Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం కలిసిందే జీవితం...ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం.. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తున్న పండుగ ఇది. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే తరుణం... జీవితంలో చవి చూడాలి మాధుర్యం అంటూ షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం తెలియచేస్తుంది. ఈ పండుగ మధురానుభూతుల సమ్మేళనం.. స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది ఇచ్చే సందేశం.. ఇలాంటి పర్వదినాన కొందరు సినీ, టీవీ తారలు మానవితో పంచుకుంటున్న తీపి జ్ఞాపకాలు...
ఉగాది శుభాకాంక్షలు
అవార్డుల పండుగగా ఉండేది..
ఉగాది పచ్చడి అంటే చిన్నప్పుడు భలే క్రేజీగా ఉండేది. ఉగాది మనకు కొత్త సంవత్సరాది. అనేక రాష్ట్రాల్లో వేరువేరుగా కొత్త సంవత్సరాది ఉంటుం ది. ఉగాది పచ్చడి మన సంప్రదాయం. ఇంట్లో ఉన్నా..షూటింగ్లో ఉన్నా ఉగాది పచ్చడి తప్పని సరిగా తింటాను. పచ్చడి రుచిని బట్టే ఆ ఏడాది జీవితం ఉంటుంది అంటారు. ఈ సెంటి మెంట్‌తో చాలామంది పచ్చడిలో స్వీట్ ఎక్కువ, చేదు తక్కువ వేస్తారను కుంటాను. ప్రతి ఏడాది పచ్చడి తియ్యగానే ఉన్నా.. జీవితంలో ఒడిదుడుకులు మాత్రం తప్పవు. పంటలు చేతికి వచ్చే సంక్రాంతి తర్వాత వచ్చే ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసే కల్చరల్ ఈవెంట్స్ చాలా ఆసక్తిగా ఉండేవి. డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చేవారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చేలా ఉండేవి. అంతేకాదు గతంలో ఉగాది పురస్కారాలు, నంది అవార్డులు ఇచ్చేవారు. ఒకవిధంగా చెప్పాలంటే అవార్డుల పండుగగా ఉండేది.
- జయసుధ, నటీ
వివిధ రాష్ట్రాల వెరైటీలన్నీ కలిపి..
ఉగాది పండగ మన తెలుగువారందరికీ కొత్త సంవత్సరం. ప్రకృతిలో చెట్లన్నీ చిగురించే కాలం. అలాగే మనలోనూ కొత్త ఆశలు చిగురించాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలలోనూ కొత్త సంవత్సరాలు వేరువేరుగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారితో కలసి కొత్త సంవత్సరం ఆనందంగా చేసుకునేవాళ్లం. అందుకే నేను చేసే ఉగాది పచ్చడిలో అన్ని రాష్ట్రాల వెరైటీలు కలుస్తాయి. మన తెలంగాణలో గసగసాలు, పుట్నాలు వేస్తారు. కర్ణాటకలో వేరుశెనగపప్పు, తమిళనాడులో కొబ్బరి వేస్తారు. ఆంధ్రలో అరటి పండు, ఉత్తరాదిలో డ్రైఫ్రూట్స్ వేస్తారు. కామన్‌గా అందరూ వేపపూత వేస్తారు. అన్ని ప్రాంతాల వెరైటీలను కలిపి చేసే ఈ పచ్చడి షడ్రుచుల పచ్చడి అనే కంటే షడ్ర్ రాష్ట్రాల పచ్చడి అంటూ ఇంట్లో వారు ఆటపటిస్తారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగానే తమిళనాడులోనూ ఉగాది సందర్భంగా కళాకారులను అవార్డులతో సత్కరిస్తారు. అలా ఒక ఏడాది నాకు అవార్డు వచ్చింది. బోలెడు కొత్త ఆశలతో, ఆశయాలతో నూతనసంవత్సరాది ప్రారంభించాలి అనుకునేవారందరికీ విళంబి నామసంవత్సరం సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
- రూపాదేవి
పచ్చడి చేయడానికి పోటీ పడతారు
ఉగాది మా ఇంట్లో బాగా సెలబ్రెట్ చేసుకుంటాం. అన్ని పండుగల కంటే ఉగాది కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఇంట్లో రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. అమ్మ ఆంధ్ర, నాన్న తెలంగాణ. ప్రతి పండక్కీ రెండు రాష్ట్రాల పిండి వంటలు ఇంట్లో వండుతారు. అమ్మ తెలంగాణ వంటలు నేర్చుకుని మరీ మాకోసం చేసి పెడుతుంది. ఇక ఉగాది అంటే ముందు గుర్తు కొచ్చేది ఉగాది పచ్చడి. ఇది మాత్రం మా ఇంట్లో ఓ కాంపిటీషన్‌లా జరుగుతుంది. తెలంగాణలో ఉగాది పచ్చడి పల్చగ, పానకంలా చేస్తారు. ఆంధ్రవైపు గుజ్జులా ఉంటుంది. నాన్న ఒక కుండలో, అమ్మ ఓ కుండలో స్వయంగా ఉగాది పచ్చడి చేస్తారు. నాన్న తెలంగాణ స్టైల్లో, అమ్మ ఆంధ్ర స్టైల్లో చేసి ఇంటికి వచ్చిన వారందరికి పెట్టి 'ఏ పచ్చడి బాగుంది?' అని అడుగుతుంటారు. మేం చాలా ఏంజారు చేస్తాం. పచ్చడంటే చాలా ఇష్టం. ఇలా ఉగాదికి మాకు రెండు రకాల టేస్టులు దొరుకుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా న్యూయర్ లాంటి ఇంగ్లీష్ పండుగ కాకుండా మనకంటూ ఓ కొత్త సంవత్సరం ఉన్నందుకు మనసుకు హాయిగా అనిపిస్తుంది.
- చేతన ఉత్తేజ్
ఉగాది అంటే స్పెషల్
ఉగాది పండగొస్తే వారం రోజుల ముందే ప్రిపరేషన్ మొదలవుతుంది. మాది సిరిసిల్ల. ఈ పండుగకు మా దగ్గర భక్ష్యాలు బాగా చేస్తారు. ఉగాదిపచ్చడంటే చాలా ఇష్టం. పండుగ లేకపోయినా మామూలు టైంలో కూడా ఒక్కోసారి చేయించుకుని తింటాను. అమ్మ పచ్చడి బాగా చేస్తుంది. చిన్నప్పుడు పండుగంటే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం. . కొత్త బట్టలు, ఉగాది పచ్చడి, పిండి వంటలు తినడం చాలా సరదాగా ఉండేది. మిగిలిన రోజుల్లో ఎవరం ఎక్కడ ఉన్నా పండుగ రోజు మాత్రం ఫ్యామిలీ మొత్తం కలుసుకుంటాం.
- శిరీష
పండుగలన్నీ సెట్లోనే
ఉగాదికే కాదు ఏ పండుగకూ మాకు సెలవులంటూ ఉండవు. పండుగలన్నీ సెట్లోనే చేసుకుంటాం. అన్ని పండుగల్లా ఉగాది కూడా ఇక్కడే సెలబ్రెట్ చేసుకుంటాం. ఉగాది పచ్చడి సెట్లోనే చేసుకుంటాం. సెలవు తీసుకుని ఇంట్లో పిల్లలతో గడిపే సమయం మాకు ఉండదు. అందుకే పిల్లలని కూడా ఇక్కడికే తీసుకొచ్చుకొని సెలబ్రెట్ చేసుకుంటాం. నటనే సర్వస్వంగా బతుకుతున్నాం కాబట్టి పండుగకు సెలవులు పెట్టాలి, బయటకు వెళ్ళి ఎంజారు చేయాలనే రూల్స్ పెట్టుకోం. పని చేసే దగ్గరే మా పండుగ. పిల్లలను ఇక్కడకు తీసుకురావడం వల్ల కూడా తల్లిగా ఎంత కష్టపడుతున్నామో, మా టీం ఏంటో తెలుసుకుంటారు. అలాగే అందరితో కలిసిపోయి వాళ్ళు కూడా ఎంజారు చేస్తారు. రిలేషన్స్ గురించి తెలుసుకుంటారు. మరో విషయం ఏమిటంటే అందరూ ఒక్క రోజే చేసుకుంటారు. కానీ ఓ ఆర్టిస్టుగా మేం మాత్రం ఒక్కో చానల్ ద్వారా కనీసం వారం రోజులైనా ఉగాది చేసుకుంటాం.
- జ్యోతి రెడ్డి