Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధు, సౌమ్య ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లయిన నెల రోజులకే చెప్పాపెట్టకుండా సౌమ్య ఎటో వెళ్లిపోయింది. మధు ఫోన్ చేస్తే ''నేను నీతో ఉండను. నా ఫ్రెండ్‌తోనే ఉంటాను. నిన్నైనా వదులుకుంటాను గానీ, తనను మాత్రం వదులుకోను'' అని ఫోన్ పెట్టేసింది. మళ్లీ ఎన్ని సార్లు చేసినా తియ్యలేదు. ఎన్ని మెసేజ్‌లు పెట్టినా స్పందించ లేదు. పదే పదే ఫోన్లు చేస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అప్పటి నుంచి అతనికి టార్చర్ మొదలయింది. పోలీసులు అతన్ని బెదిరిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని మధు ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి...
''మేడమ్ సౌమ్య అనే అమ్మాయి నాకు పరిచయం అయ్యి ఆరు నెలలు అవుతుంది. తను నేను పని చేసే చోటే కొత్తగా జాబ్‌లో చేరింది. అక్కడే మా ఇద్దరికీ పరిచయం అయ్యింది. పెండ్లి చేసుకోవాల నుకున్నాం. ప్రేమించక ముందు తన గురించి నాకూ ఏమీ తెలియదు. ఇంట్లో నుండి వచ్చేసి తన స్నేహితురాలు సాధనతో కలిసి రూం తీసుకుని ఉంటుంది. ఇంట్లో సమస్య ఏంటో తనూ చెప్పలేదు, నేనూ అడగలేదు. మా ఇంట్లో పెండ్లికి ఒప్పుకోలేదు. సాధననే మాకు దగ్గరుండి పెండ్లి చేసింది. అన్నీ తనే దగ్గరుండి చూసుకుంది.
అయితే పెండ్లి చేసుకున్న తర్వాత సాధనతోనే మాకు పెద్ద సమస్య. పెండ్లి అయిన రోజే పెద్ద గోల చేసింది. నేను చూసిన ఇల్లు ఆమెకు నచ్చలేదు. దాంతో ''ఇంత చిన్న ఇల్లు తీసుకుంటావా? ఇందులో నా ఫ్రెండ్ ఎలా ఉంటుంది. మంచి ఇల్లు తీసుకొని అన్నీ కొని అప్పుడు తీసుకెళ్ళు'' అని సౌమ్యను తనతో తీసుకెళ్ళబోయింది. ఆమె నాతో ఎంత పోట్లాడుతున్నా నా భార్య నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ''నా స్నేహితురాలికి ఇష్టమైతేనే నేను నీతో ఉంటాను. లేదంటే ఉండను. తను ఏం చెప్తే నేను అదే చేస్తాను'' అంది సౌమ్య.
రెండు రోజుల్లో వేరే ఇల్లు తీసుకుంటానని ఎంతో బతిమలాడాను. చివరకు సాధన ఒప్పుకుంది. ఆమె ఒప్పుకున్న తర్వాతనే సౌమ్య నాతో ఉండటానికి అంగీకరించింది. ఇదంతా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మా సంసారంలో ఆమె ఇంత పెత్తనం చేయడం నాకు నచ్చలేదు. పైగా ఆ రోజు రాత్రి సాధన కూడా మాతోనే ఉంటానంది. ''నా స్నేహితురాలిని నీతో ఒంటరిగా ఉండనీయను'' అని మాతోనే ఉండిపోయింది. సౌమ్య కోసం నేనూ మౌనంగా ఉండిపోయాను.
తెల్లారిన తర్వాత నేను వేరే ఇల్లు చూడటానికి వెళ్ళాను. నేను వచ్చే సరికి ఇద్దరూ ఇంట్లో లేరు. వాళ్ళ బ్యాగులు కూడా లేవు. వాళ్ళ రూంకి వెళ్ళి చూస్తే ఇద్దరూ అక్కడే ఉన్నారు. సౌమ్యను నాతో రమ్మని అడిగాను. ''సాధన వెళ్ళమంటేనే నేను నీతో వాస్తాను, లేదంటే రాను'' అని మొండికేసింది. ఇక నేను ఏం చేయలేక తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఒకటే మాట. తన స్నేహితురాలు వెళ్ళమంటేనే వెళతానంటుంది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ తీయడం కూడా మానేసింది. ఇక నేను నా పనిలో పడిపోయాను.
నెల రోజుల తర్వాత చెప్పాపెట్టకుండా సౌమ్య మా ఇంటికి వచ్చేసింది. నాతోనే ఉంటానని గోల చేసింది. మా అమ్మానాన్న నన్ను బాగా తిట్టారు. నా కోసం తిరిగి వచ్చిన సౌమ్యను వదిలి ఉండలేక తనను తీసుకుని హైదరాబాద్ వచ్చి ఇల్లు తీసుకున్నాను. వారం రోజులు ఇద్దరం బాగానే ఉన్నాం. మళ్ళీ సాధన మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి సౌమ్య మారిపోయింది. అసలు తను నా దగ్గరకు ఎందుకు వచ్చిందో అప్పుడు నాకు అర్థమయింది.
తను వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి రావడానికి కారణం కూడా ఇదే. గత ఏడాది ఊళ్ళో తన స్నేహితురాలికి ఇంట్లో వాళ్ళు పెండ్లి సంబంధం చూశారంటా. ఆమెకు ఆ పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని సౌమ్యతో చెప్పి ఏడ్చిందంటా. ఆ పెండ్లి నుంచి తప్పించడానికి ఆమెను తీసుకుని సౌమ్య సిటీకి వచ్చేసింది. దాంతో ఆ స్నేహితురాలి తల్లిదండ్రులు సౌమ్యపై కిడ్నాప్ కేసుపెట్టారు. ఈ మధ్యనే ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ సమస్య నుంచి బయట పడటానికే సౌమ్య మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నాపైన ప్రేమతో కాదు.
ఇన్ని సమస్యలు ఉన్నా నాకు సౌమ్య అంటే చాలా ఇష్టం. పాత విషయాలన్నీ మర్చిపోయి ఇద్దరం సంతోషంగా ఉందామని చెప్పాను. కానీ సౌమ్య నా మాట వినడం లేదు. సాధన మాటే వింటుంది. ఆమె ఏం చెబితే అదే చేస్తుంది. ఇద్దరూ ఒకే రూంలో పడుకొని నన్ను బయట పడుకోబెట్టారు. వాళ్ళ పరిస్థితి అస్సలు అర్థమయ్యేదికాదు. సౌమ్యను ఎంత ప్రేమగా చూసుకున్నా నా గురించి అస్సలు పట్టించుకోదు. ఎప్పుడూ తన స్నేహితురాలి గురించే మాట్లాడుతుంది.
ఇలా సాధన మా జీవితాల్లో పెద్ద విలన్లా తయారయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ ఎటో వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే తీయడం లేదు. పైగా నాపై పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. వాళ్ళను నేను హింసిస్తున్నానంటా. పోలీసులు ఫోన్ చేసి రమ్మంటూ నన్ను బెదిరిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను. ఇప్పటికైనా సౌమ్య అంటే నాకు ఇష్టమే. మీరు తనతో మాట్లాడి మా జీవితాల్లోకి సాధన రాకుండా చూడండీ'' అంటూ బతిమలాడుకున్నాడు.
మధు చెప్పింది విన్న లీగల్‌సెల్ సభ్యులు సౌమ్యకు లెటర్ పంపుతామన్నారు. అయితే ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ఆడ్రస్ తన దగ్గర లేదని చెప్పాడు మధు. దాంతో ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే సౌమ్య ఫోన్ తన స్నేహితురాలికి ఇచ్చింది. ''సౌమ్య ఎక్కడికీ రాదు. మధు ఉట్టి మోసగాడు. సౌమ్యను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇరుకు ఇంట్లో ఉంచాడు. తింటానికి సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. అలాంటి వాడితో ఉండాల్సిన కర్మ నా స్నేహితురాలికి లేదు. తనకు తోడుగా నేనున్నాను. సౌమ్య ఎక్కడికీ రాదు. అతనితో అస్సలు కలిసి ఉండదు'' అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.
''నువ్వు అలా మాట్లాడడం మంచిది కాదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.ఇప్పటి వరకు సరిగా కలిసి కూడా ఉండలేదు. నువ్వే దగ్గరుండి వాళ్ళకు పెండ్లి చేశావు. ఏమైనా సమస్యలు వస్తే సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే సమస్య అయితే ఎలా? మనందరం కలిసి వాళ్ళిద్దరినీ కలుపుదాం'' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు.
''నా ఫ్రెండ్ ఎక్కడికీ రాదు. నా మాటే తన మాట'' అని ఫోన్ పెట్టేసింది. దాంతో మధు కంగారు పడ్డాడు. పోలీసులు బారి నుండి ఎలా బయటపడాలి మేడమ్ అంటూ బాధపడ్డాడు.
''నువ్వు చేసిన పొరపాటు ఒక్కటే. ఆమె గురించి ఏమీ తెలుసుకోకుండా ప్రేమించావు, పెండ్లి చేసుకున్నావు. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అర్థం కావడంలేదంటున్నావు. సౌమ్య తన స్నేహితురాలి మాట జవదాటటం లేదు. తల్లిదండ్రులు లేకుండా పెరిగింది. స్నేహితులతోనే ఎక్కువగా కలిసి ఉంది. అందుకే ఇలా తయారయింది. ఆమెకు బంధాల పట్ల నమ్మకం, గౌరవం లేనట్టుంది. అందుకే నిన్ను నమ్మకుండా స్నేహితురాలి మాటే నమ్ముతుంది.
పోలీసులు నీకు ఫోన్ చేస్తే వెళ్ళు. నువ్వు పదే పదే ఫోన్ చేసి రమ్మంటున్నావనే ఆమె పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. నిన్ను భయపెట్టడానికే ఇలా చేసింది. తనకు నీతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. మాకు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకు చెప్పు. తను నీతో వస్తే మంచిగా చూసుకుంటానని పోలీసుల దగ్గర చెప్పు. నీపై ఆమెకు కొద్దో గొప్పో ప్రేమ వుంటే వస్తుందు. రాకపోతే పోలీసులకే విషయం అర్థమవుతుంది. అసలు వెళ్ళకుండా ఉంటే పోలీసులు నిన్నే అనుమానిస్తారు. త్వరగా ఈ సమస్య పరిష్కరించుకో.
నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆమె ఇక నీ దగ్గరకు రాకపోవచ్చు. అందుకే ఆమె గురించి మర్చిపోయి మంచిగా పని చేసుకో. మీ నాన్నను చూస్తే జాలేస్తుంది. అనవసరంగా లేని పోని సమస్యల్లో తలదూర్చకు. ఇరవై ఏండ్లు కూడా నిండకుండా పెండ్లి చేసుకున్నావు. అసలు నీది పెండ్లి చేసుకునే వయసే కాదు. మంచిగా పని చేసుకుని అమ్మానాన్నలకు అండగా ఉండు. ఇకపై నువ్వు సరిగ్గా పని చేయకపోయినా, అమ్మాయిల చుట్టూ తిరిగినా మేమే పోలీసులకు పట్టిస్తాం'' అని హెచ్చరించారు.
మధుని బయటకు పంపించి కొడుకు గురించి బాధపడుతున్న తండ్రితో ''అవసరమైతే మేము కూడా పోలీసులతో మాట్లాడతాం. మీరేం భయపడకండీ'' అని ధైర్యం చెప్పి పంపించారు.