Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నిసార్లు ఉన్నట్టుండి మనం చేస్తున్న పనిమీద ఆసక్తి తగ్గుతుంది. నిస్తేజంగా అనిపించి ఏ పనీ చేయలేని పరిస్థితి. మనకోసం మనం కొంత సమయం కేటాయించుకోకపోవడమే దానికి కారణం. కాబట్టి మీకంటూ కాస్త సమయం పెట్టుకుని ఇలా చేసి చూడండి.
- ఆఫీసూ, ఇల్లు తప్ప మరో ప్రపంచం లేకపోతే సాధారణంగానే శరీరానికి బద్దకం అలవాటవుతుంది. అది మన మెదడు మీదా ప్రభావం చూపుతుంది. కొన్నాళ్లకి ఏ పనీ సరిగా చేయలేం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా రోజూ కాసేపు వ్యాయామం చేసి చూడండి. అది మనలో కొత్త ఉత్సాహాన్నీ, శక్తినీ నింపుతుంది.
- ఏరోజుకారోజు మన అనుభవాలకు అక్షరరూపం ఇస్తే మనలో ఉన్న లోపాలూ, బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకుని డైరీ రాసుకోండి.
- స్కూల్లో, కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏండ్లు గడిచేకొద్దీ వాళ్లతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటివాళ్లెవరైనా ఉంటే గుర్తు తెచ్చుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది.
- ఉద్యోగం చేస్తున్నప్పుడు నిర్ణీత సమయంలోగా పని పూర్తి చేసేయాలన్న నిబంధనలుంటాయి. కానీ వాటిని మీ సెలవు రోజుకు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసుకోకండి. వీలైనంత వరకూ కాస్త ఎక్కువ సమయం ఉండైనా సరే పనిదినాల్లోనే ఆ పనులన్నీ పూర్తి చేసేయండి. దీనివల్ల వారాంతం హాయిగా గడపొచ్చు.