Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యవంతమైన జీవనంతో పాటే సక్సెస్ఫుల్ కెరీర్ కావాలంటే మీ దినచర్యను ఒకసారి గమనించండి. ఉరుకుల పరుగుల జీవితంలో మీరు కోల్పోతున్నది ఏంటో ముందుగా తెలుసుకోవాలి. ప్రశాంత జీవనం మీ సొంతం కావాలంటే.. మీ జీవిత గమనాన్ని పరిశీలించండి. చాలా మంది ఆఫీసు టైం అయిపోయాక కూడా పని చేస్తుంటారు. మరికొంత మంది సెలవుల్లో ఇంటి దగ్గరున్నా ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లతో పనిచేస్తుంటారు. ఆఫీసు పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం లేకపోతే ఆరోగ్యం, కెరీర్ రెండూ దెబ్బతింటాయని అనేక పరిశోధనల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
- మీరు చేయాల్సిన పనులలోంచి అతి ముఖ్యమైన వాటిని ఎంచుకోండి. వాటిని ఒకటి, రెండు, మూడు... ఇలా వరుసగా రాసుకోవాలి. వాటిలో మీ మనసు ముఖ్యమైన పనులుగా భావించే వాటికే ప్రాధాన్యం ఇచ్చి.. ముందుగా పూర్తి చేయండి.
- మీ రోజువారీ జీవితంలో ఎక్కడ సమయం వ థా అవుతోందో గుర్తించండి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించి.. ప్రణాళిక వేసుకోండి.
- ఒకేసారి రెండు మూడు పనులు పూర్తి చేయాలని చూడొద్దు. దానివల్ల మీరు బిజీ కావడంతో పాటు పనిలో నాణ్యత దెబ్బతింటుంది.
- చిన్నప్పుడు స్కూలుకు దసరా, సంక్రాతి సెలవులిచ్చినట్టే.. మీ ఆఫీసు పనికి మీరే సెలవివ్వండి. బ్యాగూ, సూట్‌కేస్‌లు సర్దుకొని ఎంచక్కా నచ్చిన ప్రదేశానికి చెక్కేయండి. ఏడాదిలో కనీసం మూడువారాల పాటు ఇలా చేస్తే... లైఫ్ బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. తిరిగొచ్చాక ఆఫీసు పనిని మరింత చక్కగా చేయగలుగుతారు.
- అవసరమనుకుంటే మీకంటూ ఒక మెంటర్‌ను ఏర్పాటు చేసుకోండి. పనిని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయటానికి వారి అనుభవం మీకు అక్కరకొస్తుంది.
- రోజుకో గంట వ్యాయామాలకు కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతమైన మనస్సుతో పనిచేయటం వల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది.
- మీ కుటుంబ సభ్యులతో రోజూ కొంత సేపు గడపండి. సమయంలో పూర్తిగా వారితో మమేకమవ్వండి. ఆ సమయంలో మరే పని గురించి ఆలోచించవద్దు.
- జీవితంలో మీకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకోండి. ఎంత అత్యవసర పరిస్థితులున్నా.. ఆ సమయం మీ ఆనందం కోసమేనని గుర్తించండి. అదేపనిగా తలకు మించిన పని మీదేసుకోవద్దు.