Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాన్ని ఎంజారు చేయాలనే ఉద్దేశంతో చాలామంది యువత సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చు చేసిపడేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డులను పరిమతం లేకుండా స్థాయికి మించిన ఖర్చులు చేసేస్తున్నారు. భవిష్యత్ లో రాబోయే కష్టాలను అధిగమించాలనుకుంటే కొన్ని ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటో తెలుసుకుందాం...
చాలామంది సంపాదిస్తున్న తమ కష్టార్జితాన్ని దాచుకోవడంగానీ, మదుపు చేసుకోవడంగానీ చేస్తుంటారు. అయితే అవి ఎందుకు చేస్తున్నారో..? వాటి వల్లే ప్రయోజనం ఏమిటో..? అనే అంశాల గురించి పట్టించుకోరు. మీరు దాచుకుంటున్న డబ్బులు ఎందుకు కూడబెడుతున్నారో అనే విషయాన్ని గుర్తించి... దానిని మదుపు చేసే మార్గాలేమిటో గుర్తించాలి. అప్పుడే మీరు మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరు.
ఆదాయానికి తగ్గట్టు
భవిష్యత్లో ఎదురయ్యే ఆర్థికపరమైన సమస్యలను తట్టుకోవాలంటే... పొదుపు అనేది కచ్చితంగా చేసుకోవాలి. అలా చేయాలంటే.. ముందు మీరు సంపాదించే కష్టార్జితంలో ఆదాయానికి తగ్గట్టు ఖర్చు చేసుకోవాలి. ఎక్కువ ఖర్చులతో కూడుకున్న వస్తువులను ఖరీదు చేయకుండా... అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవాలి. అప్పుడే మీరు మీ కష్టార్జితంలో ఎంతోకొంత డబ్బును పొదుపు చేసుకోగలరు. రానున్న రోజులు ఎలా వుంటాయో ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి.. సాధ్యమైనంతవరకు డబ్బును పొదుపు చేసుకుంటే చాలా మంచిది.
బాధ్యతారాహిత్యం వద్దు
కొందరికి అత్యవసరమైన పరిస్థితులు వస్తుంటాయి. అటువంటి సమయాల్లో ఏమిచేయాలో తోచక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లేదా ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఒక బాధ్యతారాహిత్యమైన విషయం. అటువంటి ధోరణులలో ముందుగా మీరు మీ ఖర్చులలో మార్పును తీసుకురావాలి. సాధ్యమైనంతవరకు అప్పులు తీసుకోకుండా వుంటే చాలా మంచిది. ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు, లేదా ఖర్చు చేసేటప్పుడు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహించాలి. మీరు చేసే ఖర్చులను ఒక నియంత్రణ ప్రకారం హద్దు దాటకుండా చూసుకుంటే చాలు భవిష్యత్లో రానున్నఇబ్బందులను తేలికగా ఎదుర్కోవచ్చు.
క్రిడిట్ విషయంలో జాగ్రత్త
ఈ రోజులలో క్రెడిట్ కార్డు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సంబంధిత బ్యాంకులు కొన్ని ఉత్పత్తుల కంపెనీలతో లింక్ అయి ఉంటాయి. ఎంత ఎక్కువగా క్రిడిట్ కార్డులు వాడితే స్కోర్ అంత పెరుగుతుందని వివిధ ఆఫర్ల రూపంలో ఆకర్షిస్తుంటారు. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలెన్నో నష్టాలు కూడా అన్నే వుంటాయి. అందుకే క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు ముందుగా వారిమీదున్న అప్పు భారాన్ని తగ్గించు కునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలి. కొత్తగా క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు ముందేగానే మీరు చేసే ఖర్చులను ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకోవాలి. వాటిని మీరు తిరిగి తీర్చగలరా లేదా అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ఖర్చు చేసుకుంటే చాలా మంచిది. అలా చేయకపోతే.. మీరు డబ్బును పొదుపు కూడా చేసుకోలేక పోతారు. కాబట్టి క్రెడిట్ కార్డు ఉపయోగాన్ని చాలావరకు తగ్గించుకుంటే మంచిది.