Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడవారిని వెకిలి చేష్టలతో కొందరు, మాటలతో మరికొందరు వేధిస్తారు. వారిపై కక్షపెంచుకున్న మరికొందరు ఆయుధాలతో దాడిచేస్తారు. ఇలాంటి సందర్భాలలో దాడులను ఎదుర్కొవడం చాలా కష్టం అన్న అపోహ మహిళల్లో ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనే ఆయుధం వెంట ఉంటే మగవారి దాడులను సునాయాసంగా తిప్పికొట్టవచ్చు. చీర కుచ్చిళ్లకు పెట్టుకునే పిన్నీసు నుంచి భుజాలపై వేసుకునే చున్నీ వరకు ఎన్నో ఆయుధాలు తమతో ఉన్నాయన్న విషయం మహిళలు గుర్తుంచుకోవాలి. కత్తితో దాడి చేస్తున్న యువకుడి నుంచి ఈ మహిళ ఎలా తప్పించుకుందో ఈ వారం చూద్దాం..!
ఎవరూ లేని ప్రదేశంలో పరిచయం ఉన్న వ్యక్తి పలుకరింపుతో కాకుండా చేతిలో ఆయుధంతో ఎదురుపడగానే ఆమె బిత్తరపోయింది. తనపై దాడి చేయడానికే వచ్చాడన్న విషయం అర్థమైంది.
నిర్మానుషప్రాంతంలో ఆ వ్యక్తి చేతిలో తనప్రాణాలు పోకుండా కాపాడేవారి కోసం ఎదురుచూసేంత సమయం లేదు. వెను వెంటనే తన భుజాలపై ఉన్న చున్నీని తీసి అతడి చేయి తనపై పడకుండా చున్నీతో అడ్డుకుంది.
పదునైన ఆయుధం చేతిలో ఉన్నా.. ఆమెపై దాడిచేయడం సాధ్యపడకపోవడంతో అతడు కొంత కంగారు పడ్డాడు. మరింత బలంగా ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. కత్తి పట్టుకున్న చేయి తనపై పడకుండా అడ్డుకున్న ఆమె తన చున్నీని అతడి చేతి చుట్టూ తిప్పాలి. దాంతో అతడి చేయిని కట్టేసినట్టు అవుతుంది. కత్తిని ఎటు కదలలేడు.
చున్నీ రెండు కొనలను ఒకచేత్తో గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాలి. దాంతో అతడు వెనక్కి బెండ్ అవుతాడు. ఇదే అదనుగా కుడిచేతి ఎల్బో తో అతడి ఛాతీపై అటాక్ చేయాలి. ఇవన్నీ వెంటవెంటనే చేయాలి. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి.
ఎవరైనా మీ పై ఆయుధాలతో దాడి చేసినప్పుడు చురుగ్గా ఆలోచించాలి. కత్తి మీదికి దూసినప్పుడు, యాసిడ్ పోయడానికి వచ్చినప్పుడు వెంటనే కిందికి వంగితే చాలు. వారి గురి తప్పడమే కాకుండా ప్రాణాపాయం నుంచి చాకచక్యం తప్పించుకోవచ్చు. సో.. అమ్మాయిలు! కాస్త తెలివి.. మరికాస్త ధైర్యం జతచేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్!
- ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నెేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170,
9949039049