Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్యకు, సురేష్‌కు పెండ్లయి పదమూడేండ్లు. ఇన్నేండ్ల కాపురంలో భర్త ప్రేమ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ఇద్దరి మధ్య ఎప్పుడూ కీచులాటలే. గొడవ జరిగినప్పుడు వారం పదిరోజులు సంధ్యతో మాట్లాడడు. ఆ నిశ్శబ్దాన్ని ఆమె భరించలేకపోయేది. మరో మాట మాట్లాడితే ''నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్టబెట్టారు, నేను ఇంతే ఉంటా, ఉంటే ఉండూ లేకపోతే పో'' అంటూ కఠినంగా మాట్లాడతాడు.
పిల్లల కోసం సంధ్య మౌనంగా భరించేది. అయితే అతని ప్రవర్తన రోజురోజుకు మితిమీరిపోతున్నది. ఆఫీస్‌లో తనతో పాటు పని చేసే ఓ అమ్మాయితో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్థరాత్రి వరకు ఉండి వస్తాడు. ఈ విషయం గురించి సంధ్య ఆరా తీస్తే ''నన్ను అనుమానిస్తున్నావు'' అంటూ ఆమె ముఖం కూడా చూడడు.
ఎప్పుడైనా సంధ్య అలా పుట్టింటికి వెళ్ళగానే అలా ఆఫీస్‌లో అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు. ఓసారి వారిద్దరిని సంధ్య కండ్లారా చూసింది. పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి సురేష్ ఒక్కడే వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సంధ్య, పిల్లలు ఉంటున్న ఇంటికి అద్దె కట్టేవాడు కాదు. ఎంత బతిమలాడినా ఇంటికి రాడు. ఒకవైపు ఇంటి ఓనర్ అద్దె కోసం ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఇల్లు ఖాళీచేయమంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంధ్య తన పిల్లలను తీసుకొని న్యాయం చేయమంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
సంధ్య సమస్యంతా విన్న సభ్యులు సురేష్‌కు లెటర్ పంపారు. అయితే సభ్యులు రమ్మన్న రోజు సురేష్ రాలేదు. సభ్యులు అతనికి ఫోన్ చేశారు. తర్వాతి వారం స్నేహితుడిని తీసుకొచ్చి ''మేడమ్ ఆమె నన్ను అనవసరంగా అనుమానిస్తున్నది. నలుగురిలో నా పరువు తీస్తున్నది. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. ఎవరిపైనన్నా కోపం వస్తే వాళ్ళతో నేను చాలా రోజుల వరకు మాట్లాడను. అలాగే సంధ్యతో కూడా ఉండేవాడిని. కానీ ఆమె నన్ను ఘోరంగా అనుమానించింది. ఇక తనతో కలిసి ఎలా బతకాలి. అందుకే వెళ్ళిపోయాను.
పైగా ఓసారి పంచాయితీ కూడా పెట్టింది. దానికి మా అమ్మానాన్నలు కూడా వచ్చారు. పంచాయితీలో పెద్దలు మమ్మల్ని మా ఊరు వెళ్ళి ఉండమన్నారు. మేమందరం కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వెళ్ళేరోజు తనకు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో చూపించుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ తిరిగి రాలేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఆమె కోసం ఎదురుచూసి చూసి చివరికి మా అమ్మ వాళ్ళు ఊరువెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె అంటేనే విరక్తి పుట్టింది. ఇక ఆమెతో కలిసి ఉండాలని లేదు'' అన్నాడు.
''నువ్వు ఇలా మాట్లాడటం కరెక్టు కాదు. సమస్య వస్తే మాట్లాడుకొని పరిష్కరించు కోవాలి. నువ్వేమో అసలు మాట్లాడనని చెబుతున్నావు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా మౌనంగా ఉంటే ఎదుటి వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకు అర్థం కావట్లేదు. ఆమె అనుమానిస్తుందంటే నీవైపు నుంచి ఏమైనా పొరపాటు ఉందేమో ఆలోచించుకో. ప్రతి దానికీ ఆమెనే తప్పుపడుతున్నావు. ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఉంటున్నావు. వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. పైగా ఇంటికి అద్దె కూడా కట్టడంలేదు. కనీసం మీరు మీ పిల్లల గురించైనా ఆలోచించాలి. మీ ప్రవర్తన మార్చుకోవాలి'' అని సభ్యులు చెప్పారు.
''ఐతే ఆమెను ఊరికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో కలిసి ఉండమనండి. నా మనసు మారినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా'' అన్నాడు. అప్పుడు సభ్యులు ''నీ మనసు ఎప్పుడు మారుతుందో చెప్పగలవా'' అన్నారు. ''ఏమో చెప్పలేను, సంవత్సరం పట్టొచ్చు, ఆరునెలలు పట్టొచ్చు. ఆమె మారిందని మా అమ్మవాళ్ళు చెబితే అప్పుడు తెచ్చుకుంటా'' అని మొండిగా సమాధానం చెప్పాడు.
''భర్తలేకుండా భార్య అక్కడ ఎందుకు ఉంటుంది. నువ్వు మాట్లాడేది కరెక్టు కాదు. అయినా నువ్వు చాలా మొండిగా చేస్తున్నావు. మా ముందే ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావంటే, ఇక ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించగలం. అయినా అక్కడికి వెళ్లాలో, లేదో నిర్ణయించుకోవల్సింది సంధ్య. ఆమెను అడిగి తన అభిప్రాయం కూడా తీసుకుంటాం. మీరు కాసేపు బయట కూర్చోండి'' అని సభ్యులు సురేష్‌ను బయటకు పంపారు.
సంధ్యను పిలిచి జరిగిందంతా చెప్పారు. ''నేను అక్కడికి అస్సలు వెళ్ళను. మా అత్తమామలు నన్ను హింసిస్తారు. పంచాయితీ అప్పుడు మాతో రెండు రోజులే ఉంది. ఆ రెండు రోజుల్లోనే చిత్రహింసలు పెట్టింది. నన్ను నా భర్తతో మాట్లాడనిచ్చేది కాదు. గది దాటి బయటకు రానిచ్చేది కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే పది బూతులు తిట్టేది. ''నీ ముఖం నా కొడుక్కి చూపించకు. నిన్ను నా కొడుక్కు చేసుకున్న తర్వాత అంతా దరిద్రమే పట్టింది. నీ వల్లే మా కుటుంబం రోడ్డున పడింది'' అంటూ నానా మాటాలు అనేది. ఇక నేను ఆయన లేకుండా అక్కడ ఉంటే ఇంకేమైనా ఉందా..? ఆయన వస్తేనే నేను కూడా అక్కడ ఉంటాను'' అని సమాధానం చెప్పింది.
ఇద్దరినీ బాగా ఆలోచించుకొని రెండు వారాల తర్వాత మళ్ళి రమ్మని చెప్పి పంపారు. మళ్లీ రెండు వారాల తర్వాత ఇద్దరూ వచ్చారు. ఎంత చెప్పినా సురేష్ మాత్రం సంధ్యను ఊర్లోనే ఉండమంటున్నాడు. ఆమె మాత్రం భర్త లేకుండా అక్కడ ఉండనంటుంది. సంధ్య చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉందని సభ్యులు అర్థం చేసుకున్నారు. అయితే సంధ్య ఇక్కడే ఉంటే ఇంటి అద్దె కట్టనని, పిల్లల ఖర్చులు చూసుకోనని తెగేసి చెప్పి సురేష్ వెళ్ళిపోయాడు.
సంధ్య మాత్రం ''మేడమ్ అతను నాతో ఉన్నా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు. పోనీ ఆలాగే ఉందామంటే ఆయన మాత్రం సిటీలో ఉండి నన్నూ, పిల్లల్ని ఊర్లో ఉండమంటున్నాడు. నాకు ఇదేదీ ఇష్టం లేదు. ఎలాగైనా ఆయనతో నెలనెలా ఇంటి అద్దె కట్టించండి. మిగిలిన ఖర్చులకు నా పుట్టింటి వాళ్ళు సహకరిస్తారు'' అన్నది.
''చూడు సంధ్య... నీ భర్త కావాలనే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నువ్వు ముందు నీ భర్తకు ఊర్లో ఉన్న ఆస్తి వివరాల గురించి తెలుసుకో. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అతనిపై కేసు పెట్టు. పిల్లల ఖర్చులకు, నీ ఖర్చులకు నష్టపరిహారం ఇవ్వాలని నిలదీద్దాం. దీనికి మేం కూడా నీకు సహాయం చేస్తాం. మరో విషయం ఏమిటంటే నువ్వు పూర్తిగా నీ పుట్టింటి వాళ్ళపై ఆధారపడడం మంచిది కాదు. చదువుకున్నావు కాబట్టి ఏదైనా ఉద్యోగం చూసుకో. ధైర్యంగా నీ బతుకు నువ్వు బతుకుతుంటే అప్పుడు నీ భర్త నీ దారికి వస్తాడు'' అని సంధ్యకు ధైర్యం చెప్పారు.
బాధ్యులు చెప్పిందంతా విన్న సంధ్య ''అతని వల్ల పదమూడేండ్ల నుంచి నరకం అనుభవిస్తున్నాను. అతని మౌనంతో పిచ్చిదాన్నై పోయాను. ఇక నా వల్ల కాదు. మీరు చెప్పినట్లే చేస్తాను. నేనూ ఉద్యోగం చూసుకుంటా. పిల్లల్ని బాగా చదివిస్తా. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కేసు పెడతా. ఏదైనా అవసరం వస్తే మిమ్మల్ని కలుస్తా'' అని చెప్పి గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని వెళ్ళిపోయింది.
- సలీమ