Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాతృత్వం స్త్రీకి ఓ అద్భుతమైన అనుభవం. తల్లి అయిన దగ్గర నుందీ ఆ బిడ్డ రూపాన్ని ఊహించుకుంటూ ప్రసవ వేదనకు సైతం సంసిధ్ధమవుతుంది. కానీ బిడ్డ గురించి ఎన్నో కలలు కంటున్న ఆతల్లికి అవే కల్లలవుతాయని తెలిసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భ ధారణ ఎంత సహజంగా జరుగుతుందో అంతే సహజంగా కొన్ని కారణాల వల్ల గర్భ స్రావం జరిగే అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- 19 నుంచి 24 ఏండ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏండ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏండ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది. కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇదే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్.
- పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు, నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా అంతకు ముందు జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం, అనేక మార్లు గర్భస్రావం జరగడం, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్ఫెక్షను సోకకుండా సర్విక్స్ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.
- కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం, అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.
ఈ సమస్యకు పరిష్కారం
- రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్ చేయొచ్చు.
- అబార్షన్ అయినప్పుడు పిండాన్ని విశ్లే షణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
- మేనరికంలో వివాహం అయితే దంప తులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.
- గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించొచ్చు.
- గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి.