Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్-సి అధికంగా ఉండే దానిమ్మపండు వృద్ధాప్య చాయలను నెమ్మదిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా వాపు, దురద, చర్మం ఎర్రబారడం, చికాకు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మంపై మచ్చలు తొలగించుటలో కూడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మారటానికి ఉపయోగపడే ఈ దానిమ్మ పండుతో ఇంటివద్దనే టోనర్ తయారు చేసుకోవచ్చు.. అదెలానో చూద్దామా..?
కావల్సిన పదార్ధాలు: దానిమ్మ గింజలు - కప్పు, నీరు -అర కప్పు, గ్రీన్ టీ బ్యాగ్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్.
తయారుచేయు విధానం: ఒక చిన్న పాత్రను తీసుకోని అందులో అర కప్పు నీటిని చేర్చండి. చిన్న మంట మీద నీటిని వేడి చేయండి. ఒకసారి నీరు బాయిల్ అవడం మొదలైన వెంటనే దానికి ఒక గ్రీన్ టీ బ్యాగ్ అందులో కలపాలి. ఒకటీ, రెండు నిమిషాలు కాగనిచ్చి దింపి పాత్రను పక్కన పెట్టుకోవాలి. పాత్ర నుండి టీ బ్యాగ్ తొలగించండి. కొద్దిగా చల్లబడిన తర్వాత దానిలో రోజ్ వాటర్ కలపండి. చివరగా ఒక జ్యూసర్ మిక్సర్లో దానిమ్మపండు గింజలను గ్రైండ్ చేసి దాని రసాన్ని వేరు చేయండి. ఆ రసాన్ని వేడిచేసిన నీటిలో పోసి బాగా కలపండి. ఈ రసాన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకుని నిల్వ చేసుకోండి. దీన్ని ముఖం, మెడకు స్ప్రే చేసి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసి ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో కనీసం 2 నుండి 3 సార్లు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది.