Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ దూసుకెళుతున్నారు... ఆర్ధిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, రాజీకయంగా వస్తున్న పరిణామాలే దీనికి కారణం. అయితే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలు ఇటు కుటుంబం అటు ఉద్యోగం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా కత్తిమీద సామే. అయినప్పటికీ తప్పడం లేదు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు తమ కెరీర్లను ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. కుటుంబ ఒత్తిళ్లు, సమాజంలో చిన్నచూపు లాంటి సమస్యలు పెద్దగా ఉండవు. కానీ మన దేశంలో కుటుంబ బాధ్యతలు, సంప్రదాయ కట్టుబాట్ల మధ్య తమ కెరీర్ను కొనసాగించాల్సి వస్తుంది . వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ జీవితం గడపాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. మీరూ ఇలా ధైర్యంగా ముందుకు సాగిపోవాలనుకుంటుంటే...
మీ జీవితాన్ని ముందు మీరు నిర్వచించుకుంటే, మీరు ఏం కావాలనుకుంటున్నారో అది సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎవరు.. ఏం సాధించాలని అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. అది కూడా మీ కులం, మతం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, దేశం ఇలా అన్నింటినీ వదిలేసి అసలు మీరు ఎవరు అనేది తేల్చుకోండి. అప్పుడు మన పర్సనాలిటీకి సంబంధించిన సమాధానాలు ఒక్కొక్కటీ దొరుకుతాయి. ప్రఖ్యాత జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడ్రిక్ నిషే ఇలా అంటాడు 'ఎవరైతే తమ జీవితంలో ఏం సాధించాలనే సంగతి గుర్తిస్తారో, వాళ్లు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదిరిస్తారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గుర్తించి మీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారో అప్పుడు వాటిని సాధించే క్రమంలో మీరు పాటించాల్సిన విలువలు కూడా నిర్ణయించుకుంటారు'.
నమ్మకమే పునాది: మీ మనసు మాట వినండి. మీరు చేసే పనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆ తర్వాతనే నమ్మకం ఏర్పరచుకోండి. అంతేకాదు అది వ్యక్తిగత జీవితమైనా, కెరీర్లో నైనా సరే.. నమ్మకమే పునాది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
స్ఫూర్తి పొందండి: ఒకవేళ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి కానీ, సమాజం నుంచి కానీ స్ఫూర్తి పొందలేకపోతే మంచి పుస్తకాల నుంచి లేదా గొప్ప వ్యక్తుల చరిత్రను తెలుసుకొని ఇన్స్పైర్ అవ్వండి. ముఖ్యంగా మహిళల్లో ఉన్నత వ్యక్తుల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందండి. వారి జీవితాల్లో సమస్యల నుంచి బయటపడిన తీరు, వారు తీసుకున్న నిర్ణయాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి.సవాళ్ళను స్వీకరిస్తూ...
ఆలోచనే ఆయుధం: ఆలోచించి ముందుకు సాగితేనే మీరు చేసే పనిలోనూ, ద్వేషం, కోపం మీ ఆలోచనని కనుమరుగు చేస్తాయి. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. అందుకే ఆలోచించండి. ఐడియాలు తడతాయి. ఆలోచన అనేది మనిషిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది.
మీ వ్యతిరేకులను గౌరవించండి: మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తరో వారిని గౌరవించండి. మీ పట్ల వ్యతిరేకతను కూడా చిరునవ్వుతో స్వీకరించండి. మీతో విబేధించే వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడే మానవ సంబంధాలు ఏర్పడి ఘర్షణలు, వ్యతిరేక వాతావరణం తొలగి ప్రశాంతత నెలకొంటుంది.
మీ జీవితాన్నే పాఠాలుగా చెప్పండి: మనం జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొని ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎంతో సంఘర్షణకులోనై ఉంటాం. వాటినే నలుగురికి చెప్పి, వారిలోనూ స్ఫూర్తి నింపండి. వారి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను సైతం తెలుసుకునేందుకు ప్రయత్నించండి. అది మీకు థ్రిల్తో పాటు కొత్త విషయాలను కూడా తెలుసుకునేలా చేస్తుంది.
సమాజాన్ని కూడా పట్టించుకోండి: మీ కెరీర్లో మీరు ఎంతో ఉన్నత స్థాయిని పొందినప్పటికీ ఒక మహిళగా ఎన్నో అవరోధాలను దాటుకొని ఆ స్థాయికి చేరుకొని ఉంటారు. మరి అదే స్థానాన్ని పొందేందుకు ఎందరో మహిళలు జీవితంలో సంఘర్షణకు గురవుతారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించండి. మహిళా విద్య, మహిళల ఉపాధి లాంటి వాటికి మీ తోడ్పాటు ఇవ్వండి. ముఖ్యంగా స్త్రీ పురుష విబేధాలు రూపుమాపేందుకు నడుం బిగించండి ఇలా చేస్తేనే జీవితంలో అటు బాధ్యతలు ఇటు కెరీర్ రెండూ సమానంగా సాగి.. జీవితం విజయవంతం అవుతుంది.