Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓవర్ షాపింగ్ అనేది చాప కింద నీరులాంటిది. మనకు తెలియకుండానే షాపింగ్ అనేది ఒక వ్యసనంగా మారుతుంది. అయితే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మనసును నియంత్రించుకోవచ్చు. అవేంటంటే...
కార్డులకు దూరంగా: క్రెడిట్, డెబిట్ కార్డులే మనల్ని ఓవర్ స్పెండర్స్గా మార్చే అవకాశం ఉంది. సాధారణమైన వ్యక్తులు కూడా ఈ కార్డులు దగ్గరుంటే అనవసరపు కొనుగోళ్లు చేస్తుంటారని అధ్యయనాల్లో తెలిసింది. కాబట్టి షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఈ కార్డుల్ని ఇంట్లో ఉంచి డబ్బుల పర్సుతో బయటకు వెళ్తే మంచిది. అప్పుడు ఖర్చు అదుపులో ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కలిగే బాధ క్రెడిట్, డెబిట్ కార్డులు స్వైప్ చేసేటప్పుడు ఉండదు. బిల్ ఇంటికొచ్చినప్పుడు మాత్రం గుండెల్లో కలుక్కుమంటుంది. కాబట్టి కార్డు వాడాలనే కోరికను కంట్రోల్లో ఉంచుకోవాలి. అవసరమైన మేరకు మాత్రమే షాపింగ్ చేస్తే మంచిది.
ఇన్వెస్ట్మెంట్: డబ్బు ఖర్చయ్యే అవకాశం లేకుండా పెట్టుబడిలోకి కన్వర్ట్ చేయటం మరో టెక్నిక్. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్స్‌ను ఎంచుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ని ఆటోపైలెట్ మోడ్‌లో ఉంచితే డబ్బు ఖర్చు పెట్టేలోపే ఇన్వెస్ట్మెంట్గా మారిపోతుంది.
సమయం తీసుకోవాలి: ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనుకున్నప్పుడు వెంటనే కొనేయకుండా కనీసం 30 రోజుల సమయం తీసుకోవాలి. ఈ సమయంలో మనకు ఆ వస్తువు నిజంగానే అంత అవసరమా? అది లేకుండా నడవదా? అనే ఆలోచనలు వస్తాయి. నిజంగానే ఆ వస్తువుతో అవసరం లేకపోతే ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లో దాన్ని కొనాలనే కోరిక సన్నగిల్లుతుంది. క్రమంగా ఆ విషయమే మర్చిపోతాం. అలా ఎక్కువ సందర్భాల్లో కొనుగోలు చేయటమే పూర్తిగా మానేస్తాం కూడా! ఈ చిన్న చిట్కా గాడ్జెట్స్, దుస్తులు, ఫుట్‌వేర్, యాక్సెసరీస్ల విషయంలో బాగా పని చేస్తుంది.