Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీ అంటే ప్రతి ఒక్కరికీ భలే క్రేజీ. అలా బాడీ మార్చుకోవాలంటే చాలా కష్టాలు పడాలి. మగవారు అంటే ఏదోలా కష్టపడి ఆ ప్యాక్స్ సాధిస్తారు. కానీ ఒక అమ్మాయి సిక్స్ ప్యాక్ బాడీతో పాటు మగవారికన్నా చాలా స్ట్రాంగ్ తయారైంది. 'స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' పోటీలు సాధారణంగా పురుషుల కోసం జరుగుతాయి. అలాంటి పోటీల్లో పాతికేళ్ల ప్రియాంక వైశ్య అండర్ 30 విభాగంలో పాల్గొంది. 'స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' కిరీటాన్నీ అందుకుంది.
స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' పోటీల్లో మహిళలకు తొలిసారిగా 2017 నుంచే అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో120 కిలోల బరువులెత్తడం, 40 కిలోల రాయిని మోయడం ఇలా ఎన్నో ఉంటాయి. అయినా భయపడకుండా వెళ్లింది. అలా పాల్గొన్న మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. పోటిల్లో ప్రథమ స్థానంలోనూ నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో జరిగిన పోటీల్లో కిరీటాన్ని అందుకుంది. ప్రపంచంలోనే మహిళా బాడీబిల్డర్‌గా ప్రియాంక ర్యాంకు 44.
సంతృప్తి లేక గతంలో ఈమె ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేది. కానీ ఆమెకు ఆ ఉద్యోగంలో అంతగా సంతృప్తి లభించేది కాదు. అందరి మాదిరిగా మూసధోరణిలో వెళ్లాలని ఆమె అనుకునేది కాదు. తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకోవాలని ఎప్పుడూ పరితపించేంది.
బాడీ బిల్డింగ్ రంగంలోకి ప్రియాంకకు ఒక బాడీ బిల్డర్ పరిచయం అయ్యారు. ఆయనతో మాట్లాడాకే ప్రియాంకకు బాడీ బిల్డింగ్ రంగంలోకి రావాలని అనిపించింది. వెంటనే ఉద్యోగం మానేసింది.
రోజంతా జిమ్‌లోనే
ప్రియాంక భోపాల్ వెళ్లింది. అక్కడ బాడీబిల్డింగ్‌లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో ప్రియాంక రోజంతా జిమ్‌లోనే ఉండేది. ఎన్నో రకాల కసరత్తులు చేసేది. అలా తన బాడీ రూపరేఖలు మార్చేసుకుంది.
మహిళలకు అవకాశం
గతంలో 'స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' పోటీల్లో పాల్గొనేందుకు మహిళలకు అవకాశం ఉండేది కాదు. కానీ 2017లో మొదటిసారి మహిళలకు కూడా అవకాశం కల్పించారు. అందులో చాలా రకాల విన్యాసాలు చేయాల్సి ఉంటుంది.ఫస్ట్ టైటిల్ 120 కిలోల బరువులెత్తడం, 40 కిలోల రాయిని మోయడం ఇలా చాలా రకాల పోటీలుంటాయి. వాటన్నింటినీ అలవోకగా చేసేసి ఫస్ట్ టైటిల్స్ గెలుచుకుంది ప్రియాంక.
రెండోసారి టైటిల్
గతేడాది కోల్‌కతాలో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా పోటీల్లో పాల్గొని ప్రియాంక మొదటి సారి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక గత నెలలో ఢిల్లీలో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా పోటీల్లో రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది.
ఆసక్తి ఉన్నవారికి శిక్షణ
ఓ వైపు పోటీల్లో పాల్గొంటూనే, మరోవైపు ఈ రంగంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణనివ్వడానికి భోజ్‌పూర్ క్లబ్‌ను ప్రారంభించింది. ప్రియాంకను స్ఫూర్తిగా తీసుకుని యువతులు ఆమె వద్దే శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం భోపాల్‌లో నిర్వహిస్తున్న ఈ క్లబ్లో బాడీబిల్డింగ్‌పై యువతులకు శిక్షణనందిస్తోంది.
ఇదే నా లక్ష్యం
''ఈ ఏడాది నవంబరులో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గెలవడమే నా లక్ష్యం. దీనికోసం ఇప్పటినుంచే తెల్లవారుజామున 4.30 గంటల నుంచి దాదాపు పది గంటల పాటు జిమ్‌లో సాధన చేస్తున్నాను. నా స్నేహితులు చాలా మంది ఇప్పుడు నెలకు లక్షల్లో జీతం తీసుకుంటారు. కానీ వారికి నా మాదిరిగా సిక్స్ ప్యాక్ ఆబ్స్ లేవు కదా, అందుకే నేను వాళ్లకన్నా బెటర్ గానే ఉన్నానని ఫీలవుతున్నా'' అంటోంది ప్రియాంక.