ద మొత్తం అయి ఇబ్బంది పెడతాయి. చిన్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని డబ్బుని ఎలా ఆదా చేయాలో తెలుసుకుందాం...
సరుకుల జాబిత...
ప్రతినెల కావలసిన సరుకుల జాబితాను తయారు చేసుకోవాలి. బడ్జెట్ ఎంత అవుతుందో రాసుకోవాలి. లేదంటే అవసరం లేని వస్తువులను కూడా కొంటారు. ఇలా ప్రతినెల సరుకుల జాబితాను తయారు చేసుకోవడం వల్ల అనవసర వస్తువులను కొనకుండా ఉండొచ్చు.
షాపింగ్ చేసే ముందు...
ఆన్లైన్ లేదా విడిగా కొనే వాటికి కొంత తేడా ఉంటుంది. కొనాలి అనుకునే వస్తువులను ఏమైన ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక మొబైల్ కొనాలి అనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి. వాటిని వినియోగించుకుంటే మంచిది.
మందులపై ఆదా...
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అవసరమైన మందుల జాబితాను రాసుకొని, జనరిక్ మందులు వాడటం మంచిది. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జనరిక్ మందుల సరఫరాలను ప్రారంభించారు. వీటిని సైతం కొనుగోలు చేసి మీ బిల్లును తగ్గించుకోవచ్చు.
విలాసాలకు...
విశ్రాంతి కావాలంటే, డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళొద్దు. ఏ రెస్టారెంట్లలో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో సమాచార జాబితాను వెబ్ సైట్లలో చూడాలి. మీరు సినిమా టికెట్లు బుక్ చేసే ముందు ఆ ఆపరేటర్ ఏమైనా కార్డ్స్ పై ఆఫర్లు పెట్టారేమో తెలుసుకుంటే మంచిది.
ఆఫర్లు...
పండుగ సీజన్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాలలో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని వస్తుమార్పిడి ఆఫర్లు కూడా ఉంటాయి. అయితే ఏదైన పెద్ద వస్తువు కొనే ముందు నాణ్యతకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే దాని కోసం మళ్ళీ మళ్ళీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ు