Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శోభ పాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని దిగులుగా కూర్చుంది. ఇంకా ఇలా ఎన్ని రోజులు పుట్టింట్లో ఉండాలో అర్థం కావడంలేదు. తన స్నేహితులందరూ తనలాగే పెండ్లి చేసుకొని భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నారు. 'నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతున్నది' అనుకుంటూ లోలోపలె కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది. చుట్టుపక్కల వారు 'మీ ఆయన ఎప్పుడు వస్తాడు' అని అడగినప్పుడల్లా ఏం చెప్పాలో తెలియక దీనంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంటుంది.
ఇలా రోజులు గడుపుతున్న శోభకు ఐద్వా లీగల్‌సెల్ నుంచి ఉత్తరం వచ్చింది. ఆమెకు ఉత్తరం రావడం ఇదే మొదటిసారి. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సంతకం పెట్టి ఉత్తరం అందుకుని అటూ ఇటూ తిప్పి చూసింది. దానిపైన 'ఐలమ్మ కుటుంబ న్యాయ సలహా కేంద్రం' నుంచి వచ్చినట్టు రాసింది. వెంటనే కవర్ చింపి చదివింది. 'మీ కుటుంబం సమస్యల గురించి మీ భర్త మమ్మల్ని సంప్రదించారు. మీరు వచ్చి పరిష్కరించుకోండి' అని ఏ రోజున రావాలో అందులో రాసి ఉంది. అందులో ఉన్న తేదీకి మరో మూడు రోజులు వుంది. 'అంటే వచ్చే శనివారం అక్కడకు వెళ్ళాలన్నమాట' అనుకుంది మనసులో. శోభకు ఆ లెటర్ చూడగానే ముందు భయం వేసింది. లెటర్లో ఉన్న నెంబర్‌కు వెంటనే ఫోన్ చేసింది.
అటు నుండి 'హలో! అంటూ ఓ మహిళ గొంతు... ''మేడమ్ నాపేరు శోభ. నాకు లెటర్ వచ్చింది. ఇందులో నెంబర్ చూసి ఫోన్ చేస్తున్నా. నన్ను శనివారం రమ్మన్నారు. మీ దగ్గరకు మా ఆయన వచ్చాడా? నా గురించి ఏం చెప్పాడు? ఆయన నన్ను తాగి విపరీతంగా కొడతాడు. పుట్టింటికి వచ్చేస్తే ఆయన మారతాడని ఇలా చేశా. మాకు ఒక పాప కూడా ఉంది. నాకు ఆయనతో కలసి బతకాలనే ఉంది. కానీ ఆయన మారాలి. అప్పుడే నేను ఆయనతో కలిసి ఉండగలను'' అంటూ కంగారుగా మాట్లాడేస్తున్నది.
''చూడమ్మా... మేము మిమ్మల్ని కలపడానికే ఇక్కడికి రమ్మన్నాం. నువ్వు శనివారం రోజు ఇక్కడికి రా. కూర్చొని మాట్లాడకుందా'' అని చెప్పి ఫోన్ పెట్టేయబోయింది. వెంటనే ''మేడమ్, మా ఆయన నా గురించి మీకు ఏం చెప్పాడో, ఆయన మాటలు నమ్మకండి. అన్నీ అబద్దాలే చెబుతాడు...'' అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయింది.
''మేము ఆయన మాటలు వినేవాళ్ళమే అయితే నిన్ను రమ్మనమని లెటర్ పంపేవాళ్ళమే కాదు. నువ్వు చెప్పింది కూడా విన్న తర్వాతే మేం ఓ నిర్ణయానికి వస్తాం. కాబట్టి నువ్వేం భయపడకూ'' అంటూ అంటూ ధైర్యం చెప్పింది ఆ గొంతు.
ఆ మాటలకు కాస్త స్థిమిత పడ్డ శోభ శనివారం రోజు లీగల్‌సెల్‌కు వెళ్ళింది. ''మేడమ్ ఆయనకు తాగుడు అలవాటుంది. ఇంట్లో ఒక్కపైసా ఇవ్వడు. రోజూ తాగి వస్తాడు. విపరీతంగా కొడతాడు. తిడతాడు. అనుమానిస్తాడు. కొడుకు పట్టించుకోడని తెలిసి మా మామనే అప్పుడప్పుడు ఇంట్లోకి సరుకులు ఇచ్చి ఇస్తాడు. చివరకు తన తండ్రితో కూడా నాకు సంబంధం అంటగట్టాడు. ఎవ్వరితో మాట్లాడనీయడు. ఏదైనా పని చేసుకుందామంటే బయటకు పోనీయడు. కారణం లేకుండా ప్రతి విషయానికి కొడుతూనే ఉంటాడు. కొట్టడమే కాదు. ఈ మధ్య నేను ఇంట్లో లేనప్పుడు వేరే అమ్మాయిలను తెచ్చుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ మా మామకు ఫోన్ చేసి చెబుతుంటా. మామ కూడా ఆయన్నే తిడుతుంటారు. అందుకే నా దగ్గర ఫోన్ కూడా లేకుండా చేశాడు. పాప పుట్టిన తర్వాత మూడు సార్లు అబార్షన్ అయింది. దాంతో నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. ఇక పిల్లలు వద్దని డాక్టర్ చెప్పారు. అయినా కూడా అబ్బాయి కావాలని ఇబ్బంది పెడతాడు. ఓసారి పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టా. ఇప్పటికీ ఆకేసు నడుస్తూనే ఉంది. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఇంకా ఎన్ని రోజులని ఈ కష్టాలు భరించాలి. ఇక నా వల్ల కాలేదు. అందుకే పుట్టింటికి వెళ్ళాను. ఆయనలో మార్పు వచ్చేవరకు మా పుట్టింట్లోనే ఉంటాను' అని చెప్పింది.
శోభ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత బాధ్యులు ఆమె భర్త కార్తీక్‌ను కూర్చోబెట్టి ''నీ భార్య రావడం లేదని మా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆమెపై నీకు ఎంత ప్రేమో అనుకున్నాం. కానీ నువ్వు తాగి ప్రతి విషయానికి నీ భార్యను కొడుతున్నావు. ఇది మంచి పద్దతి కాదు. పైగా మాతో అన్ని అబద్దాలు చెప్పావు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే తను మాత్రం ఏం చేస్తుంది. నీ బాధ భరించలేకే పుట్టింటికి వెళ్ళింది. నువ్వు మారతానంటేనే తను నీతో వస్తానంటుంది'' అన్నారు.
దానికి అతను ''నేను అప్పుడప్పుడు తాగుతాను. కానీ కొట్టను. రమ్మని చెప్పండి'' అన్నాడు. ''అయితే మీరిద్దరే మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి'' అని ఇద్దరినీ బయటకు పంపారు. పదిహేను నిమిషాల తర్వాత శోభ లోపలికి వచ్చి ''ఆయన తాగుడు మానడంటా. అప్పుడప్పుడు తాగుతాడంటా. ఆయన తాగితే మనిషి కాదు. ఇలా అయితే అతనితో నేను ఉండలేను'' అని కచ్చితంగా చెప్పేసింది.
తర్వాత కార్తిక్‌ను పిలిచి తర్వాతి వారం అతని అన్నయ్యను, తండ్రిని పిలుచుకు రమ్మని చెప్పారు. చెప్పిన ప్రకారమే తండ్రిని, అన్నయ్యను వెంటబెట్టుకొని వచ్చాడు. తండ్రి మాట్లాడుతూ 'ఆడపిల్లకు అన్యాయం చేయడం మాకు ఇష్టం లేదు. నా కొడుకు బాగా తాగుతాడు. కొడతాడు. నా కోడలు చెప్పినవి నిజాలే. వాడు తాగుడు మానకపోతే ఆ అమ్మాయి వాడితో బతకడం కష్టమే' అన్నాడు. ఇదంతా వింటున్న కార్తిక్ ''మగవాళ్ళన్న తర్వాత తాగకుండా ఎలా ఉంటారు?'' అని ప్రశ్నించాడు.
''ఇలాంటి ఆలోచనల వల్లే నీ సంసారంలో ఇన్ని గొడవలు. తాగుడు వల్ల నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. మగాడంటే తాగాలి, భార్యను కొట్టాలి అలా చేసిన వాడే మగాడు అని అనుకుంటున్నావు. కానీ, ఇవన్నీ చేతగాని వారు చేసేపనులు. నీకు ఓ కూతురు ఉంది. తను పెరిగి పెద్దదై తన భర్త కూడా ఇలాగే ఆలోచిస్తే ఏం చేస్తావు. ముందు ఓ మనిషిగా ఆలోచించు. నీ భార్యను గౌరవించి, ఓ మనిషిగా చూడు. ఆమెకూ ఓ మనసు ఉంటుంది. భర్త, పాపతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు మంచిగా చూసుకుంటే తను ఊరికే పుట్టింటికి ఎందుకు వెళుతుంది. ఇప్పటికే ఆమెకు మూడు సార్లు అబార్షన్ జరిగింది. అయినా కూడా నువ్వు అబ్బాయి కావాలంటున్నావు. ఇది నీ భార్యకు, పుట్టబోయే బిడ్డకు కూడా మంచిది కాదు. ఇక నుంచి తనను పిల్లల కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఈ విషయాలన్నీ ఆలోచించుకొని వచ్చేవారం ఇద్దరూ రండి. అప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకుందాం'' అని చెప్పి పంపించారు.
మళ్ళీ వారం ఇద్దరూ వచ్చి... ''నేను తాగుడు మానేస్తాను. శోభను రమ్మని చెప్పండి. అలాగే నాపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోమనండి'' అన్నాడు కార్తిక్. దానికి లీగల్ సెల్ సభ్యులు ''ముందు నీలో మార్పు వచ్చిన తర్వాతే కేసు వెనక్కు తీసుకునేది. ఈ విషయాలన్నీ నువ్వు రిజిస్టర్లో రాసి సంతకం చేయాలి. అలా చేస్తేనే శోభ నీతో వస్తుంది. మేము ఆమెతో కూడా మాట్లాడతాం'' అన్నారు. ఇక చేసేది లేక ఒప్పుకున్నాడు.
చివరిగా ఇద్దరితో మాట్లాడుతూ ''ఇకపై మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా ఇక్కడికే రండి. కూర్చొని మాట్లాడుకుందాం. నిదానంగా పరిష్కరించుకోవచ్చు'' అని ఇద్దరికీ సర్దిచెప్పారు.
బాధ్యులు చెప్పిన వాటన్నింటిని అంగీకరిస్తూ ఇద్దరూ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయారు. తర్వాత రెండు వారాలపాటు ఇద్దరూ కలిసి లీగల్‌సెల్‌కు వచ్చారు. మూడోవారం శోభ ఫోన్ చేసి ఇప్పటి వరకు భర్త వల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదని, ఒక వేళ ఏమైనా ఇబ్బంది వస్తే లీగల్‌సెల్‌కు వస్తానని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసింది.
- సలీమ