Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాయామం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
- గుండె సామర్థ్యాన్ని పెంచె (కార్డియో) వ్యాయామాల తర్వాత కాస్త నీరసంగానే అనిపిస్తుంది. కానీ గంటాగంటన్నర తర్వాత మీలో కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. శరీరం ఒక్కసారిగా తేలిగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా నీరసం, తలతిరగడం వంటివి కొనసాగితే, వ్యాయామం చేసిన ప్రతిసారీ ఇలాగే ఉంటే మీరు అవసరానికంటే ఎక్కువగా కష్టపడుతున్నారని గుర్తించాలి.
- మంచి వ్యాయామం ఆకలిని పెంచి, గాఢమైన నిద్రని అందిస్తుంది. కానీ అతిగా చేసినప్పుడు శరీరం మరింతగా పోషకాలని కోరుకుంటుంది. మామూలుకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తుల్ని తీసుకోవాల్సి వస్తుంది ! అవి తీసుకోకపోతే ఆకలి లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- వ్యాయామం మన ఉద్వేగాలని అదుపు చేసుకోవడానికీ ఎంతో ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. కానీ అతిగా వ్యాయామం చేస్తే చిరాకు గా అనిపిస్తుంది. గుండెదడ, బీపీ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి మానసిక ఆందోళనకు కారణం అవుతాయి.
- వ్యాయామం చేసేటప్పుడు నొప్పులు ఏర్పడటం సహజమే కానీ.. అవి రెండు మూడురోజులకన్నా ఎక్కువగా కొనసాగకూడదు. కొనసాగితే వ్యాయామం తప్పుగానో లేదా అతిగానో చేస్తున్నారనే అర్థం. ఓసారి మీరు చేసే వ్యాయామాల పరిమాణం, వెచ్చిస్తున్న సమయాన్ని పరిశీలించి.. వాటి మోతాదు తగ్గించండి. అవసరమైతే పూర్తిగా భిన్నమైన వాటిని ఎంచుకోండి. లేదా వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్నా మంచిదే.