Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీరొక్క పూవుల బతుకమ్మా.
తీరైన మనుషుల కలిపేవమ్మా
సింగిడి రంగుల సోయగాలతో
తెలంగాణలొ వెలిసినవమ్మా
నింగిలోని తారలన్ని... నేలకు దిగి వచ్చెనమ్మా
ఆకాశ జాబిలమ్మ... బతుకమ్మగా నిలిచేనమ్మా
పూవుల రంగులే ఈ మనుషుల భావాలుగా
కలివిడి ఆటలే మన చరితకు సాక్ష్యాలుగా..
సంబరాలే.. బతుకమ్మ సంబరాలే.- 2
తీరొక్క పూవుల బతుకమ్మా...............
పుడమి పులకరించి.. వానచినుకులొచ్చి
చెరువులన్ని నిండి..సెలయేరై పారి.... సెలయేరై పారి....
రైతన్న కళ్ళలో... ఆనందమే నిండి
ఊరూరు వాడ వాడ.. పరవశమే చెంది
ప్రకృతి దేవతకు.. హారతులే పట్టంగ
ఎంగిలి పూలతో .. భాగ్యాలనివ్వంగ
సంబరాలే.... బతుకమ్మ సంబరాలే....... 2
తీరొక్క పూవుల బతుకమ్మా.
చిక్కుడు ఆకుల్ల.. గుమ్మడి పూవుల్ల
గౌరమ్మ కూచుండే.. రాజసం కనిపించగ
ఆడపడుచులంత చేరి.. చేయి చేయి కలిపి
చప్పట్ల మోతలతో.. కాలు కాలు కలిసి
అందెల సవ్వడులే.. గలగల మోగంగా
గౌరమ్మ పాటలతో.. చుట్టూ ఆటలాడె
పల్లెల మది మురిసే.. ప్రకృతి పరవశించే
బతుకమ్మ పండగే.. అంబరమంటగా
సంబరాలే.... బతుకమ్మ సంబరాలే....... 2
తీరొక్క పూవుల బతుకమ్మా................
పూల జాతరే.... బతుకమ్మ జాతరే....
ఉయ్యాల పాటలే.. ఊరూర మోగెనే...
పల్లె బతుకులే... మదినిండ మురిసెనే..
పసిపాపల మోముల్లో.. చిరునవ్వే చిందగా
నింగి లోని తారల్లు.. నీళ్ళల్లో మెరువంగా..
ఎదురొచ్చి గంగమ్మ.. స్వాగతమే ఈయంగా
యెల్లి రావమ్మ... మా ఊరు బతుకమ్మ బంధాలు నిలుపగ.. మళ్ళేడు రావమ్మ
- పాల్వంచ హరికిషన్, రామన్నపేట
సెల్ 9502451780