Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెక్కిరించడం, హేళన చెయ్యటం, బెదిరించడటం ఒక రకంగా చెప్పాలంటే టీజింగ్ అనుకోండి. ఈ టీజింగ్కి గురి అవుతున్న పిల్లలు మానసికంగా కుంగిపోతారు. రకరకాల ఆలోచనలతో వారి మనసు ఆందోళన చెందుతుంది. అయితే ఘర్షణలు, అభిప్రాయ భేదాలు అన్ని చోట్లా ఉండేవే. అలాంటి వాటి నుంచి పిల్లలు త్వరగా బయట పడేలా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. అదెలాగో తెలుసుకుందాం.
పరిశీలించిన తర్వాతే:
అభిప్రాయభేదాలతో పిల్లల మధ్య చర్చలు, చిన్నపాటి ఘర్షణలు జరుగుతుంటే వెంటనే మీరు జొరబడకుండా కొంచెం ఓపిక పట్టండి. మీ చిన్నారి ఇలాంటి పరిస్థితికి గురి అవుతోందా గమనించండి. సరియిన తిండి, కంటినిండా నిద్రా స్కూల్లో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించండి. ఏమన్నా తేడా కనిపిస్తే అది ఏ విషయాలలో మార్పు అనేది స్పష్టంగా కనిపెట్టండి. ఉదాహరణకి స్కూల్లో ఆమెను ఎవరైన పదే పదే మాటలతో కాని చేతలతో కాని అవమానిస్తున్నట్లయితే ఆమెకి అక్కడ మీ అవసరం ఉందా అని తెలుసుకుని మీ సపోర్ట్ ఇవ్వటానికి ముందుకు కదలండి.
అవగాహన కల్పించండి
ముందుగా మీ బిడ్డకి టీజింగ్ని గురించి సరియిన అవగాహన కల్పించండి. ఎప్పుడు ఎలా ఎలాంటి సందర్భాలలో జరుగవచ్చు అనేది తెలియచేయండి. ఇలాంటివి చాలా మంది పిల్లలు ఎదుర్కొంటూనే ఉంటారని తెలియచేసినప్పుడు మీ పిల్లలకు కూడా తట్టుకుని నిలబడే ధైర్యం కలుగుతుంది.
మీరు మీ చిన్నతనంలో ఎదుర్కొన్న అనుభవాలను కూడా వారికి తెలియ చేస్తే, తమకే కాదు అందరి ఆత్మ విశ్వాసంతో జీవితాల్లో ఇలాంటి కొద్దో గొప్పో అనుభవాలు ఉంటాయని తెలు స్తుంది. మీ పిల్లలకు ఆత్మ విశ్వాసం కల్పించేలా పిల్లలకి ''ఏడిస్తే ఇంకా ఏడిపిస్తారు'' అని చెబుతుంటాం. అలాగే ఎవరైనా ఏడిపిస్తుంటే బెంగపడకుండా, భయపడకుండా నిశ్శబ్దంగా నిబ్బరంగా ఉండమని చెప్పండి. దీంతో ఆ టీజర్ మీ పిల్లవాడిని ఏమి చెయ్యలేక వెనకడుగు వేసే అవకాశం ఉంది.కథల రూపంలో కొన్ని పాత్రలు సృష్టించి చెప్పటం, అప్పుడప్పుడు ఇంట్లోనే చిన్న చిన్న స్కిట్లు చేస్తుంటే మీ పిల్లలకి బయటి వారితో ఎలా మెలగాలో తెలుస్తుంది. ఇంకా ఒక్క నిమిషం కండ్లు మూసుకుని గాలి పీల్చి వదలమని చెప్పండి. అంతేకాక ఈ సందర్భాన్ని నేను హేండిల్ చేసుకోగలను అనే ఆలోచన చేయమని చెప్పండి. అందువల్ల మన పిల్లవాడికి ఏడుపు రాకుండా, కోపం రాకుండా స్థిరంగా నిలిచే శక్తి వస్తుంది.
స్నేహితుల సహాయంతో
పిల్లలు ఒంటరిగా ఉండకుండా మంచి స్నేహితులని సంపాదించుకోవటం ఒక తరుణోపాయం. స్కూల్బస్, ప్లేగ్రౌండ్ వంటి చోట మీ పిల్లలని టార్గెట్ చేసారనుకోండి స్నేహితుల సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ విధంగా అన్ని చోట్లా స్నేహితులని సంపాదించుకోగలిగితే అన్ని సమయాల్లో ఎవరో ఒకరు తోడు ఉంటారు. ముఖ్య స్నేహితులు ఎవరు? ఎలాంటి వారు? వారితో కలిసి ఎంత సమయం గడుపుతారు? వారి సమావేశ స్థలాలు ఎటువంటివి తెలుసుకోవాలి. స్కూల్ బస్లో, లంచ్ సమయంలో ఎవరితో కలిసి కూర్చుంటున్నారో తెలుసుకోవాలి.
చివరగా
ప్రతివారితో పోట్లాడరాదని, గొడవకు దిగిరాదని చెప్పండి. ఎందుకంటే టీజింగ్ చేసే వారు మీ పిల్లలు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారా..? అని చూస్తూ ఉంటాడు. అవసరాన్ని బట్టి టీచర్, దగ్గిరలో ఉన్న పెద్ద వారి సహాయం తీసుకోవాల్సిందిగా చెప్పాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది మీ ఇంటి వాతావరణంలో ఏ విధమైన హేళనలకు, బెదిరింపులకు స్థానం లేకుండా చూసుకోవాలి. స్కూల్లో తమకు నచ్చని పిల్లలు ఉన్నారా? ఉంటే వారు ఎందుకు నచ్చటంలేదో తెలుసుకోండి. అలాంటి అభిప్రాయాలు కూడా కాలానుగుణంగా మారిపోతుంటాయని తెలియ చెప్పండి. టీజింగ్ కూడా నివారింపబడేవే అనే భావ జ్ఞానాన్ని మీ పిల్లలకు అందచేయండి.