Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసవం తర్వాత స్త్రీల శరీర ఆకృతిలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చాలా మంది ఎక్కువ లావవుతారు. ఏ కొద్ది మందో చిన్న చిన్న మార్పులకు లోనవుతారు. వీటిలో ఎక్కువగా ఇబ్బంది కలిగించే విషయం పొట్ట పెరగడం. ఈ సమస్యలను అధిగమించ డానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా కష్టమనే చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఆరోగ్య నియమాలు పాటించాలి. ఎక్కువగా ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. వీటితో పాటు పండ్లు, జ్యూస్‌లు, సూప్‌లు తీసుకుంటే మేలు. వీటన్నింటిని సహనం, సానుకూల దృక్పథంతో ప్రయత్నించాలి. అంతేకాదు, కొన్ని రకాల వ్యాయామాలు అనుసరించడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రోజువారీ తీసుకునే ఆహారంలో ఫైబర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. అవి కూడా సులభంగా కరిగేవిలా ఉండాలి. ఉదాహరణకు హోల్ గ్రైన్స్, బెర్రీలు, బ్రౌన్ రైస్, పండ్లలో సులభంగా కరిగే ఫైబర్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ ఫైబర్లు జీర్ణక్రియను మెరుగుపరిచి, అదనపు కొవ్వు పదార్థాలు, చక్కెరలు, పిండి పదార్థాలను గ్రహించడాన్ని, నిల్వలను తగ్గిస్తాయి. వరి, ఓట్స్, బార్లీ వంటి వాటిలో నీటిలో కరిగే ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల ఆకలి ఎక్కువగా అనిపించదు. ప్రసవం తర్వాత ఏర్పడే అధిక ఆకలిని అదుపులో ఉంచి శరీర బరువును తగ్గిస్తుంది.
భోజనంలో భాగంగా పండ్లు
ప్రతి రోజు ఐదు రకాల పండ్లను తిన్నాలి. ప్రసవం తర్వాత పాటించే ఆహార ప్రణాళికలో అధిక మొత్తంలో ఆకు కూరలు, పండ్లు ఉండేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. కొన్నిసార్లు, భోజనానికి బదులుగా కేవలం పండ్లను మాత్రమే తినవచ్చు.
శరీరం హైడ్రెటేడ్గా..
ప్రసవం తర్వాత శరీర బరువును తగ్గించుకోటానికి అందుబాటులో ఉన్న మరొక పద్ధతి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవటం. అధికంగా నీటిని తాగటం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దీని వల్ల శరీర బరువు తగ్గుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు మంచి నీటిని తాగితే ఆకలిగా అనిపించటం తగ్గుతుంది. అధికంగా ఆహారం తీసుకోవడం నియంత్రణలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రసవం తర్వాత శరీర బరువు తగ్గుతారు.
సూప్స్‌తో..
గర్భం తరువాత శరీర బరువు తగ్గించుకోటానికి వారంలో నాలుగు సార్లు సూప్‌లను తాగాలి. అధిక బరువును తగ్గించుకోవడానికి ఈ పద్ధతి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సూప్‌లలో తక్కువ క్యాలరీలు, అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది.
క్యాలరీల సమతుల్యత
బరువు నియంత్రణ అనేది మనం తీసుకునే, ఖర్చు చేసే క్యాలరీలపై ఆధారపడి ఉంటుంది. భోజనం ఎక్కువగా చేసి అధిక క్యాలరీలను తీసుకుంటే, తర్వాత స్నాక్‌లో క్యాలరీలను తక్కువగా తీసుకోవాలి. ఇలా రోజు తీసుకునే ఆహారంలో ఉండే క్యాలరీల సంఖ్యపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటే రాత్రి తక్కువ క్యాలరీలను అందించే బటర్ మిల్క్ లేదా మీగడ తీసిన పాలను తాగాలి. తీసుకునే క్యాలరీల లెక్కింపుతో పాటుగా, వ్యాయామాలు, ఇతర పనుల ద్వారా ఖర్చు చేసే క్యాలరీల సంఖ్యను కూడా లెక్కించాలి.
చాక్లెట్లకు నో..
చిన్న పిల్లలే కాదు పెద్ద వారు కూడా చాక్లెట్లంటే అమితాసక్తి చూపిస్తారు. రుచికి బాగున్నా, పోషకాలను తక్కువ స్థాయిలో అందిస్తాయి. చాక్లెట్ షేక్స్, హాట్ చాక్లెట్, చల్లబరచిన చాక్లెట్ ద్రావణాలు వంటి వాటిల్లో తక్కువ స్థాయిలో పోషకాలు ఉంటాయి. తినే చాక్లెట్ల కన్నా చాక్లెట్ ద్రావణాల ద్వారా శరీరానికి అధిక మొత్తంలో క్యాలరీలు అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటికి దూరంగా ఉంటే మంచిది. వీటి వల్ల వారి ప్రయత్నం విఫలమవుతుంది.
ఇలా తీసుకునే ఆహారంలో క్యాలరీల స్థాయిని సమం చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే శరీర బరువును కొంతైనా తగ్గించుకోవచ్చు.