Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ సమాజమైనా దానంతట అదిగా అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి చెందక ముందే అన్నీ చేతికందితే వచ్చే అనర్థాలు అనేకం. దీనికితోడు అనివార్యంగా పెద్దలు లేకుండా భార్యాభర్తలిద్దరే ఉండాల్సిన పరిస్థితులు. ఈ క్రమంలో మహిళలకు వచ్చే సమస్యలు అనేకం. గర్భం దాల్చడంనుంచి... పిల్లల పెంపకం దాకా! బయట సమస్యలకు తోడు... కుటుంబంలోనూ నిత్యం ఏదో ఒక ఆందోళన. వీటి నుంచి బయటపడేదెలాగో నేర్పిస్తున్నది డాక్టర్ హాసిని యాదవ్. 'న్యూ మామ్స్ హబ్ ' ఏర్పాటు చేసి... మాతృసఖిగా మారిపోయింది. ఆమె పరిచయం, ప్రయాణం... మానవికోసం!
హాసిని పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. చదివింది కూడా ఇక్కడే. డెంటిస్ట్‌ను. వికారాబాద్ డెంటల్ కాలేజీలో మొదటి బ్యాచ్. కాలేజీ పూర్తవ్వగానే పెండ్లి చేశారు. భార్యాభర్తలిద్దరూ కలిసి మూడు నెలలకే న్యూజీలాండ్‌కు వెళ్లారు. అయితే న్యూజీలాండ్‌లో డెంటిస్ట్‌గా పనిచేయాలంటే.. ఓ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. దానికి మూడేండ్లు పడుతుంది. అది చేస్తూనే... బిజినెస్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసిందామె. ఈ కోర్సులో ప్రత్యేకమైన అవార్డు పొందడమే కాదు... డెంటల్ కాలేజీలో 58 మంది పరీక్ష రాస్తే నలుగురు మాత్రమే అర్హత సాధించారు. అందులో ఆమె మొట్టమొదటి వ్యక్తి. భర్త సర్జన్. ఆమె కూడా అక్కడే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసింది. ఆలోపు గర్భం దాల్చడంతో... ఉద్యోగం మానుకుంది.
పిల్లల పెంపకమే...
పెండ్లి పిల్లల తరువాత చాలా మంది మహిళల జీవితంలో కెరీర్‌కు ముగింపు పలకాల్సి వస్తుంది. అలా ఆమె కూడా ఉద్యోగం మానేసింది. కానీ అదే ఆమెకు కొత్త దారులు చూపింది. డాక్టర్ కాబట్టి సహజ ప్రసవం కావాలని పట్టుబట్టింది. దాంతో కాలాలో రక్తం గడ్డ కట్టుకుపోయింది. బాబును చూసుకోవడానికి హాసిని వాళ్లమ్మ వచ్చింది. కానీ రెండు నెలలకే వాళ్ల అమ్మమ్మ చనిపోవడంతో తల్లి తిరుగు ప్రయాణం అయ్యింది. ఆరోగ్య సమస్యల రీత్యా ఆమెను ఏడాది వరకు ప్రయాణం చేయొద్దన్నారు. తెలియని ప్రాంతం. రెండు నెలల బాబుతో ఒక్కతే ఉండిపోవాల్సి వచ్చింది. భర్త ఉన్నా.. ఆయన సర్జన్. ఎప్పుడు అత్యవసర కేసులొస్తే అప్పుడు వెళ్లిపోవాలి. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. అప్పుడు తెలిసిందామెకు మదర్ అండ్ బేబీ గ్రూప్స్ గురించి. రెండు నెలల బేబీతో అందులో చేరింది. ఏడాది కోర్సు. ప్రపంచ నలు మూలల నుంచి 22 మంది తల్లులు. వారానికోసారి ఉండే క్లాస్కోసం ఎదురుచూసేదామె. అందరితో బాగా కలిసిపోయే మనస్తత్వం ఉన్న హాసినికి.. అదో మంచి కంపెనీ అయ్యింది. నిత్యం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ఉండేది. ఏడాది తరువాత తానే అలాంటి మదర్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇక రెండో బాబు పుట్టుక ఓ అడ్వెంచర్. హాస్పిటల్ కారులో వెళ్తుంటే తీవ్రంగా నొప్పులొచ్చాయి. తనకు తానే డెలివరీ చేసుకుంది. హాస్పిటల్‌కు వెళ్లాక బొడ్డుతాడు కట్ చేసి.. ఆ రాత్రి ఉంచి పొద్దున్నే డిశ్చార్జ్ చేశారు. న్యూజీలాండ్ మీడియా 'సూపర్‌మామ్' అని పొగిడేసింది. ఇద్దరు పిల్లల పెంపకంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది హాసిని. న్యూజీలాండ్‌లో నుంచి ఏడున్నరేండ్లకు తిరిగి ఇండియాకు వచ్చారు.
తల్లులకోసం తపన...
ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్‌లో చేరిందామె. రెండు నెలలపాటు స్వచ్ఛందంగానే పనిచేసింది. కానీ ఆమె పనిచేసే తీరు.. చెప్పే సహజమైన పద్ధతులన్నీ ఆ కార్పొరేట్ ఆస్పత్రికి నచ్చలేదు. ఆమె వల్ల తమకు నష్టం అనుకున్నారు. అందుకే మానేసింది... అది కూడా వాళ్లకు బుద్ధి చెప్పి మరీ! డెంటల్ డాక్టర్‌గా ఎప్పుడైనా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ముఖ్యం అనుకుంది. కేవలం పిల్లల పనుల్లోనే పడిపోయినా... ఏదో కోల్పోతున్న ఫీలింగ్. అప్పుడు గుర్తొచ్చిందామెకు... హైదరాబాద్ మునుపటిలా లేదు. గ్లోబల్ సెంటర్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి. న్యూజీలాండ్‌లో తనకు ఎదురైన సమస్యే ఇక్కడే ఎందరో తల్లులకు ఉండొచ్చు. వాళ్లకోసం ఏదైనా చేయాలన్న ఆలోచన. స్నేహితులకు చెబితే 'అయ్యే పనేనా?!' అన్నారు. భర్తతో పంచుకుంటే వెన్ను తట్టాడు. 'ఇక్కడ యూనిక్ థింగ్... ప్రొసీడ్' అని ప్రోత్సహించాడు.
న్యూ మామ్స్ హబ్...
అలా భర్త ప్రోత్సహంతో 'న్యూ మామ్స్ హబ్' ఏర్పాటు చేసింది హాసిని. పిల్లలు పుట్టగానే తల్లికదా! చూసుకుంటుంది లే అనుకుంటారు. కానీ మహిళ అందుకు సంసిద్ధం కావడానికి సమయం పడుతుంది. అందుకోసం సంసిద్ధంగా లేనోళ్లు... డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. ఈ డిప్రెషన్లో కూడా నాలుగు లెవల్స్ ఉంటాయి. అందరికీ అన్నీ రావాలని లేదు. కానీ పిల్లలు పుట్టాక ప్రతి ఒక్కరు ఈ నాలుగింటిలో ఏదో ఒకటి ఎదుర్కొంటు న్నారు. ఇక పిల్లలకు ఏదైనా వస్తే... ఇంట్లో ఉండే పెద్దవాళ్లు (తల్లి లేదా అత్త) ఒక మాట చెబుతారు. ఆ యువతి ఏవేవో చదివి ఉంటుంది. ఈ రెండింటిలో దేన్ని పాటించాలో తెలియదు. తమ మాట పాటించడం లేదని తల్లికి కోపం. చాలా వరకు తల్లీబిడ్డల బంధం ఇలా పిల్లల విషయంలోనే దెబ్బ తింటుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎలా చేసుకోవాలి? అన్న కాన్సెప్ట్‌తో సెషన్స్ ప్రారంభించింది హాసిని.
అన్ని దశల్లో అవగాహన..
మహిళ ప్రెగెంట్గా ఉన్నప్పుడే భర్తతోపాటు... తల్లిగానీ, అత్తగాని వస్తే... అవగాహన కల్పిస్తారు. ఇక డెలివరీ సమయంలో కార్పొరేట్ హాస్పిటల్స్ తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తాయి. బేబీకి మొదటిగంట తల్లిపాలు పట్టడం చాలా కీలకం. అయినా... అవేవీ పట్టించుకోకుండా బేబీ క్లీనింగ్, విటమిన్ 'కె' ఇంజక్షన్ కోసం పరుగులు పెడతారు. ఇలాంటి ప్రాథమిక విషయాలన్నింటిపైనా అవగాహన కల్పిస్తున్నది. ఈ కోర్సులో పది సెషన్స్ ఉంటాయి. ప్రతి సెషన్లో రైమ్టైమ్... ఏదో ఒక టాపిక్ మీద చర్చతో పాటు... ఎవరికివారు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలపై పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అంటుంది. తరువాత వ్యాయామం. డెలివరీ తరువాత పెల్విక్ మజిల్స్, అబ్డామిన్ మజిల్స్ బలహీనమవుతాయి. వాటికోసం బేబీతోపాటు స్ట్రెచింగ్స్ ఉంటాయి. తొలినాళ్లలో ఇంటికి వచ్చేవాళ్లు. హైదరాబాద్ ట్రాఫిక్‌లో ప్రయాణం చాలా ఇబ్బంది. ఓ ఉపశమనం మరో ఒత్తిడికి కారణం కాకూడదని... ఆన్లైన్ లెసన్స్ మొదలుపెట్టింది. ఆన్లైన్లో మొదలుపెట్టడంతో ఒక్క హైదరాబాద్ నుంచే కాదు... చిత్తూరు, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, బీహార్, చండీగడ్ నుంచి కూడా ఆమెకు క్లయింట్స్ ఉన్నారు. 10 సెషన్స్‌తో పాటు తల్లికి ఏ సమయంలో ఎలాంటి అనుమానం వచ్చినా 'అయామ్ దేర్' అంటుంది హాసిని.
తండ్రి బాధ్యతగా...
తల్లులకు ప్రతి దశలో వచ్చే అనుమానాలను నివృతి చేస్తున్నది. దీనికోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది హాసిని. న్యూజీలాండ్, యూకె, యూఎస్, ఆస్ట్రేలియా వెబ్‌సైట్స్‌లో రీసర్చ్ పేపర్స్ చదువుతుంది. తానూ నేషనల్వైడ్గా రీసర్చ్ ఆర్టికల్స్ రాస్తుంది. పేరెంటింగ్‌ను తల్లి బాధ్యతగానే చూస్తున్నారు చాలా మంది. కానీ... తండ్రి పోషించాల్సిన సమాన పాత్రను ఆమె చెబుతుంది. వాళ్లతోనూ మాట్లాడుతుంది. చాలా మంది అర్థం చేసుకుంటారు. కొందరు మొండివాళ్లుంటారు. 'మీరెన్నయినా చెప్పండి... నేనుచేసేది చేస్తా' అన్నట్టుగా. ఆమెకు వచ్చిన వాళ్లంతా నోటి మాటతో వచ్చినవాళ్లే. చాలా మంది మహిళల యితే విపరీతమైన ఒత్తిడితో కాల్ చేస్తుంటారు. కొన్నిసార్లు కేవలం వాళ్ల మాటలు వింటే సరిపోతుంది. అవి వినేవాళ్లు లేక కూడా అలా అయిపోతుంటారు. వినడం వాళ్లకు పెద్ద రిలీఫ్.
మాతృసఖి ఫౌండేషన్...
ఈ క్రమంలో మహిళలకున్న అనేక సమస్యలు ఆమె ముందుకొచ్చాయి. మహిళలు... ఇంట్లో అందరికోసం అన్నీ చేస్తారు. వాళ్లకోసం వాళ్లు ఏం చేసుకోరు. వారికోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో మాతృసఖి ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా మహిళలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. సెల్ఫ్‌కేర్, హెల్త్‌కేర్, ఎమోషనల్ కేర్ వంటివాటిపైన వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నది. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు 50కి పైగా వర్క్‌షాప్స్ నిర్వహించింది. ఒక్కో వర్క్‌షాప్‌కు వచ్చినవాళ్ల సంఖ్య మూడు వందలనుంచి వెయ్యి మంది వరకు. జనరల్‌గా అన్ని విషయాలు చెబుతుంది. అవసరముందనుకుంటే ప్రత్యేకంగా, పర్సనల్‌గా మాట్లాడుతుంది. తల్లులకు పేరెంటింగ్‌లో చేయాల్సినవి, చేయకూడనివి ఏంటనేది చెబుతుంది. యుక్త వయసులోకి అడుగుపెడుతున్న అమ్మాయిలు, తల్లులకు సైతం వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నది. తల్లికి, పిల్లలకు ఉన్న గ్యాప్‌ని తగ్గించి వాళ్ల మధ్య అనుబంధాన్ని పెంచుతున్నది. పిల్లలకు తల్లికి ఓ బ్రిడ్జి క్రియేట్ చేస్తున్నది. దీనికోసం వర్క్‌షాప్ ఒక్కటే నిర్వహించినా.. తరువాత తల్లులకు అవసరమైనప్పుడల్లా తానున్నానంటున్నది. ఫేస్బుక్ పేజీ టaషవbశీశీస.షశీఎ/్ష్ట్రవఅవషఎబఎఓష్ట్రబb/ ద్వారా సలహాలు, సూచనలు అందజేస్తుంది.
రిక్రియేషన్ కోసం...
జీవనశైలిలో వస్తున్న మార్పులు, జెనెటిక్స్, ఒత్తిళ్లు... కారణాలే మైనా ఆడపిల్లలు తొందరగా యుక్తవయసులోకి ప్రవేశిస్తున్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు. వాటన్నింటినీ నివృతి చేస్తున్నది. ఇక మెనోపాజ్ అనగానే మూడ్ స్వింగ్స్ మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ... శరీరంలో, హార్మోన్లలో చాలా మార్పులొస్తాయి. ఈ సమయంలో మహిళలకు కుటుంబ సహకారం చాలా అవసరం. అప్పుడు వారితో ఎట్లా మాట్లాడాలి? ఎలా ఉండాలి? అన్నింటిపైనా పూర్తి అవగాహన కల్పిస్తున్నది. భవిష్యత్‌లో న్యూ మదర్స్ అండ్ బేబీస్ కోసం వీడీయో పోర్టల్ కూడా ప్రారంభిస్తున్నది హాసిని. అప్పుడే పుట్టిన శిశువులు, పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేరెంటింగ్పైన వీటిని రూపొందిస్తున్నది. కిడ్స్‌కి ప్లే ఏరియాలాగా... తల్లులకు కూడా ఓ రిక్రియేషన్ సెంటర్ ఉండాలన్నది ఆమె అభిమతం. అందుకే తొందరలోనే రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నది!
వెంకట్ సహకారం చాలా...
ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతృప్తి ఉండేది కాదు. ఇప్పుడు ఒక్క తల్లికి మేలు చేయగలిగినా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు అందరిదీ ఒకే సమస్య స్ట్రెస్, ఒత్తిడి. చిన్న చిన్న లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే చాలు... 80శాతం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నేను అవి మాత్రమే నేర్పిస్తాను. తల్లుల మానసిక స్థితి పిల్లలపై ప్రతిబింబిస్తుంది. కాబట్టి.. తల్లులెంత జాగ్రత్తగా ఉంటే... పిల్లలంత బాగా ఎదుగుతారు. ప్రతిదానికి ఓ దశ ఉంటుంది. అందరూ అన్ని దశలు దాటాల్సిందే. అయితే వాటిని సులభతరంగా దాటడమే నేను చెప్పగలిగేది. ఈ నా ప్రయాణంలో నా భర్త వెంకట్ కట్టా సహకారం చాలా ఉంది. ఆయన జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అయినా కుటుంబాన్ని, పిల్లలనెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నేను వంట చేస్తుంటే.. తను పిల్లలను రెడీ చేస్తారు. తను వంట చేస్తుంటే పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను.