Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్గవీరావు... తెలుగులో ప్రసిద్ధి పొందిన రచయిత్రి, అనువాదకురాలు. ఈమె బళ్లారిలో 1944, ఆగస్టు 14 న జన్మించారు. తల్లి శాంతి తగత్, తండ్రి నరసింహరావు. ఐదుగురు సంతానంలో ఈవిడే పెద్ద. బాలనటిగా రెండు ప్రాంతీయ చిత్రాల్లో నటించారు. అలాగే రేడియోలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈమె తిరుపతికి చెందిన ప్రభంజనరావును వివాహం చేసుకొన్నారు. పెండ్లయిన తరువాత కూడా చదువు కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్లభాషలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా సంపాదించుకున్నారు. తరువాత హైదరాబాదులో కోఠీ మహిళా కళాశాలలోను, నిజాం కళాశాలలోను ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. పదవీ విరమణ తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. లెక్చరర్‌గా పనిచేస్తూనే పలు రచనలు చేశారు. ప్రతి ఏడూ ఆమె ఏదో ఒక పుస్తకం బయటికి వచ్చేదంటే అతిశయోక్తి కాదు. పలు రచనలను తెలుగు నుండి కన్నడకు, కన్నడ నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఇంగ్లీషులోనికి అనువాదం చేశారు. సొంతంగా తెలుగు, ఇంగ్లీషు భాషలలో కథలు, కవిత్వం రాశారు. పలు పురస్కారాలను పొందారు. 1995లో ఆమె అనువదించిన గిరీష్ కర్నాడ్ నాటిక ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. సాహిత్యం సమకాలీనంగా మాత్రమే మిగిలిపోవద్దఉ. భావి తరాలకు బాటలు వేయాలంటే పిల్లలను సాహిత్యం వైపు నడిపించాలని ఆకాంక్షించేవారామె. 'మ్యూజ్ ఇండియా' పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలిగా పనిచేశారు. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన భార్గవిగారి మాతృభాష కన్నడం అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఆమె 2008 మే 23 తేదీన గుండెనొప్పితో మరణించారు.
రచనలు
ఆల్బం (కవిత్వం)
నీడల గోడలు (కవిత్వం)
గుండెలో తడి
చుక్క నవ్వింది
నా పేరు
అభిసారిక (నవల)
తూర్పుగాలి (నవల)
పుత్రకామేష్టి (నవల)
ప్రణవ గంగ (నృత్య రూపకం)
సౌగంధిక
ఊర్వశి (వారణాశి నాగలక్ష్మితో కలిసి)
నాగమండల (అనువాదం మూలం: గిరీష్ కర్నాడ్)
హయవదన (అనువాదం మూలం: గిరీష్ కర్నాడ్)
తలాదండం (అనువాదం మూలం: గిరీష్ కర్నాడ్)
తుగ్లక్ (అనువాదం మూలం: గిరీష్ కర్నాడ్)
అగ్నివర్షం (అనువాదం మూలం: గిరీష్ కర్నాడ్)
సిరి సంపెంగ (అనువాదం)
కథగా మారిన అమ్మాయి (అనువాదం)
నూరేళ్ల పంట (కథా సంకలనం)
ముద్ర (కవయిత్రుల కవితా సంకలనం)
నూరు వరహాలు (కథా సంకలనం)
ఇంకానా! ఇకపై సాగదు (దళిత కథల సంకలనం)
ఆహా! ఓహౌ! (హాస్య కథల సంకలనం)
War a Hearts Ravage (శీలా సుభద్రాదేవి దీర్ఘకవిత యుద్ధం ఒక గుండెకోతకు ఆంగ్లానువాదం)
Pebbles on the Sea Shore (కథలు)
Hiccups (కవిత్వం)
Meru Kanchana (నవల)
Colours and Cadences: Poems from the Romantic Age (టి.విజయ కుమార్‌తో కలిసి)