Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏది తినకుండా నోరు కట్టేసుకుంటే బరువు తగ్గుతామనుకుంటారు చాలామంది. అది ఆరోగ్యకరం కాదు. అసలే మహిళల్లో రక్తహీనత ఎక్కువ. తినకుండా ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. కొందరేమో వ్యాయామం చేస్తున్నాం కాబట్టి అన్నీ తినేయొచ్చు అనుకుంటూ ఉంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. బరువు తగ్గాలంటే వ్యాయామంతోపాటూ ఆహారంలోనూ మార్పులు చేసుకోవాల్సిందే. సమతులాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తణధాన్యాలు వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
నిద్రకూ, బరువుకీ దగ్గర సంబంధం ఉందంటోంది ఓ అధ్యయనం. శరీరానికి తగినంత విశ్రాంతి దొరకనప్పుడు క్యాలరీలు ఖర్చుకావు. కంటినిండా నిద్రపోనప్పుడు ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం అంతంత మాత్రమే. కాబట్టి రోజులో కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి. ఇది మీకు క్రమశిక్షణను అలవాటుచేయడమే కాదు బరువునీ అదుపులో ఉంచుతుంది.
ఒత్తిడిని వీలైనంతవరకూ అదుపులో ఉంచేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒత్తిడికి గురైనప్పుడు తెలియకుండానే ఎక్కువగా అదీ చిరుతిళ్లను తినడానికి ఆసక్తి చూపిస్తాం. అలా తగ్గాల్సిన బరువు పెరుగుతుంది.
ఇంటికి కావాల్సిన సరకులు కొనుక్కోవడానికి బజారుకు వెళ్లి రండి. అలా తిరిగినందుకూ, ఆ సరకుల్ని ఆటోలో వేసుకుని ఇంట్లోకి మోసుకొచ్చినందుకు వంద క్యాలరీలు కచ్చితంగా ఖర్చవుతాయి.
వంట చేయడానికి కావాల్సిన కూరగాయల్ని ఫ్రిజ్‌లోంచి తీస్తాం. రోజులో కాస్త సమయం అయినా వంటిల్లు సర్దుకుంటాం. ఇవన్నీ చేయడానికి వంద క్యాలరీలు తేలిగ్గా ఖర్చవుతాయి.
పది నిమిషాల పాటూ మరీ వేగంగా కాకుండా ఓ స్థాయిలో తాడాట ఆడండి. దానివల్లా కెలొరీలు కరుగుతాయి.
కూర్చుని ఓ సీరియల్ చూస్తున్నారు. అరగంటపాటూ సాగే ఆ సీరియల్ మధ్యలో వాణిజ్య ప్రకటనలు వస్తాయి కదా.. అప్పుడు ఉన్నచోటే సరదాగా జాగింగ్చేయండి. ఎంత కాదన్నా... కనీసం నూటపది కెలొరీలు ఖర్చవుతాయి. నలభై నిమిషాల పాటూ దుస్తులు ఇస్త్రీచేసినా కూడా అంతే లాభం పొందుతారు.