Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. అందులోనూ చిన్న పిల్లలకు మరీ ముఖ్యం. ఎందుకంటే చిన్నతనంలో మనం వారికి నేర్పినవే వయసు పెరిగే కొద్దీ అలవాటుగా మారతాయి. అందుకే చిన్నతనం నుంచే పిల్లలకు విలువలతో పాటు డబ్బుకు సంబంధించిన అలవాట్లను కూడా నేర్పాలి. వారికి అర్థమయ్యేల చెప్పడం కాస్త కష్టమే. అయితే ఓపికతో చెబితే మాత్రం వింటారు. అయితే ఆర్థిక క్రమశిక్షణ అనేది ముందు పెద్దలుగా మనం అనుసరించాలి. అదేలాగో చూద్దాం.
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచుతారు. వారు జీవితంలో పడిన కష్టాలు పిల్లలు పడకూడదని భావిస్తారు. దేనికీ లోటు లేకుండా చూడాలని అనుకుంటారు. పిల్లలు అడిగిందల్లా కొనిపెడుతుంటారు. దీని వల్ల పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పోతుంది. పెద్దయ్యాక వాళ్లు కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఏది పడితే అది కొని డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు గురించి పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి.
సర్దుబాటు చేసుకునేలా
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ నెలజీతం వచ్చిన వెంటనే ఎంతో కొంత పక్కకు తీసి పొదుపు చేయాలి. ఆర్ధిక నిపుణుల సూచనల ప్రకారం ప్రతినెలా మన ఆదాయంలో 15 శాతం పొదుపు చేయాలి. ఎందుకంటే భవిష్యత్లో ఏదైనా అనుకొని అత్యవసర పరిస్ధితి వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాటికోసం అప్పుచేయాల్సి రావొచ్చు. మీరు చేసే నెలనెలా పొదుపు భవిష్యత్లో మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే పిల్లల్ని కూడా మీరిచ్చే పాకెట్ మనీ నుండి కొంత దాచుకోవల్సిందిగా చెప్పాలి. ఒక నెలలో ఏదైనా సమస్య వచ్చి మీరు ఇవ్వలేకపోతే ''దాచిపెట్టుకున్న డబ్బును వచ్చే నెలకు కూడా సర్దుబాటు చేసుకో.. '' అని చెప్పండి. మీరు ఇలా చేయడం వల్ల ఒక నెల ఖర్చులనే రెండు నెలలకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకుంటారు.
ఎలా పొదుపు చేయాలో నేర్పాలి?
పొదుపు డబ్బుతోనే...
ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చేతి ఖర్చుల కోసమని ప్రతి నెలా ఎంతో కొంత ఇస్తుంటారు. ఇదిగాక మధ్యలో ఏదైనా అడిగితే కొనిపెడుతుంటారు. ఇలా చేయకుండా... ఏదైనా చిన్న చిన్న బొమ్మల్లాంటివి కొనుక్కోవాలనుకుంటే ప్రతి నెలా చేతి ఖర్చుల కోసం వారికి ఇచ్చే డబ్బుల్లో పొదుపు చేసి కొనుక్కోవాలని చెప్పండి. దీంతో వారికి చిన్నప్పటి నుంచి పొదుపు అలవాటవుతుంది.
కష్టం విలువ తెలిస్తే...
కష్టపడితేనే డబ్బు సంపాదించగలిగేది. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇందుకోసం వారికి కూడా కొన్ని పనులు అప్పగించి పూర్తి చేయాల్సిందిగా చెప్పండి. అప్పగించిన పనులు పూర్తి చేసినపుడు వారికి కొన్ని బహుమతులు ఇవ్వండి. ఆ పనిని అద్భుతంగా చేస్తే ఇంకా మంచి బహుమతి ఇవ్వండి. దాంతో పిల్లలకు చిన్నప్పటి నుంచే 'కష్టం' విలువ తెలుస్తుంది.అలాగే కష్టపడి డబ్బు సంపాదించడంతో పాటు తెలివిగా అదనపు డబ్బు సంపాదించడం కూడా పిల్లలకు నేర్పాలి. పెద్దవాళ్లయిన పిల్లలకు ఈ విషయం బాగా అర్ధమవుతుంది.
అప్పు ముప్పు
కొంతమంది ఏ చిన్న అవసరం వచ్చినా అప్పులు చేస్తుంటారు. ఇదే అలవాటు వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. అప్పు చేయడం అనేది ఎప్పటికైనా ముప్పు. దీన్ని పెద్దలు అర్థం చేసుకుని ఇదే విషయాన్ని పిల్లలకు తెలియజేయండి. చదువు, ఆస్తుల కొనుకోలు, అత్యవరాల కోసం తప్ప అప్పు చేయడం లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదనే విషయం పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. శక్తికి మించి ఎడాపెడా అప్పులు చేస్తూ పోతే వడ్డీల మీద వడ్డీలు కట్టి ఆర్థికంగా ఎలా నష్టపోతామనే విషయం కూడా తెలియజేయాలి.