Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు జడలు... తెల్లని షర్ట్, మెడకు బౌ, రెడ్ స్కర్ట్... బ్లాక్ షూ విత్ వైట్ సాక్స్‌లు. ఈ ముసలవ్వ యూనిఫామ్ వేసుకుని బడికి పోతున్నట్టు కనపడుతున్నది కదా! నిజంగనే బడికే పోతున్నది. థారులాండ్‌కు చెందిన ఈ ముసలవ్వ పేరు పూన్ శ్రీ. వయసు 63 ఏండ్లు. ఆమె ఒక్కతే గాదు.. ఆ వయసోళ్లు చాలామందే బడికి పోతున్నరు. థాయిలాండ్ దేశం మొత్తంల ముసలోళ్లను మళ్లీ బడికి పంపుతున్నరట. ఈ వయసులో బడేంది అని ముక్కుమీద వేలేసుకోకుండ్రి. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల జీవితాల్లో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఈ ప్రయత్నమంట. జీవిత భాగస్వాములను కోల్పోయి, ఉద్యోగాల కోసం పిల్లలు వేర్వేరు చోట్ల బతుకుతుండటంతో మహిళలు ఒంటరిగా అయితున్నరు. ఏదో పండుగో పబ్బమో అయితే తప్ప పిల్లలు చూస్తందుకు రారు. దాంతోటి ఒక్కలే ఇంట్ల ఉండటం వల్ల ఒంటరితనం తోటి రంది పడుతున్నరంట. చైనాతోపాటు ముసలోళ్లు ఎక్కువున్న థాయిలాండ్‌లో ఇదో పెద్ద తక్లీఫ్ అయ్యిందంట. థాయిలాండ్ల ఇప్పుడు 7.5 మిలియన్ల మంది 65 ఏండ్లు, అపైన ఉన్నోళ్లే ఎక్కువట. ఇక 2040కొచ్చేసరికి 17 మిలియన్ల దాక అయితరని ప్రభుత్వ అంచనా. ఇంక వీళ్లు ఇంట్ల ఒక్కరే ఉంటుండటంతో... మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటున్నదట. బీపీ, షుగర్లతోపాటు కొత్తకొత్త రోగాలు వస్తున్నయట. దీన్ని పొగొట్టాలంటే ఒక్కటే తోవ అనుకున్న థాయిలాండ్ ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన జేసింది. ఈ క్లాసుల్లో ఆటలు, పాటలు, సంప్రదాయ నృత్యాలు అన్నీ ఉంటయంట. ఏదైనా చేసి ముసలోళ్ల మనసుల్లో ఒత్తిడి పోగొట్టడమే స్కూల్స్ లక్ష్యమట. అందుకే వీళ్లు క్లాసుల ఎంత లొల్లి చేసినా టీచర్లు ఏమనరు. ఎవరికి ఏది ఇష్టమైతే అది నేర్పిస్తరు. కొన్ని శాస్త్రీయమైన క్లాసులు మాత్రం అందరికీ ఉంటయట. మిగిలినవి మాత్రం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు నేర్చుకోవచ్చు. క్లాసులు అయిపోంగనే మన బడిపోరల లెక్కనే అందరు ఒక్కకాడ చేరి ముచ్చట్లు పెడతరంట. ఇంట్లో పిల్లలు లేక.. మాట్లాడే దిక్కు లేకుంట ఉన్నోళ్లకి ఇట్ల స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యేసరికి మస్త్ ఖుషీ అయితుందంటున్నరు వీళ్లు. అంతేనా.. స్కూల్ అయిపొయినంక వదిలేసి వస్తుంటే... బాధయితుందని కూడా అంటుండ్రు. అందుకే చిన్నప్పడి లెక్క స్కూల్ బంక్ అస్సలు కొట్టబుద్ధి కాదని చెబుతున్నరు. బాగుంది కదూ ఈ బామ్మల బడి.. ు