Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మక్కలు... పోషకాల గనిగా వీటిని చెప్పుకోవచ్చు. రుచికూడా కమ్మగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఉడకపెట్టుకుని కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తింటే మహా రుచిగా ఉంటాయి. అయితే రోజూ ఇలాగే తింటే బోరుకొడుతుంది. అందుకే ఈ పోషకాల మక్కలతో కాస్త వెరైటీగా ట్రై చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు.
చిప్స్
కావల్సిన పదార్థాలు: మక్కపిండి - కప్పు, ఉప్పు - తగినంత, దంచిన మిరియాల పొడి - అరచెంచా, బేకింగ్ పౌడర్ - పావు చెంచా, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ కలుపుకోవాలి. ఈ పిండిని చిన్నచిన్న చపాతీల్లా వత్తుకుని త్రికోణాకృతిలో కోసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇది సల్సాతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.
కర్రీ
కావల్సిన పదార్థాలు: లేత మక్కలు - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్ - రెండు కప్పులు, ఉల్లిగడ్డ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఆవాలు - అరచెంచా, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, ధనియాలపొడి, జీలకర్రపొడి - చెంచా చొప్పున, పల్లీలపొడి - రెండు చెంచాలు, కొబ్బరిపాలు - అరకప్పు, పచ్చిమిర్చి - మూడు, ఆలివ్‌నూనె - టేబుల్‌స్పూను, టొమాటో గుజ్జు - టేబుల్‌స్పూను, కారం - చెంచా, కొత్తిమీరతరుగు-కొద్దిగా.
తయారు చేసే విధానం:
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయించాలి. రెండు మూడు నిమిషాలయ్యాక కరివేపాకూ, అల్లంవెల్లుల్లి ముద్దా, ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ రంగు మారాక టమాటో గుజ్జూ, పచ్చిమిర్చీ, కారం, ఉప్పూ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, పసుపూ వేసి మంట తగ్గించాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక పల్లీలపొడీ, కాసిని నీళ్లూ పోయాలి. ఇందులో మక్కజొన్నా, స్వీట్‌కార్న్ ముక్కలు వేయాలి. మక్కజొన్న ముక్కలు ఉడికాక కొబ్బరిపాలు పోయాలి. గ్రేవీలా చిక్కగా తయారయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.
మసాలా
కావల్సిన పదార్థాలు: మసాలా కోసం: లవంగాలు - ఎనిమిది, మిరియాలు - చెంచా, యాలకులు - ఆరు, ధనియాలు, జీలకర్ర - టేబుల్ స్పూను చొప్పున, దాల్చిన చెక్క - చిన్న ముక్క.
ఇతర పదార్ధాలు:
మక్క గింజలు - కప్పు, నూనె - టేబుల్‌స్పూను, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు - చెంచా చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం తరుగు - చెంచా, కొబ్బరి తురుము - అరకప్పు, పసుపు - అరచెంచా, కారం - చెంచా, ధనియాలపొడి - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, చింతపండురసం - మూడు చెంచాలు, బెల్లం తరుగు - చెంచా, గరంమసాలా - చెంచా, నిమ్మరసం - కొద్దిగా.
తయారు చేసే విధానం:
ముందుగా మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, మినప్పప్పూ, సెనగపప్పు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక కరివేపాకూ, పచ్చిమిర్చీ, ఉల్లిగడ్డ ముక్కలూ, అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేగాక కొబ్బరితురుము కలపాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక పసుపూ, కారం, ధనియాల పొడీ, ముందుగా చేసుకున్న మసాలాలో అరచెంచా, తగినంత ఉప్పు, కాసిని నీళ్లూ, చింతపండు రసం, బెల్లం తరుగూ, మక్క గింజలూ వేయాలి. ఆ గింజలు ఉడికాయనుకున్నాక గరంమసాలా, నిమ్మరసం వేసి దింపేస్తే చాలు.
ఉప్మా
కావల్సిన పదార్థాలు: ఉడికించిన మక్క గింజలు - పావు కప్పు, బఠాణీ గింజలు - పావు కప్పు, మక్క జొన్న రవ్వ - అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లి గడ్డ - ఒక పెద్ద చెంచా, సన్నగా తరిగిన అల్లం - ఒక చిన్న చెంచా, పచ్చిమిర్చి తరుగు - అర చెంచా, నిమ్మరసం - పెద్ద చెంచా, ఆవాలు - చిన్న చెంచా, ఉప్పు - రుచికి తగినంత, గరంమసాలా - అర చెంచా, రిఫైండ్ ఆయిల్ - పెద్ద చెంచా, నీళ్లు - కప్పు.
తయారు చేసే విధానం: ప్రెషర్ కుక్కర్లో రిఫైండ్ ఆయిల్ వేడి చేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. మక్కజొన్న రవ్వ, ఉడికించిన మక్క గింజలు, బఠాణీలు వేసి కలిపి కొద్దిగా వేయించాలి. ఉప్పు, నిమ్మరసం కలిపి కప్పు నీళ్లుపోసి కుక్కర్ మూతపెట్టాలి. ఒక్క విజిల్ రాగానే కుక్కర్ స్టవ్ మీద నుండి దింపెయ్యాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి గరంమసాలా చల్లి మక్క జొన్న ఉప్మా వేడి వేడిగా వడ్డించాలి.
మక్కలతో ఉపయోగాలు
- ముఖంపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది.
- మక్కల్లో యాంటీయాక్సిడెంట్స్ సంమృద్ధిగా ఉండడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.
- సెల్ జనరేషన్ ప్రక్రియను పెంచుతుంది.
- గర్భిణులకు మక్కలు ఎంతో మేలు చేస్తాయి.
- వీటిలో ఉండే ఖనిజాలు, విటమిన్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.
- కంటి చూపును మెరుగుపరుస్తుంది.