Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్కా యాగ్నిక్ (20 మార్చి 1966)
''ఏక్.. దో.. తీన్..''అంటూ ఆమె గళంలో కౌంటింగ్ స్టార్ట్ కాగానే..శ్రోతలు మనసు ఉరకలు వేస్తుంది. ప్రతివారిని ఊర్రూతలూగించిన ఈ పాట 'తేజాబ్ చిత్రంలోనిది. మరి పాడిన గాయనీమణి పేరు తెలుసా! మూడు దశాబ్దాలుగా నేపథ్యగాయనిగా శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న అల్కా యాగ్నిక్. హిందీ సినిమాల ద్వారా గుర్తింపు పొందినప్పటికీ అనేక ప్రాంతీయభాషల్లో తన గానమాధుర్యాన్ని పరిచయం చేశారు. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. రికార్డు స్థాయిలో 36సార్లు ఆమె పేరు ఫిలిమ్‌ఫేర్ అవార్డు కోసం నామినేట్ చేయబడింది. అనేక సంగీత పురస్కారాలు అందుకున్న ఆమె తెలుగులోనూ పాటలు పాడారు.
కోల్‌కతాలో స్థిరబడిన గుజరాతీ కుటుంబంలో అల్కాయాగ్నిక్ జన్మించారు. ఆమె తల్లి
శుభా యాగ్నిక్ భారత శాస్త్రీయ సంగీతం గాయని. 1972 లో ఆరేండ్ల వయసులో, ఆమె కలకత్తాలోని ఆకాశ్వనీ (ఆల్ ఇండియా రేడియో) కోసం పాడటం ప్రారంభించారు. చిన్నారి ఆల్కా గళంలోని మాధుర్యాన్ని గుర్తించిన ఆమె తల్లి ముంబాయికి వచ్చారు. అలా పదేండ్ల వయసులోనే బాల గాయనిగా ఆమెను పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నారు. అయితే గాయనిగా ఆమెకు అవకాశాలు రాలేదు. మరీ చిన్నపిల్లచేత పాటలు పాడించే ధైర్యం సంగీతదర్శకులు చేయలేకపోయారు. ఆమెను గాయనిగా పరిశ్రమకు పరిచయం చేయడానికి మరికొంత సమయం కావాలని అప్పటి వరకు వెయిట్ చేయమని శుభా యాగ్నిక్‌కు సలహా ఇచ్చారు. కానీ అల్కా గళంలోని చురుకుదనం గుర్తించిన శుభా కోల్‌కత్తాలోని డిస్టిబ్యూటర్ రాజ్ కపూర్‌ను కలిసి అల్కా పాటలు వినిపించారు. కపూర్ ఆ అమ్మాయిని ప్రముఖ సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్‌కు రెఫర్ చేశారు. ఆమె గళం విని అబ్బురపడిన లక్ష్మీకాంత్ ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయనిగా రెండు అవకాశాలు ఇచ్చారు. శుభా తమ బిడ్డ గాయనిగానే పరిశ్రమలో ఉండాలని కోరుకున్నారు.
1980లో విడుదలైన 'పాయల్ కీ ఝాన్కర్' సినిమా కోసం మొదటిసారి ఆల్కా పాట పాడారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పాడినా పెద్దగా గుర్తింపు రాలేదు. 1988లో వచ్చిన తెజాబ్ సినిమాలో ఆమె పాడిన 'ఏక్..దో..తీన్..' పాట మంచి గుర్తింపుతో పాటు అనేక అవకాశాలను కల్పించింది. ఈ పాట బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకునేలా చేసింది.
కేవలం హిందిలోనే కాకుండా గుజరాతీ, ఒడియ, అస్సామీ, రాజస్థానీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, మరాఠి, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ , మళయాళం తదితర భాషలలో కూడా ఆల్కా పాటలు పాడారు. ప్రముఖ సంగీత దర్శకులు కళ్యాణ్‌జీ- ఆనంద్జీ, రావుల్ దేవ్ బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, రాజేష్ రోషన్, నదీమ్-శ్రావణ్, జతిన్-లలిత్, అను మాలిక్, ఎ.ఆర్.రహమ్మన్, ఆనంద్-మిలిండ్, ఎంఎం కీరవాణి, సాజిద్-వాజిద్, బప్పి లహిరి, సందేష్ శాండిల్య వంటి అనేక మంది దర్శకత్వంలో ఆమె పాటలు పాడారు. మూడు దశాబ్దాలుగా వందలాది డ్యూయెట్లు ఆమె గళం నుంచి వెలువడ్డాయి. అంతేకాదు.. అనేక భక్తిగీతాల ఆల్బమ్స్‌ను కూడా ఆమె విడుదల చేశారు.