Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకు
భరోసా కరువై
దీనంగా నిర్లిప్తం గా
పల్లెల్లో పలవరిస్తుంటే
గడీల్లో గోడళ్లమధ్య
అలజడులు ఆర్తనాదాలు
బైటికి రాక
సమాధి అవుతుంటే
గునుగుపూలు గుసగుస లాడుతుంటే
గోగుపూలు గోలచేస్తుంటే
తంగేడు తల్లడిల్లుతుంటే
కట్ల పూలు కన్నీరు కారుస్తుంటే
బతుకు చిత్రంలో
బాధలని మరవాలనే
బలమైన చిత్తంతో
కంచెల్లోని పూలన్నీ ఇంటికి చేర్చబడి
ఆడపడుచులంతా
ఆటపాటలతో
ఆప్యాయత పంచుకుంటూ
అనురాగాల పందిరిలో
పూలను పేర్చుతూ
అందంగా తాంబాళంలో
రంగురంగుల మేళవింపు
ప్రకృతిని మైమరిపిస్తూ
నమ్మకంతో గౌరమ్మని పూజిస్తూ
జలమే ఆయువుగా
ఆలోచన మొదలై
జలం చెంత చేరి
వలయాకారంలో వంగుతూ లేస్తూ చప్పట్లతో
జానపదాలతో బతుకమ్మని సాగనంపిన పల్లె
మళ్ళీ రావమ్మా అంటూ
కార్పొరేటీకరణ గుప్పిట్లో బతుకమ్మ
ప్లాస్టిక్ పూలబతుకమ్మ
ఓట్లు రాల్చే బతుకమ్మ
గడీల్ల్లో బతుకమ్మ
ప్రకృతి వికృతై
సంస్కృతి సంప్రదాయం
విపణివీధిలో వస్తువై విక్రయించబడుతుంటే
నిస్సిగ్గుగా ప్రసారమాధ్యమం
నృత్యాల రూపకల్పనలో వైవిధ్యంకై
బతుకమ్మ రూపాన్నే
చిదిమేస్తుంటే
తంగేడు తాండవ నృత్యం చేస్తుంది
గునుగు గునపమై చీల్చి చెండాడుతుంది
కట్లపూవు కట్టలుతెంచుకుని ఉరుముతుంది
బతుకమ్మ ని బతికిస్తుంది
-గిరిప్రసాద్ చెలమల్లు, హైదరాబాద్
9493388201