Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం పురుషులతోబాటు సమానంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతుర్నారు. కొన్ని దశాబ్దాల కిందట పరిస్థితి ఇలా వుండేదికాదు. మహిళలు అడుగు బయట పెట్టాలంటేనే ఎన్నో ఆంక్షలు. సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి సమయంలో కూడా కొందరు మహిళామణులు ఆత్మస్థైర్యంతో ముందడుగువేసి నలుగురికీ ఆదర్శంగా నిలిచినవారున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాము ఎందులోనూ తక్కువకాదంటూ అన్నిరంగాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోగలిగారు. అటువంటివారిలో అనసూయ కులకర్ణి కూడా ఒకరు.
అనసూయ ప్రముఖ సంగీత విధ్వాంసురాలు. తెలుగు సినిమా నేపధ్య గాయని. లలితకళల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగిన ఈమె.. అందులో ఎన్నో మెణకువలు నేర్చుకున్నారు. అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించి తనకంటూ ఓ ప్రత్యేక ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు.. విదేశాల్లో సైతం విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.
సంగీతంపై ఆసక్తి
బాల్యంనుంచే సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కనబరిచిన ఈమెను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు. సంగీతంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అలా వారి ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్.ఆర్.కేశవమూర్తి శిష్యరికంలో ఆమె ఓనమాలు దిద్దారు.
నేపథ్య గాయనిగా
1952లో బెంగుళూరు ఆల్ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్ అకాడమీ నుంచి గోల్డ్మెడల్ అందుకుని అందరి మన్నలను పొందారు. ఆనాడు ఆమె గానమాధుర్యానికి ఆకర్షితులైన ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు1961లో అతను తెరకెక్కించిన 'భక్తప్రహ్లాద' చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.
వివిధ దేశాల్లో...
1964లో నారాయణ కులకర్ణిని వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత భర్త ఉద్యోగ బాధ్యతల రీత్యా దేశవిదేశాలు తిరిగారు. దాంతో అక్కడి సంగీత వాతావరణాన్ని మనసారా ఆశ్వాదించారు.ఇది ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. వివిధ ప్రదేశాలో ప్రముఖ సంగీత కళాకారుల దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం కూడా ఈమెకు లభించింది. ఆ విధంగా శిక్షణ తీసుకున్న అనసూయ ఆయా ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ... వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు. సంగీతానికి ఎవ్వరూ చేయలేని విశేష కృషి చేస్తున్నారు.