Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే నిద్రలేచి చదువుకోవాలీ, వ్యాయామం చేసేయాలీ... ఎక్కువ సేపు ఫోను చూడకూడదు... ఇలా ఎన్నో అనుకుంటాం కానీ నాలుగు రోజులకే ఆ ఉత్సాహం ఆవిరైపోతుంది. దానికి కారణం అనుకోవడం కన్నా... అనుకున్న పని కచ్చితంగా చేయాలంటే 21 రోజులపాటు కొనసాగించాలంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల అదో అలవాటుగా మారుతుందనీ... ఇక మానేసే పరిస్థితి ఎదురుకాదనీ చెబుతున్నారు.
- అప్పటివరకూ ఉన్న చెడు అలవాట్లను పక్కన పెట్టి, మంచి అలవాట్లను పెంచుకోవాలనుకున్నవారికి 21 రోజులు సవాలుగా తీసుకోవాలి. ఓ అరగంట ముందు నిద్రలేవడం, వ్యాయామం చేయాలనుకోవడం...ఏదయినా సరే ఇరవైఒక్క రోజులు కచ్చితంగా విరామం లేకుండా చేస్తే ఇక మానమన్నా మానేయలేరట.
- విపరీతంగా టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు దాన్ని మానేయాలనుకుంటే ఈ సవాలును స్వీకరించొచ్చు. వాటికి బదులుగా గ్రీన్‌టీ లేదా అల్లం టీ ని తాగడం మొదలుపెట్టాలి. కష్టమనిపించినా బలవంతంగానైనా తీసుకోవడం మొదలుపెడితే అలవాటైపోతుంది.
- మీరు రోజులో అధికసమయాన్ని టీవీకి వెచ్చించే అలవాటుంటే దానిని తగ్గించడానికి ఓ మంచి ప్రయత్నం ఇది. ముందు భోజనం చేసే సమయంలో టీవీ చూడటం మానేయాలి. తరువాత ఆ సమయాన్ని ఇంకాస్త కుదించుకుని ఏ పుస్తకమో చదవడం మొదలుపెట్టి చూడండి.
- సామాజిక మాధ్యమాలతో సమయం వృథా అనుకునేవారు దాన్నుంచి బయటపడాలంటే ఓ ఇరవైఒక్క రోజులు ఆ సమయాన్ని కుదించే ప్రయత్నం చేయండి. రోజులో ఓ అరగంట మాత్రమే వాటిని చూడండి. ముఖ్యమైన వాటినే చూసి, అవసరం అనుకున్నవాటికి సమాధానాలు ఇచ్చేలా చూసుకుంటే... మీలో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.