Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది స్ప్రింటర్ హిమదాస్. ఫిన్లాండ్లోని తాంపెరెలో జరిగిన అండర్ 20 అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్లో ఆమె స్వర్ణం సాధించింది. 18 ఏళ్ల హిమ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా కూడా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరసన నిలిచింది. ప్రపంచ అండర్- 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అసోంలోని నాగావ్ జిల్లాలోని కండూల్మరి.. హిమ సొంతూరు. తండ్రి వ్యవసాయం చేస్తాడు. వరి పండిస్తాడు. ఆ వరిపొల్లాల్లోని గట్లపైనే హిమ ప్రాక్టీస్ చేసింది. ఐదుగురు సంతానంలో అందరికంటే చిన్నది హిమ. అథ్లెట్ కావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అందుకు కారణం దానికి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించేంత ఆర్థిక సామర్థ్యం తల్లిదండ్రులకు లేకపోవడం ఒకటైతే. గ్రామంలో ఎలాంటి వసతులు ఉండకపోవడం మరోటి. అందుకే ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడుతూ ఉండేది. అయితే 2016లో ఆమెలోని స్పోర్టివ్ స్పిరిట్‌ను చూసిన పీఈటీ టీచర్... టీమ్బాల్ కాకుండా ఏదైనా ఇండివిడ్యువల్ గేమ్ తీసుకోమని సలహా ఇచ్చారు. అలాగని ఆమె హడావుడి పడిపోలేదు. మొదట ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన హిమ.. రేసింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నది రెండేండ్ల కిందటే. 18 నెలల కిందట మొట్టమొదటిసారి అస్సామ్‌లోని శివసాగర్‌లో జరిగిన అంతర్జిల్లా పోటీల్లో పాల్గొన్నది. తక్కువ ఖరీదు ఉన్న స్పైక్ షూస్‌తో చిరుతలా పరుగెత్తుతున్న హిమను అథ్లెటిక్స్ కోచ్ నిపుణ్ చూశారు. అక్కడ 200 మీటర్లు, 100 మీటర్ల కేటగిరీల్లో స్వర్ణాలు గెలుచుకుంది హిమ. ఆమెలోని నైపుణ్యాన్ని చూసిన నిపుణ్ ఆమెను గౌహవటికి మారాలని సూచించాడు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. సొంతూరుకు 140 కిలోమీటర్ల దూరం. ట్రైనింగ్ అంటే.. చాలా ఆలోచించింది. తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. అయినా నిపుణ్ పట్టు వదలలేదు. అథ్లెటిక్స్‌లో ఎంతో భవిష్యత్ ఉందని హిమను ఒప్పించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో అద్దెకు ఉన్నది. నిజానికి ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అథ్లెట్స్‌కు సపరేట్ వింగ్ లేదు. బాక్సింగ్, ఫుట్‌బాల్ కు మాత్రమే ఉంది. అయినా ఆమెకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రవేశం దొరకడానికి చాలా కష్టపడ్డారు. ఎన్నో పరీక్షలు. అన్నింట్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది హిమ. దాంతో అధికారులు అంగీకరించారు. హిమ అలుపెరుగని సాధన చేసింది. కోచ్ నిత్యం చెప్పింది ఒక్కటే... 'నైపుణ్యం కొందరికే ఉంటుంది. దానికి పదును పెడితే సక్సెస్ సొంతమవుతుంది. పెద్ద కలలు కను' అని. ఆమె ఏషియన్ గేమ్స్ కల గన్నది. కానీ... ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగింది.