Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్దెనిమిదేండ్లకే స్వాతికి పెండ్లయింది. భర్త చిన్న ఉద్యోగం చేస్తాడు. వెంటవెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆడంబరాలు ఏమీ లేకపోయినా సంసారం హాయిగా సాగిపోతున్నది. పిల్లలు ఇద్దరూ స్కూల్‌కి వెళ్ళి చదువుకుంటున్నారు. స్వాతి కూడా చిన్న ఉద్యోగంలో చేరి నెలకు ఐదు వేలు సంపాదిస్తున్నది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. సడన్‌గా ఓ రోజు భర్త కండ్లు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టరు అన్ని రకాల టెస్టులు చేసి రెండు మూడేండ్ల కంటే బతకడం కష్టమన్నారు.
మరి కొంత కాలంలో చనిపోతానని తెలుసుకున్న స్వాతి భర్త... భార్యను, పిల్లలను పుట్టింటికి పంపించాడు. తను మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉంటూ అప్పుడప్పుడూ కుటుంబాన్ని చూసిపోయేవాడు. స్వాతి పిల్లలతో అన్న దగ్గర కొంత కాలం ఉంది. తర్వాత పక్కనే ఓ గది అద్దెకు తీసుకుంది. భర్త కొంత, అన్న కొంత సాయం చేసేవారు. ఆమె కూడా ఉద్యోగం చేసేది. తర్వాత కొంత కాలానికి భర్త చనిపోయాడు.
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన చెల్లికి పెండ్లి చేయాలని స్వాతి అక్క భావించింది. తనకు ఎప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి సురేష్. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కాలేజీలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో ఏవో సమస్యలు వచ్చి పదేండ్ల నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఆస్తులు బాగా ఉన్నాయి. నెలకు ఎనభై వేల వరకు ఆదాయం వస్తుంది.
ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొస్తున్న స్వాతికి అతను తోడుంటానని చెప్పాడు. అదే సమయంలో స్వాతి తల్లి చనిపోయింది. ''అతన్ని పెండ్లి చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు, పెండ్లి చేసుకో'' అని తండ్రి సలహా ఇచ్చాడు. వయసు ఎక్కువైనా పిల్లల్ని ఆదరిస్తాననే సరికి స్వాతి అతన్ని నమ్మింది. ముఫ్పై ఏండ్ల వయసులో అరవై ఏండ్ల వ్యక్తిని పెండ్లి చేసుకుంది. తర్వాత రెండు నెలలు అంతా బాగానే ఉంది.
ఓ రోజు ఇంటి బయటకు వచ్చిన స్వాతిని పక్కింటామె చూసి ''ఎవరమ్మా నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ఇంతకు ముందు నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే'' అంది. నేను సార్ భార్యను. మా పెండ్లయి రెండు నెలలు అవుతుంది'' అని చెబితే, ''నువ్వు ఆయన భార్యవా? అంతకు ముందు మరో ఆవిడ ఉండేదే, నిన్ను ఎప్పుడు పెండ్లి చేసుకున్నాడు? అయినా అతను ఉట్టి మోసగాడు. అనవసరంగా అతన్ని నమ్మి వచ్చావు. పైగా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నట్టున్నారు, జాగ్రత్తమ్మా'' అని చెబుతుండగా ఆమె భర్త వచ్చి పక్కింటి విషయాలు నీకెందుకు నోరు మూసుకుని ఇంట్లోకి పదా'' అంటూ లోపలికి తీసుకెళ్ళిపోయాడు.
ఆమె మాటలకు స్వాతి కంగారు పడిపోయింది. వెంటనే కాలేజీకి వెళ్ళిన భర్తకు ఫోన్ చేసి ''పక్కింటి ఆవిడ ఇలా అంటుంది, నాకు చాలా భయంగా ఉంది'' అన్నది. వెంటనే అతను ఇంటికి వచ్చి ''ఇతరులు మన గురించి ఎన్నో అనుకుంటారు. ఎవరైనా హాయిగా బతుకుతుంటే చూస్తూ భరించలేక ఇలా ఏవో చెబుతుంటారు. అవేమీ పట్టించుకోకు. అసలు బయటకు వెళ్ళకు.ఎవరితో మాట్లాడకు'' అన్నాడు. అతన్ని పూర్తిగా నమ్మిన స్వాతి ఇల్లు వదిలి బయటకు వెళ్ళడమే మానేసింది.
భర్త దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఒకతను అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తుండేవాడు. ఓ రోజు ఆ అబ్బాయి ''మేడమ్, మీరు పూర్తిగా మోసపోయారు. అనవసరంగా సార్‌ని పెండ్లి చేసుకున్నారు. మంచోడు కాదు. ఇప్పటికి ముగ్గురు భార్యలను మార్చాడు. మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి'' అన్నాడు. ఈ విషయం కూడా స్వాతి అమాయకంగా భర్తకు చెప్పేసింది. మళ్ళీ ఆమెకే సర్ది చెప్పాడు. పిల్లల్ని మాత్రం ప్రేమగా పలకరించే వాడు. తనకూ ఎలాంటి లోటు లేకుండా అన్నీ చూసుకునేవాడు. దాంతో స్వాతి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది.
ఓ రోజు సురేష్ ''నేను నీ కంటే చాలా పెద్దవాడిని, నీకు ఎలాంటి సుఖం అందించలేను. ఇంట్లో నుంచి వెళ్ళిపో. పది లక్షలు ఇస్తాను'' అన్నాడు. దానికి స్వాతి అంగీకరించలేదు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు. ఎలాగైనా స్వాతిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్న సురేష్ ఓ పండుగ నాడు ''మీ ఇంటికి వెళదాం'' అని తీసుకెళ్ళాడు. ''నేను రెండు రోజులో వచ్చి నిన్ను తీసుకెళతా'' అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి ఫోన్ చేస్తే తీయడు. ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక స్వాతి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
స్వాతి సమస్యను తెలుసుకున్న లీగల్‌సెల్ సభ్యులు ''నీకూ, పిల్లలకు తోడు దొరుకుతుందని పెండ్లి చేసుకున్నావు. కానీ పెండ్లికి ముందు అతను ఎలాంటి వాడో తెలుసుకోలేదు. మంచి ఉద్యోగం, జీతం మాత్రమే చూశావు. నీ పరిస్థితిని చూసి అతను కూడా మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు'' అన్నారు.
''ఒక సారి భర్తను పోగొట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఇలా భర్త వదిలేస్తే నా పరిస్థితి ఏంటి? ఇద్దరు ఆడపిల్లలతో ఎలా బతకాలి. వాళ్ళ పెండ్లి ఎలా చేయాలి. ఎలాగైనా ఆయనతో మాట్లాడి మమ్మల్ని కలపండీ' అంటూ ఏడ్చేసింది.
''అతనితో ఉంటే రేపు నీ పిల్లల పరిస్థితి ఏమిటో ఆలోచించుకో. నలుగురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని నువ్వే చెప్పావు. అలాంటి వాడిని నమ్మి ఆడపిల్లలతో అతని దగ్గర ఎలా ఉంటావు. నీకు, నీ పిల్లలకు భద్రత ఉంటుందనే నమ్మకం మాకు లేదు'' అన్నారు.
''ఇప్పుడు అతనితో పోరాడే శక్తి నాకు లేదు. ఇద్దరు పిల్లలతో రోడ్డుపైన నిలబడలేను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయండి'' అన్నది. స్వాతి పరిస్థితి అర్ధం చేసుకున్న లీగల్‌సెల్ సభ్యులు అతన్ని రమ్మనమని లెటర్ పంపారు. కానీ అతను రాలేదు. ఫోన్ చేస్తే ''నేను ఎక్కడికీ రాను, ఆమెకు పది లక్షలు ఇస్తానని చెప్పాను. ఆమె బతుకు ఆమెను బతకమని చెప్పండి. నేను పరువు గల కుటుంబం నుండి వచ్చాను. అనవరంగా రోడ్డుపైకి లాగొద్దు'' అన్నాడు.
''పరువు అందరికీ ఉంటుంది. అంత పెద్ద వయసులో ఓ ఆడపిల్లను పెండ్లి చేసుకున్నావు.ఇప్పుడు రోడ్డుపైన వదిలేశావు. ఇదేనా నీ పరువు. నువ్వు రానంటే ఊరుకుంటామా? ఇక్కడకు వస్తే మీ సమస్య ఏమిటో కూర్చొని మాట్లాడుకోవచ్చు. లేదంటే మీ ఇంటికి స్వాతి కాదు వచ్చేది పోలీసులు. ఇప్పటికి నలుగురు ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడావు. ఇంక నీ ఆటలు సాగవు'' అని హెచ్చరించారు.
భయపడిన సురేష్ ''వచ్చే వారం వస్తాను మేడమ్ మీరు అనవసరంగా సమస్యను పెద్దది చేయకండీ'' అంటూ బతిమాలాడు. చెప్పిన ప్రకారమే పై వారం అతను వచ్చి ''మేడమ్ ఆమె నన్ను అనుమానిస్తుంది. పక్కింటి వాళ్లతో
ముచ్చట్లు పెడుతుంది. వాళ్ళు ఏం చెబితే అది వింటుంది. పైగా నేను వయసులో ఆమెకంటే నేను చాలా పెద్దవాడిని. ఆమెకు ఎలాంటి ఆనందం ఇవ్వలేకపోతున్నాను. అందుకే దూరంగా పంపించాలనుకుంటున్నాను'' అన్నాడు.
''వయసులో పెద్దవాడివని ముందు తెలియదా? అప్పుడు ఎందుకు పెండ్లి చేసుకున్నావు. నీ అవసరం తీరాక ఇప్పుడు గుర్తుకు వచ్చిందా నీ వయసు? ఇంకా ఎంత మంది జీవితాలు నాశనం చేస్తావు. ఇద్దరు ఆడపిల్లతో నీ ఇంటికి వస్తే ఇలా మోసం చేస్తావా? ఆమెకు న్యాయం జరిగే వరకు నిన్ను వదిలేది లేదు'' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు. వద్దని ఎంత చెప్పినా స్వాతి అతనితోనే ఉంటానని మొండి కేసింది. సురేష్ కూడా భయంతో తనతో తీసుకెళ్ళడానికి అంగీకరించాడు.
పిల్లల్ని హాస్టల్లో చేర్చి అప్పుడు అతని దగ్గరకు వెళ్ళాల్సిందిగా లీగల్‌సెల్ సభ్యులు ఆమెకు సలహా ఇచ్చాడు. ఆ ఖర్చులు మొత్తం సురేష్ భరించాలి. ''నీ వల్ల స్వాతికి ఏదైనా సమస్య వస్తే తనకు అండగా మేముంటాం'' అని లీగల్‌సెల్ సభ్యులు అతనితో గట్టిగా చెప్పారు. దాంతో స్వాతి ధైర్యంగా సురేష్‌తో వెళ్ళింది. వారం తర్వాత స్వాతి ఫోన్ చేసి ''మేడమ్ పిల్లలను హాస్టల్లో చేర్పించాం. నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన గతంలో మాదిరిగా మాట్లాకపోయినా నన్ను మాత్రం ఇబ్బంది పెట్టడం లేదు'' అని సంతోషంగా చెప్పింది.
''అతను కేవలం భయపడి నిన్ను తీసుకెళ్ళాడు. అతని ప్రవర్తనలో చిన్న అనుమానం వచ్చినా వెంటనే అక్కడి నుండి వచ్చేసెరు. నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించకు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతకొచ్చు. అనవసరంగా సమస్యలు తెచ్చుకోకు. నువ్వు ఎంత చెప్పినా వినకపోయే సరికి వేరే దారి లేక అతని దగ్గరకు నిన్ను పంపించాం. నువ్వు అక్కడికి వెళ్ళడం మాకు అస్సలు ఇష్టం లేదు. వారం వారం మాకు కచ్చితంగా ఫోన్ చేసి అక్కడి విషయాలు చెబుతుండూ. అలాగే నువ్వు మాతో కాంటాక్ట్‌లో ఉంటున్నట్టు నీ భర్తకు కూడా తెలిసేలా మాట్లాడు. అప్పుడు జాగ్త్రగా ఉంటాడు. ఏది ఏమైనా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండూ'' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు.
''నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఎలాంటి అనుమానం వచ్చినా కచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. చాలా జాగ్రత్తగా ఉంటాను. కచ్చితంగా వారం వారం ఫోన్ చేస్తాను'' అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
స్వాతి భవిష్యత్ ఎలా ఉండబోతుందో అనుకుంటూ లీగల్‌సెల్ సభ్యులు మరో కేసులో లీనమయ్యారు...
- సలీమ