Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణాలోని అన్ని పట్టణ వీధుల్లో సాయంత్రం కనిపించే ఒకే ఒక దృశ్యం... వేడి వేడి హలీం. దానిని ఆరగిస్తూ ఆస్వాదిస్తున్న హలీం ప్రియులు. రంజాన్‌మాసం వచ్చిందంటే చాలు... ముస్లిమ్స్ కంటే ఎక్కువగా హలీం కోసం ఎదురుచూసేది ఇతరులే! మరి రంజాన్ మాసం లేనప్పుడు హలీం తినాలంటే... దొరకనే దొరకదు. అలా బాధపడిపోకండి. ఇంట్లో కూడా హలీం బాగా తయారు చేసుకోవచ్చు. మీరూ ప్రయత్నియండి!
హలీమ్
కావాల్సిన పదార్థాలు: మాంసం - రెండుకేజీలు, పలుకుల్లా చేసుకున్న గోధుమలు -మూడుకప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - నాలుగు టేబుల్ స్పూన్లు, మినప్పప్పు, శనగపప్పు - అరకప్పు చొప్పున, పెరుగు - ఒకటిన్నర కప్పు, వేయించిన ఉల్లి గడ్డ ముక్కలు -కప్పు, జీడిపప్పు - అరకప్పు, సాజీరా - చెంచా, యాలకులు - రెండు, గులాబీరేకలు - యాభ్కె గ్రా, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క (ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి), మిరియాలు - చెంచా, దాల్చినచెక్క - రెండు అంగుళాలు, లవంగాలు - రెండుమూడు, యాలకులు - రెండు, నెయ్యి - అరకప్పు, కొత్తిమీర తరుగు - కప్పు, పుదీనా ఆకులు - పావుకప్పు, పచ్చిమిర్చి - ఐదారు, ఉప్పు - సరిపడా, నూనె - అరకప్పు, పోట్లీ మసాలా - కొద్దిగా (వేడినీటిలో వేసుకోవాలి. ఇది బజార్లో దొరుకుతుంది).
తయారీవిధానం: గోధుమల్ని నీటిలో అరగంటసేపు నానబెట్టాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలకు సరిపడా అల్లంవెల్లుల్లిముద్ద, చెంచా ఉప్పు చేర్చి బాగా కలిపి ఉడికించి పెట్టుకోవాలి. అలాగే గోధుమలు, పప్పులు, మూడు నాలుగు పచ్చిమిర్చి, అరచెంచా మిరియాలు, ఎనిమిది నుంచి పదికప్పుల నీళ్లు తీసుకుని అరగంటసేపు ఉడికించాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయముక్కలు, గులాబీరేకలు, మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. రెండుమూడు నిమిషాలయ్యాక పెరుగు చేర్చి మరో పదిహేను నిమిషాలు వేయించాలి. ఇందులో మూడుకప్పుల పోట్లీమసాలా, నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఉడికించిన గోధుమ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేయాలి. అవసరమైతే మరికాస్త ఉప్పు కూడా చేర్చి అరగంటపాటు పొయ్యి మీద ఉంచాలి. దింపేముందు మిగిలిన నెయ్యి వేస్తే సరిపోతుంది. వేడివేడి హలీమ్ చాలా రుచిగా ఉంటుంది.
సోయా హలీం...
కావాల్సిన పదార్థాలు: హలీం మిక్స్ కోసం : సన్న గోధుమ రవ్వ-1/3 కప్పు, ఓట్స్-కప్పు, కందిపప్పు-సగం చెంచా, పచ్చిశనగపప్పు-సగంచెంచా, బాదంపప్పులు-6, జీడిపప్పులు-6, పిస్తాపప్పులు-6, ఎండుగులాబీ రెక్కలు-కప్పు, లవంగాలు-6, యాలకులు-6, మిరియాలు -ఒక చెంచా, దాల్చిన చెక్క-2, షాజీరా -సగం చెంచా, జీలకర-సగం చెంచా, నీల్లు -అరలీటరు( సోయా గ్రాన్యూల్స్ మరిగించడానికి), సోయాగ్రాన్యూల్స్-ఒక కప్పు, ఉప్పు తగినంత
హలీం తయారీకోసం : కొత్తిమీర తరుగు - ఒకకప్పు, పుదీనా తరుగు - ఒక కప్పు. వేయించిన ఉల్లిగడ్డలు - ముప్పావు కప్పు, పచ్చిమిరపకాయలు -5, అల్లం వెల్లుల్లి ముద్ద-ఒక చెంచా, నెయ్యి -కప్పు, కిస్మిస్-ఒక చెంచా, గరంమసాలా దినుసులు-ఒక చెంచా, ఉప్పు సరిపడా
సర్వింగ్ కోసం :నెయ్యి -ఒక చెంచా, వేయించిన జీడిపప్పు-కప్పు, వేయించిన ఉల్లిగడ్డముక్కలు-కప్పు, పుదీనా -కప్పు, కొత్తిమీర -కప్పు, నిమ్మకాయ-1,
తయారీవిధానం: గోధుమ రవ్వ, ఓట్స్, కందిపప్పు, పచ్చిశనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, షాజీరా, జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.
ఆ పొడిలో అర లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్ వేసి రెండు మూడు సార్లు కడగాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి 3 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీళ్ళు ఒంపేసి రన్నింగ్ ట్యాప్ కింద పెట్టి సోయా గ్రాన్యుల్స్ని బాగా కడగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి కరిగించాలి. అందులో 4 లవంగాలు, యాలకులు, కిస్మిస్, దాల్చినచెక్క, మిరియాలు వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి.
తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న హలీం మిక్స్‌ను అందులో పోయాలి. లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి ఉప్పు సరిచూసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఒక ప్లేటులో 2 నుండి 3 గరిటెల హలీమ్ వేసి అందులో చెంచా నెయ్యి వేయాలి.పైన వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, నిమ్మ చెక్క ఉంచి వేడిగా సర్వ్ చేయాలి.
హలీమ్ కబాబ్
కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ - అర కప్పు, మినప్పప్పు - అర కప్పు, కందిపప్పు - అర కప్పు, పెసర పప్పు - అర కప్పు, మటన్ చాప్స్ - కిలో, తరిగిన వెల్లుల్లి - 10, అల్లం తరుగు - 2 టీస్పూన్లు, నెయ్యి - 2 టే.స్పూన్లు,
ధనియాల పొడి - 1 టే.స్పూను, జీలకర్ర పొడి - 1 టే.స్పూను, చాట్ మసాలా - 1 టే.స్పూను,
కారం - 1 టే.స్పూను, కుంకుమ పువ్వు - పావు టీస్పూను, పసుపు - 1 టే.స్పూను, కొత్తిమీర తరుగు - 1 కప్పు, పుదీనా తరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి - 4, శనగపప్పు - 1 కప్పు
తయారీవిధానం: శనగపప్పు తప్ప అన్ని పప్పులు శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం మళ్లీ కడిగి వెడల్పాటి గిన్నెలో వేసుకుని దాన్లో మటన్ చాప్స్, వెల్లుల్లి, అల్లం, ఒకటిన్నర లీటర్ల నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలి. నీరు మరిగిన తరువాత మంట తగ్గించి మటన్ మెత్తగా తయారయ్యేవరకూ ఉడికించాలి.
తర్వాత గరిటెతో మటన్ చాప్స్ వేరే ప్లేట్లోకి తీసి చల్లారాక ఎముకలు తీసేయాలి. శనగపప్పుని నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మాంసాన్ని మెత్తగా మెదిపి శనగపప్పుతో కలిపి పక్కనుంచాలి. బాండీలో నూనె పోసి గరం మసాలా దినుసులు, కుంకుమ పువ్వు వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి. తర్వాత దీనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని, మటన్‌ను చేర్చి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత మెత్తని పేస్ట్‌లా మెదిపి చేతికి నూనె రాసుకుని 50 గ్రాముల ఉండలుగా చుట్టాలి. ఈ ఉండలను చదునుగా చేసి పెనం మీద రెండు వైపులా కాల్చుకుని వేడిగా సర్వ్ చేయాలి. అంతే... హలీమ్ కబాబ్స్ రెడీ!