Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు సమస్యలుంటాయి... వాళ్లకేముంటాయి? స్కూల్‌కు డుమ్మాకొట్టడం, ఆడుకోవడం వంటివే కదా అని కొట్టి పారేయకండి. అనారోగ్యం, ఆత్మనూన్యతా, శక్తిలేకపోవడం, భయం, కోపం, అసహనం, నిరాశ, ఏకాగ్రత లేకపోవడం, విన్నది గ్రహించలేకపోవడం, తోటిపిల్లలతో కలవకపోవడం, కొత్త వ్యక్తుల వద్దకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం... వంటివెన్నో సమస్యలు. కానీ తల్లిదండ్రులు వాటిని పెద్దగా పట్టించుకోకుండా పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఇది తప్పు అంటున్నారు మానసిక నిపుణులు.
- పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలి. వారికి రోజువారీగా ఎదురయ్యే సమస్యల్నీ తెలుసుకోవాలి. వాళ్ల మనసును అర్థం చేసుకోవాలి. సరిగ్గా చదవకపోవడం, మాట వినకపోవడం, కోపం, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం, చిరాకూ.. ఇలా ప్రతివాటికీ ఏదో ఒక కారణం కచ్చితంగా ఉంటుందంటారు నిపుణులు. బలవంతంగా పంపిస్తే పిల్లలు వెళ్తారు కానీ అందులో అయిష్టతతోపాటూ కొన్నిసార్లు భయం కూడా ఉంటుందని మనం గుర్తించాలి. అలాగే పిల్లలు తినడానికి ఆసక్తి చూపించకపోయినా, నీరసంగా ఉంటోన్నా, ఏ కారణం లేకుండా చదువులో వెనుకబడుతున్నా కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఇక టీనేజ్‌లోకి అడుగుపెట్టే అమ్మాయిల ఆలోచనా విధానం మరో రకంగా ఉంటుంది. శారీరకంగా రకరకాల మార్పులు వస్తాయి. వాటిని వాళ్లు వ్యక్తం చేయలేరు. అందంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంకోవైపు చదువులు. వెరసి అన్నీ కలిసి తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడినీ, బాధనీ అర్థం చేసుకోగలగాలి.
- బంధువులూ, పరిచయస్తులు లేదా చుట్టుపక్కల వాళ్లని చూసి పిల్లలు భయపడితే దానికి కారణం కనిపెట్టాలి. సమస్యను తెలుసుకుని ధైర్యం చెబుతూనే పరిష్కరించాలి. కొందరిలో చీకటి, మరికొందరిలో ఒంటరిగా నిద్రపోవడం అంటే భయం. ఇటువంటి వాటిని హేళన చేయకూడదు. తగిన కారణాన్ని కనిపెట్టి, పరిష్కారాన్ని అందించాలి. చదువు పేరుతో, లేదా తల్లిదండ్రులకు ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారినప్పుడు పిల్లలను వేరే పాఠశాలకు మార్చడం సహజం. అక్కడి తోటివారితో స్నేహం కుదిరేలా చేయడం, తరచూ ఉపాధ్యాయులను కలిసి వారి ప్రవర్తనను కనుక్కుంటూ ఉండటం వల్ల పిల్లల్లో నైరాశ్యం ఎదురుకాదు.
- చాలామంది పిల్లలకి తల్లిదండ్రులంటే భయం ఉంటుంది. ఏం చేస్తే ఏమంటారో, ఎలాంటి శిక్ష విధిస్తారో అనుకుంటారు. దాంతో నటించే ప్రయత్నం చేస్తారు. అన్నీ వింటున్నట్టే ఉంటారు. ఈ క్రమంలో బాగా ఒత్తిడికి లోనవుతారు. అందుకే పిల్లల్ని ఒక స్థాయి వరకే భయపెట్టాలి తప్ప.. మితిమీరి కాదు. అలానే పెద్దలంటే ప్రేమా, గౌరవమర్యాదలు అలవాటు చేయాలి.
- చిన్నారులకు ఆరోగ్యం మీద అవగాహన ఉండదు. చదువులూ, పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో వారు ఆ దిశగానే ఆలోచిస్తారు తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోరు. దాంతో వారు నీరసంగా ఉన్నా.. శక్తి లేకపోయినా అలానే ఉంటారు. అందుకే వారి ఆరోగ్యాన్ని గమనించాలి. చెప్పట్లేదు కదాని వదిలేయకూడదు. చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టే.. పోషకాహారం మీదా ద ష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తూ ఉత్సాహంగా ఉండేలా చూడాలి. ఏ చిన్న సమస్య చెప్పినా తేలిగ్గా కొట్టిపారేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్లలో భయాన్ని పోగొడుతున్నామని అనుకుంటాం కానీ... కాదు. వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి. అర్థంచేసుకోవాలి. ఎంత చిన్న సమస్య అయినా పరిష్కారం దిశగా ఆలోచించాలి. అప్పుడే వాళ్లు ప్రతిదీ చెప్పడానికి ముందుకొస్తారు.
- ఆడి పాడాల్సిన వయసులో పిల్లలు ముభావంగా ఉంటుంటే ఏ అనారోగ్యమో అని తేలిగ్గా తీసుకోవద్దు. రోజుకంటే ఏ రోజు కాస్త భిన్నంగా కనిపించినా ఆరా తీయండి. వారి చిన్ని కష్టాన్ని అర్థంచేసుకోండి. వారి వైపు నుంచి ఆలోచించండి. వారి మనసుకి మీరు దగ్గర కాగలిగితే అపోహలూ, భయాలనూ దూరం చేయగలుగుతారు. పిల్లల్లో ఒత్తిడికీ, సమస్యలు మొదలవడానికి.. కొన్నిసార్లు తల్లిదండ్రులతో దూరం పెరగడమూ ఓ కారణమే. మీ ఇంట్లో పరిస్థితీ అదే అయితే.. మీరెంత తీరిక లేకున్నా గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోండి. వీలైతే కలిసి భోజనం చేయడం, వారి స్కూలూ, స్నేహితులూ ఇతర విషయాలను తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడే వారు ఉత్సాహంగా ఉండగలుగుతారు.