Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేస్తున్నవాళ్ళలో కంటి సమస్యలు చాలా సాధారణం. ప్రత్యేకించి ఐటి నిపుణుల్లో డెబ్భై ఆరు శాతం మంది అంటే ప్రతి పదిమందిలో కనీసం ఏడుగురికి పైగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఆధునిక జీవనశైలి ఇదొకటి.
మన శరీరంలోని అతి సున్నితమైన భాగం కన్ను. గంటలకు గంటలు కంప్యూటర్లూ, ల్యాప్టాప్ల దగ్గర కదలకుండా కూర్చొనేవాళ్ళకు ఎదురయ్యే సమస్యలు కండ్ల బాగా అలిసిపోవడం, ఎర్రబడడం, మంటపెట్టడం, పొడిబారిపోవడం, కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం.
కంప్యూటర్ తెరకు చాలా దగ్గరగా కండ్లు ఉంచి పని చేసే వారి కండ్లు పొడిబారడం లాంటి ఇబ్బందులకు గురవుతాయి. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకొని కంప్యూటర్లూ, ల్యాప్టాప్ల ముందు పనిచేస్తూ ఉంటే కండ్ల చుట్టూ నల్లటి వలయాలు తయారవుతాయి. కాలం గడిచేకొద్దీ కండ్లలో క్యాటరాక్ట్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే కంప్యూటర్ తెర మీద అదే పనిగా దృష్టి ఉంచొద్దు. తరచూ మీ కండ్లను మూస్తూ ఉండాలి. లేదా అప్పుడప్పుడు వాటిని పక్కకు తిప్పుతూ ఉండాలి. రెప్పల్ని ఆర్పుతూ ఉండాలి.
కండ్లకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. కండ్లకు అద్దాలు వస్తాయనో... మరో కారణంతోనో మీ సమస్యకు చికిత్స చేయించుకోకపోతే ఆ తరువాత విచారించాల్సి వస్తుందని మరచిపోవద్దు. ఆరోగ్యానికి దోహదం చేసే విటమిన్లు ఉన్న ఆహారాన్ని మీ భోజనంలో భాగం చేసుకోండి.
పని మధ్య కాసేపు విరామం తీసుకోవాలి. దూరంగా ఉన్న వస్తువులను కాసేపు చూడండి. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ నుంచి వెలువడే హానికరమైన కిరణాలు మీ కళ్ళకు ప్రమాదకరం. కాబట్టి మానిటర్కు స్క్రీన్ గార్డ్చ్ ఉపయోగించండి. ఆ కిరణాలు నేరుగా మీ కండ్లలోకి చొరబడకుండా డమ్మీ కళ్ళద్దాల్లాంటివి పెట్టుకోవచ్చు.
స్క్రీన్ రిజల్యూషన్, మానిటర్ పొజిషన్, బ్రైట్నెస్ లాంటివి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కండ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేసుకుంటే, కండరాలు రిలాక్స్ అవుతాయి. రీడింగ్ గ్లాసెస్ ఉపయోగించడం కూడా కండ్లకు మేలు కలిగిస్తుంది.