Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకు చిత్ర రాగరంజితమై
వర్ణశోభితమై సంప్రదాయ వస్త్రధారణ
స్వర్ణాభరణాలతో
మహిళల మనసుకు రంగులద్ది
ప్రకృతి పూదోటను పూజిస్తూ
తెలంగాణ సంస్కృతికి దీప్తిధారియై
వెలుగొందు బతుకమ్మ
మా బంగారు బతుకమ్మ
బతుక్కి బాసటయింది
ఉద్యమాల ఊపిరయ్యింది
కష్టాలు, ఆనందాల్లో పాటయింది, తోడైంది.
సామూహిక స్నేహగీతం ఆలపించింది.
సామాజిక చైతన్యం వెల్లివిరిసింది
మానవ సంబంధాలు పెంపొందించింది
ప్రేమ, ఐకమత్యం, గౌరవాల ప్రతీకయింది
మా బంగారు బతుకమ్మ
బతుకమ్మ సిగలో
గునుగు, తామర, తంగేడు, గుమ్మడి పూల
సప్తవర్ణ శోభితం
మట్టి నుంచి మట్టిలోకి చేర్చు
ఆత్మీయ భావనం
సాంస్కృతిక వారసత్వం
స్త్రీల సృజనాత్మక, కళాత్మకతలో
ఆడపడుచుల ఆనంద హేల ఈ వేళ
అందరు బాగుండాలని దీవించే
మా బంగారు బతుకమ్మ
- వైద్యం బాస్కర్
8466879974