Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. వయసు పెరిగే కొద్దీ వాళ్ల ఆలోచనలూ ఎదుగుతుంటాయి. ఇది చాలా కీలకమైన సమయం. మంచి విద్యనందించడం, అవసరమైనవి కొనివ్వడం, అపురూపంగా చూడటం మాత్రమే కాదు... వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి?
తల్లిదండ్రులే మొదటి గురువులు...
పిల్లలు శారీరకంగానే కాదు... మానసికంగానూ ఎదగాలి. అందుకే అల్లరి చేస్తున్నారని అతిగా ఆంక్షలు పెట్టేయకండి. వారి వయసు మళ్లీ తిరిగిరాదు. ఆనందించనివ్వండి. ఆస్వాదించనివ్వండి. అయితే దానికి కచ్చితంగా హద్దులు పెట్టాల్సిందే. వాటిని వారంతటవారుగా పాటించేలా చూడండి. పిల్లల్ని నలుగురిలో కలిసేలా అలవాటు చేయాలి. సామాజిక అంశాలపట్ల అవగాహన కల్పించాలి. చిన్నవాళ్లు కదా వారికేం అర్థమవుతాయి అనుకుంటారు చాలా మంది. కానీ పిల్లలకు గ్రాహకశక్తి ఎక్కువ. వారికి మొదటి మెంటార్ మీరే. అందుకే మీరు చేసే ప్రతిపనీ వారిని ఆకర్షిస్తుంది. వాటినే వారు నేర్చుకునే అవకాశం ఉంది. మీరు వేలు పట్టుకుని వేయించే ప్రతి అడుగూ వారి ఎదుగుదలకు ముఖ్యమే అని మరిచిపోవద్దు. ఏ విషయంలో అయినా తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శం. చిన్నారుల ముందు ఇతరుల్ని గేలిచేసినట్లు మాట్లాడటం, ఇంట్లోని వృద్ధులకు మర్యాద ఇవ్వకపోవడం వంటివి అస్సలు చేయొద్దు. పిల్లలు ఇతరులతోనూ అలాగే ప్రవర్తించే ప్రమాదం ఉంది. మీకు పట్టనట్లు కూర్చోవడం, నలుగురిలోనూ కొట్టడం, తిట్టడం వల్ల మీకే గౌరవం తగ్గుతుంది. కొందరు పిల్లలు ఇట్టే అబద్దాలాడుతుంటారు. అందరి మధ్యా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బందికరమే. మొదట్లోనే ఆ పోకడలకు అడ్డుకట్ట వేయాలి. మంచి మాటకు ప్రోత్సాహం, చక్కగా మెలిగితే అభినందించడం వంటివి వారిని కచ్చితంగా మంచి పౌరులుగా మారుస్తాయి.
అసమానతలు లేకుండా..
పిల్లలకు చిన్నతనం నుంచి మర్యాదగా మాట్లాడటం నేర్పించాలి. కుటుంబ సభ్యులతోనే కాదు ఇంట్లో పనిచేసేవారి విషయంలోనూ దీన్ని పాటించేలా చూడాలి. మాటలు నేర్చుకునేటప్పటి నుంచే గౌరవపూర్వకమైన సంభాషణల్ని అలవాటు చేయడం వల్ల ఇంటా, బయటా వారు అంతే మర్యాదగా వ్యవహరించగలుగుతారు. ఆడా మగా ఇద్దరూ సమానమనే ధోరణిలో పెంచాలి. ఇద్దరి మధ్యా లింగ బేధం తప్ప మరే తేడా లేదనేది వారి మనసులో నాటుకునేలా చూడాలి. దానికి ఉదాహరణలూ వారికి చూపించగలగాలి. మహిళలు మగవారితో సమానంగా దూసుకెళుతున్న రంగాలనూ వారికి పరిచయం చేయాలి. వీటివల్ల వారిలో నాటుకున్న అసమానతలు మనసు పొరల నుంచీ దూరంగా జరుగుతాయి. తప్పెవరు చేసినా తప్పే అనే విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అలాకాకుండా తప్పు జరిగినప్పుడు 'వాడు మగపిల్లాడులే తప్పేంలేదు' 'తెలియక చేశాడు ఏం ఫరవాలేదులే' అని కొట్టిపడేయడమో చేయొద్దు.
గౌరవం పెంచాలి...
'అమ్మాయిలు శారీరకంగా బలవంతులు కాకపోవచ్చు. కానీ వారూ మనోధైర్యం విషయంలో పురుషులతో సమానమే. నిర్ణయాలు తీసుకోవడం, ఆచరించడంలో మగవారికంటే మెరుగే' అనే విషయాన్ని చెప్పాలి. అబ్బాయిలు 'ఏడవకూడదు ' అని చెబుతుంటారు చాలా మంది తల్లిదండ్రులు. 'కాదు.. అబ్బాయిలు ఏడిపించేవారూ కాకూడదు' అనే విషయాన్ని చిన్నతనంలోనే వారి మనసులో నాటాలి. అంటే అక్క చెల్లెళ్లనే కాదు.. ఇంటికి వచ్చిన బంధువుల పిల్లల్నీ, తరగతిలో స్నేహితురాళ్లనీ ఆటపట్టించడం, గేలి చేయడం వంటివి చేయకుండా చూసుకోవాలి. అలానే తన జీవితంలోకి వచ్చే అమ్మాయినీ అలానే చూడాలనే విషయం, ప్రాధాన్యం కొడుక్కి వివరించాల్సిన బాధ్యత తల్లిదే. ఇంటి పనులు అమ్మాయిలకి మాత్రమే పరిమితం కాదు.. అబ్బాయిలకీ అవసరమే అని చెప్పడమే కాదు వారూ పనుల్లో భాగస్వాములయ్యేలా చేయాలి. దీనివల్ల ఆడవారి పనుల మీదే కాదూ వారి మీదా గౌరవం రెట్టింపవుతుంది. ఇరుగు పొరుగున కేవలం మగపిల్లలతోనే కాదు అమ్మాయిలతోనూ ఆడుకునేలా చూడాలి. అలా చేయడం వల్ల వారిలో స్నేహభావం పెరుగుతుంది. పెద్దయ్యాక అమ్మాయిలు కేవలం అందం ఆరాధించడానికే అనే ధోరణిలోకి వెళ్లరు. అంతేకాదు ఈ వయసు నుంచే వారికి స్నేహం విషయంలోనూ పరిధులు గీసి.. ఎలా ప్రవర్తించాలో వివరించాలి. అది ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదనే విషయం చెప్పాలి.
ప్రతికూలతలు లేకుండా...
తోటి పిల్లలతో గొడవ పడటం, వారిని కొట్టడం వంటివి చిన్న విషయాలు కావు. కొన్నిసార్లు వాటిని పెద్దలూ నియంత్రించలేరు. అలాంటి పిల్లలు పెరిగాక కూడా తల్లిదండ్రులతోనూ వితండవాదం చేస్తారు. తాను చేసేది తప్పు కాదని వాదిస్తారు. లేదా ఇతరులపై ఆ తప్పుల్ని రుద్దుతారు. ఈ క్రమంలో పెద్దల్ని శత్రువుల్లా భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలానే కారణం లేకుండా కక్ష్య సాధిస్తున్నట్లుగా ప్రవర్తించడం, తోబుట్టువులపైనా ద్వేషం పెంచుకోవడం చేస్తుంటారు. నచ్చిన వస్తువులు ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇలా చాలా రకాల ప్రతికూలతలు చిన్నారుల్లో కనిపిస్తుంటే వీలైనంత త్వరగా అదుపు చేయాలి. లేదా అవసరం అనుకుంటే మానసిక నిపుణులను సంప్రదించాలి. ప్రవర్తనాపరమైన చికిత్సలతో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఇంటి పరిస్థితులు ఎంత వరకూ వారిమీద ప్రభావం చూపుతున్నాయో గమనించాలి. ఎలాంటి వాతావరణం కల్పించాలనే అవగాహన తల్లిదండ్రులకు ఉండటం కూడా చాలా అవసరం.
ఇంట్లో వాతావరణమే...
ఇంట్లో పెద్దవారిపై అమ్మానాన్నలు ఫిర్యాదులు చేసుకోవడం, పక్కింటివారి గురించి ఆరోపణలు, బంధువుల్నీ, స్నేహితుల్ని నిందించడం వంటివి పిల్లల్లో కండక్ట్ డిజార్డుకు బీజం పడేలా చేస్తాయి. తల్లిపై తండ్రి దాడి చేసినా చిన్నారుల మనసులో ప్రతికూల భావం పడుతుంది. క్రమంగా అది పెరిగి ఇతరుల్ని హింసించడంలోనే ఆనందం ఉందనుకుంటారు. అలాగే ఇంట్లో అమ్మానాన్నలు నిత్యం గొడవపడుతూ వాదించుకుంటుంటే వారికి ఇతరులపై ద్వేషం పెరుగుతుంది. దీనివల్ల కొందరు సమాజాన్ని ద్వేషించడం మొదలుపెడతారు. కాబట్టి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి.
ప్రేమతో.. ఓర్పుతో...
పిల్లలు అభద్రతకు లోనవుతారు. చిరాకు, కోపం లాంటి లక్షణాల ద్వారా తమ అశక్తతని ఇలా విధంగా ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రతిరోజూ వీలైనంత సమయాన్ని వారితో గడపటానికి ప్రయత్నించండి. సంతోషం, దు:ఖం, ఇచ్చిపుచ్చుకోవడం, బాధ... ఇలా అన్ని రకాల విషయాల గురించి వారికి వివరించండి. ముందుగా వారికి స్నేహం విలువ తెలియజేయండి. ఎదుటివారికి ఇవ్వడం నేర్పండి. ఏం చేసినా వారు చిన్న పిల్లలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని ప్రేమతో, ఓర్పుతో వారికి అర్థమయ్యేలా చెప్పండి. అబ్బాయి, అమ్మాయి ఇద్దరినీ అన్ని విషయాల్లో సమానంగా చూడటం తప్పనిసరి. ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూడటం వల్ల వారిలో ఒక రకమైన అసంతృప్తి మొదలై చివరకు మహా వృక్షంగా మారుతుంది. తల్లిదండ్రులుగా ముందు మీరు చేయకూడనిది తోబుట్టువులను ఒకరితో ఒకరిని పోల్చడం. బయటి పిల్లలతో కూడా ఏ విషయంలోనూ వారిని పోల్చకూడదు. ఇలా చేయడం వల్ల వారు ఆత్మన్యూనతకు లోనవుతారు.