Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఆమె నిరూపించారు. వృత్తిలోనే కాదు నిజజీవితంలోనూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మూడు దశాబ్దాలకు పైగా ప్లాస్టిక్ సర్జన్‌గా రాణిస్తూ.. వేలాది మందికి సరికొత్త జీవితానిస్తున్నారు ప్రముఖ డాక్టర్ లక్ష్మీ సలీమ్. అందం కోసం కాకుండా ఆత్మన్యూనత నుంచి బయటపడేందుకు తన నైపుణ్యాన్ని వినియోగిస్తూ.. మహిళల్లో కొత్తఆశలను నింపుతున్నారు. స్కిన్క్యాన్సర్ బారిన పడినా ఏ మాత్రం భయపడకుండా ఒక వైపు చికిత్స తీసుకుంటూ.. మరోవైపు డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. 15 వేలకు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేసి ఎంతో మందికి కొత్త రూపాన్నిచ్చిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మహిళా ప్లాస్టిక్ సర్జన్ కావడం గమనార్హం. మహిళ బాధ మరో మహిళ మాత్రమే అర్థం చేసుకోగలదంటూ సృష్టిపరమైన లోపాలను సరిచేస్తున్నారు. ఎంతో మందికి వైద్యంతో పాటు ధైర్యం అందిస్తున్న ఆమెతో మానవి..
డాక్టర్ చదవాలనుకున్న ఆడపిల్లలు గైనికో, జనరల్ మెడిసన్ తీసుకుంటారు. మరి మీరు సర్జరీ వైపు వెళ్లడానికి కారణం?
నాకు చిన్నతనం నుంచి సర్జరీ చేయడమే ఇష్టం. నిజానికి నేను మెడిసిన్ చదివింది సర్జన్ కావాలనే.
మీ నిర్ణయాన్ని ఇంట్లోవారు అంగీకరించారా?
మొదట్లో వద్దన్నారు. నా పట్టుదలను చూసి ఒప్పుకున్నారు. అయితే ఇంట్లో కన్నా కాలేజీలో ప్రొఫెసర్లు ఎక్కువగా వ్యతిరేకించారు. 'ఆడపిల్లవు కాబట్టి పీడియాట్రిక్స్ లేదా గైనకాలజీ ఎంచుకో...సర్జరీ వద్దు' అంటూ ప్రొఫెసర్లు నిరుత్సాహపరిచారు. అప్పట్లో సర్జరీ చేసే మహిళా వైద్యులు చాలా అరుదు. దాంతో నా ఇష్టానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ తర్వాత నా పట్టుదల చూసి వారే ఆశ్చర్యపోయారు. ఎవరు ఎన్ని విధాల చెప్పినా నా నిర్ణయం మార్చుకోలేదు.
సర్జన్ కావాలన్నది చిన్నతనం నుంచి మీ ఆశ. మరి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్న ఆసక్తి ఎలా కలిగింది?
ఎంబిబిఎస్ చేసే సమయంలో బర్నింగ్ కేసులను చూసేదాన్ని. అగ్నిప్రమాదంలో గాయపడిన వారు వైద్యచికిత్స తర్వాత చాలా ఆత్మన్యూనతభావంలో ఉండేవారు. మారిన వారి రూపాన్ని చూసి ఇరుగుపొరుగు వారే కాదు కొన్నిసార్లు ఇంట్లోవారు కూడా అసహ్యించుకునేవారు. వారి మానసికవేదన నన్ను ప్లాస్టిక్ సర్జరీలో స్పెషలైజేషన్ చేసేందుకు ఒక ముఖ్య కారణమైంది.
మీగురించి చెప్పండి?
నేను పుట్టిపెరిగింది విజయవాడలో. నాన్న ఇంజనీరు. మేం ఆరుగురం పిల్లలం. అందరికంటే చిన్నదాన్ని. ఉండేది. విజయవాడలోనే ఇంటర్ వరకు చదివాను. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేశాను. ఆ తర్వాత చండీగఢ్‌లో ఎమ్మెస్ చేశాను. అనంతరం సర్జరీలో ఎమ్‌సిహెచ్ కూడా పూర్తి చేయగలిగాను.
మీరు వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానూ ఎంతో ధైర్యంగా మతాంతర వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత మీరు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు?
సలీమ్.. నా క్లాస్మేట్. గుంటూరు మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. అప్పుడే మా మధ్య పరిచయం మా చదువుతో పాటే పెరిగింది. అయితే మా ప్రేమను పెండ్లి వరకు తీసుకువెళ్లడానికి ఇరువైపుల కుటుంబపరిస్థితులు, మతాలు అడ్డు గోడలుగా నిలిచాయి. తెనాలి నుంచి గుంటూరు వలస వచ్చిన సంప్రదాయ ముస్లిం కుటుంబం వారిది. ఇంటికి పెద్ద కొడుకుగా సలీమ్‌కు బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. మా ఇద్దరికీ ఎమ్మెస్‌లో చండీగఢ్‌లో సీటు వచ్చింది. ఎమ్మెస్ తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
మా పెండ్లిని ఇరువైపు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయం ఉండేది. దాంతో రిజిష్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు పడినా.. మా మానసికపరిణతిని చూసి ఇరువైపుల వారు మా ప్రేమను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మా ఇంట్లో దసరా, దీపావళి, సంక్రాంతి మాత్రమే కాదు రంజాన్, బక్రీద్ కూడా ఘనంగా చేస్తాం. నవరాత్రుల్లో సలీమ్ ఉపవాసం ఉంటారు.. రంజాన్‌కు నేను ఉపవాసదీక్ష పాటిస్తాను. మా అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని పెండ్లి చేసుకోవడంతో ఈ మధ్య క్రిస్మస్ కూడా చేస్తున్నాం.ఆశ్చర్యం ఏమిటంటే మా కోడలుకు బౌద్ధమతం మీద నమ్మకం ఎక్కువ. తాను బౌద్ధం పాటిస్తుంది.
మీరు ప్లాస్టిక్ సర్జన్‌గా లండన్‌లో శిక్షణ తీసుకున్నారు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా మీరు ఎందుకు వద్దనుకున్నారు?
చండీగఢ్‌లో ఎమ్‌సిహెచ్ పూర్తి చేయగానే లండన్‌లో శిక్షణ పొందే అవకాశం వచ్చింది. అప్పుడు పాపకి మూడేళ్లు. తనని తీసుకుని లండన్ వెళ్లిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. కొంతకాలం అక్కడ పని చేసి ఇండియా తిరిగి వచ్చాం. చండీగఢ్‌లో మేం చదివిన కాలేజీ నుంచి ఆఫర్ వచ్చింది. మరిన్ని హాస్పిటల్స్ నుంచి కూడా జాబ్ ఆఫర్లు వచ్చాయి. కానీ మా లక్ష్యం వేరు. మేం పెరిగిన పరిసరాల్లో రోడ్డు ప్రమాదాల్లో, అగ్నిప్రమాదాల్లో గాయపడిన ఎంతో మందికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంది. అందుకే మా ఇంటినే పది పడకల ప్లాస్టిక్ సర్జరీ యూనిట్‌గా మార్చి 1984లో కెరీర్ మొదలుపెట్టాం.
ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించాలంటే లీగల్ చర్యలు ఎదుర్కోవాలి. మరి మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి?
ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎవరికీ పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే నేను సర్జన్‌గా ప్రాక్టిస్ ప్రారంభించాను. గాయపడిన వ్యక్తులు మారిన తమ రూపంతో ఎటువంటి ఇబ్బంది పడకుండా సాధారణ జీవితం గడపటానికి అవసరమైన సర్జరీలు మాత్రమే చేసేదాన్ని. కష్టంలో ఉన్న పేషెంట్‌కు చేతనైనంత సేవ చేయటమే నా బాధ్యతగా భావించాను. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు నిరాకరించిన కేసులు వచ్చేవి. ఆత్మ స్థయిర్యం, ఆత్మవిశ్వాసాలను పెంచటానికి ప్లాస్టిక్ సర్జరీని ఉపయోగిస్తాను. అందుకని వీలైనన్ని పబ్లిక్ టాక్స్, రేడియో షోలు ఇచ్చి, ప్రతి మీటింగ్‌లో ప్లాస్టిక్ సర్జరీతో కాలిన గాయాలకు ఎలా చికిత్స చేయొచ్చో, ఎలా సరిచేయవచ్చో వివరిస్తూ వచ్చాను.
ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఖర్చుతో ఉంటుంది కదా.. మరి మీ వద్దకు వస్తే పేదవారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. వారికి మీరు ఉచితంగా చికిత్స అందిస్తున్నారా?
ప్లాస్టిక్ సర్జరీ ఖరీదైనదే. అయితే ఆత్మవిశ్వాసం అంతకన్నా ఖరీదైనది. క్లాసులో అన్నింటిలో ఫస్ట్ వచ్చే అమ్మాయి యాసిడ్ దాడికి గురి అయ్యింది. ప్రాణాలతో బయటపడినా.. తమ రూపం కోల్పోయి చీకటికే పరిమితమైంది. దాంతో ఆమె జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. ఆమె ముఖానికి కొన్ని దఫాలుగా ప్లాస్టిర్ సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే నలుగురిలోకి వస్తుంది. ఇలాంటి వారికి మేం సహాయం చేస్తుంటాం. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ అసోసియేషన్ తరఫున లేడీ ప్లాస్టిక్ సర్జన్స్ ఇక్కడ ఏర్పాటు చేసే క్యాంపుకి వచ్చి సర్జరీల్లో సహాయపడుతూ ఉంటారు. కెనడా, జర్మనీ, అమెరికా దేశాల నుంచి వచ్చి కొన్ని కేసులకు స్పాన్సర్ చేయటంతోపాటు ఉచితంగా సర్జరీలు చేస్తారు. అలా గత దశాబ్దాంగా దాదాపు 350 మంది పేషెంట్లకు సర్జరీలు చేశాం. ఏడాదికి రెండు క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. ఇందుకోసం మేం 'సలజ' ట్రస్టును ఏర్పాటుచేశాం. ఈ ట్రస్ట్‌కు వచ్చే విరాళాల ద్వారా పేదలకు సర్జరీలు చేస్తున్నాం.
మీరు చర్మ క్యాన్సర్‌తో బాధపడుతూ, కీమోథెరపీతో బలహీనపడినా రోగులకు సేవలందించడంతో మాత్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?
నా వద్దకు చికిత్సకోసం వచ్చేవారే నాకు స్ఫూర్తి. శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు పడుతున్నా.. రేపటి మీద ఆశతో బతుకుతుంటారు. నాకు వచ్చిన స్కిన్ జబ్బు క్యాన్సర్ లాంటిది అని తెలిసినప్పుడు భయపడలేదు. సలీమ్, పిల్లలు అండగా నిలబడ్డారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నా అది శరీరానికే తప్ప మనసుకు కాదు. పేషంట్లతో ఉన్నప్పుడే మనసుకు శాంతి అనిపించేది. రోజూ వారితో మాట్లాడుతుంటే నా బాధ మరిచిపోతుంటాను.