Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్న : మేడమ్, మా తల్లిదండ్రులకు మేం ఇద్దరం అమ్మాయిలం. నాన్న రిటైర్డ్ అయ్యినప్పుడు వచ్చిన డబ్బులతో నాకు పెండ్లి చేశారు. మంచి సంబంధం, అబ్బాయికి మంచి ఉద్యోగం అని వారు దాచుకున్న డబ్బులన్నీ పెట్టి నా పెండ్లి చేశారు. కట్నం రూపంలో ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెండ్లి కోసం ఖర్చు చేయించారు. 20లక్షల రూపాయాలు పెండ్లికి ఖర్చు చేశారు. పెండ్లి అయిన తర్వాత మూడురాత్రుల అప్పుడు మా ఆయన తప్పించుకుని తిరిగారు. ఎవో సాకులు చెబుతూ.. దాదాపు నెలరోజులు ఆయన నాకు దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత తెలిసింది. ఆయన సంసారానికి పనికి రాడని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ నిజం తెలిస్తే.. మా అమ్మనాన్న తట్టుకోలేరు. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి.
జవాబు : ఈ మధ్యకాలంలో ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. మగవారిలో ఉన్న లోపాన్ని బయటకు తెలియని వ్వకుండా ఏదో సమాజం కోసం పెండ్లి చేసు కుంటున్నారు. ఒకసారి పెండ్లి అయితే చాలు అనుకుని ఆడవారి జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ విషయం లో మీరు చేసిన తప్పు ఏమీ లేదు. కాని, మీ అత్తింటి వారు చేసిన తప్పులకు మీరు బాధను అనుభ విస్తున్నారు.
పెండ్లి అనే బంధం విలువ ఎవరికీ పూర్తిగా తెలియడం లేదు. హంగులతో, ఆర్భాటాలతో పెండ్లి చేయడం స్టేటస్ అనుకుంటున్నారు. కట్నాల కన్నా ఎక్కువ ఖర్చులే ఉంటున్నాయి. మీరు కేసు పెడితే అవతలి వారికి శిక్ష పడుతుంది. కానీ, పెండ్లి ఖర్చులు, కట్నాలు వెనక్కి ఇప్పించండం చాలా వరకు సాధ్యపడదు. కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక మీ కేసు విషయంలో వాళ్లు చేసిన తప్పులు చాలానే ఉన్నాయి. ముందుగా మీరు పెండ్లి పెద్దలను, ఇరువైపుల పెద్దలను కూర్చోబెట్టి సమస్య వారికి చెప్పి పరిష్కరించ డానికి ప్రయత్నం చేయండి. అప్పటికీ సమస్య ఒక కొలిక్కి రాకపోతే కేసు ఫైల్ చేయండి. మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 498(ఎ) 3, 4 గృహహింస చట్టంతో పాటు ఐపిసి 420 సెక్షన్ కింద కేసు ఫైల్ చేయండి. మీకు జరిగిన అన్యాయం గురించి పూర్తిగా తెలియచేస్తే పోలీసులు ఇంకా కొన్ని అవసరమైన సెక్షన్లు కూడా జత చేస్తారు.
ఢిల్లీ హైకోర్టు ఇటువంటి కేసుల విషయంలో సంచలనమైన సూచనలు చేశారు. హెచ్ఐవి గురించి పెండ్లి కి ముందు ఏ విధంగా అయితే పరీక్ష చేసి తెలుసుకోవాలో అదేవిధంగా వారి ఆరోగ్య పరిస్థితిపై, సంసారానికి ఎంత వరకు పనికివస్తారో వైద్యపరీక్షలు చేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
- రమ్యకుమారి
హైకోర్టు న్యాయవాది