Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు ఒక విధమైన అనుభూతిని పొందుతుంది. ప్రతిక్షణం తన బుజ్జాయి ఎదుగుదలను చూస్తూ మురిసిపోతుంది. ఆ మార్పులను ఆస్వాదిస్తూ ఆనందిస్తుంది. నెలలు పెరుగుతున్న కొద్దీ బిడ్డలో ఎలాంటి మార్పులు వస్తాయో మనమూ తెలుసుకుందాం...
మొదటి నెల : పుట్టిన రెండు మూడు వారాల్లోపు బొడ్డుతాడు ఊడిపోతుంది. మొదటి నెల పూర్తయ్యే సరికి తల అటూ ఇటూ తిప్పుతుంది. తల్లిని గుర్తించగలుగుతుంది. పిడికిలి బిగించి తన ముఖం దగ్గరకు కదిలిస్తూ ఉంటుంది. రాత్రుళ్ళలో ఎక్కువగా ఏడుస్తుంటుంది.
రెండవ నెల : కాళ్ళు నిటారుగా చాపి, కాలికి తగిలిన దాన్ని బలంగా తన్నుతుంటుంది. కదలికలు ఎక్కువగా ఉంటాయి. తల ఎత్తడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆటలాడుతూ పిడికిలి నోట్లో పెట్టుకుంటుంటుంది. అందరినీ చూస్తూ చిరునవ్వులు నవ్వుతూ.. ఆఆ.... ఉఉఉ... అంటూ చిన్న చిన్న శబ్దాలు చేస్తుంటుంది.
3వ నెల : మానసిక శక్తి పెరగడం ప్రారంభమవుతుంది. తల్లి మాట విన్నా, కళ్ళతో చూసినా సులువుగా గుర్తుపట్టి చిరునవ్వులు చిందిస్తుంటుంది. వస్తువు, మనిషి కదులుతుంటే అటు వైపే కండ్లను తిప్పుతూ గమనిస్తుంటుంది. పిడికిలి బిగించడం తీయడం ఎక్కువగా చేస్తుంది. బోర్లా పడి ఎద భాగం, మో చేతుల మీద భారం ఉంచి తల ఎత్తి చూస్తుంటుంది. ఏవైనా వస్తువును పట్టుకుంటుంది. మూడవ నెల నుంచి ప్రతి రెండు నుంచి మూడు గంటలకొకసారి పాలు పట్టడం చేస్తుండాలి.
4వ నెల : రాత్రి నిద్రలో ఏడవడం క్రమంగా తగ్గుతుంది. చక్కిలి గింతలు పెడుతుంటే వాటికి తగినట్టు నవ్వుతూ ఆనందిస్తుంది. శబ్దాలు, రంగులను సులువుగా గుర్తించి అటువైపు చూసే ప్రయత్నం చేస్తుంటుంది. మోచేతుల మీద భారం వేస్తూ పొట్టను చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది. బొమ్మలు, వస్తువులు ఏవైనా సరే దగ్గరకు లాక్కుని తన్నే ప్రయత్నం చేస్తుంటుంది.
5వ నెల : మానసిక శక్తి ఇంకా పెరుగుతుంది. రంగుల్లో తేడాలు అర్థమవుతుంటాయి. శబ్దాలకు కదలికలకు స్పందించే తీరులోనూ మెరుగుదల కనిపిస్తుంది. పక్కన కూర్చుని మాట్లాడుతుంటే తను విటుందనే భావం ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా చిరునవ్వుతో స్పందిస్తుంది. బొమ్మను చూపించి దాగుడుమూతలు చేస్తుంటే నవ్వుతూ ఉంటుంది. కొంచెం సేపు కూర్చోబెట్టవచ్చు. ఒకవేళ ఇలాంటివన్నీ చేయకపోయినా వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు.
6వ నెల : రాత్రుళ్ళు ఎక్కువ సమయం నిద్ర పోతుంది. శబ్ధంలోనూ, నవ్వులోనూ తేడా వస్తుంది. ఆ నవ్వు చూసే వారి మనసుకు హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. తల్లి చేసే శబ్దాలను, సైగలను ఎక్కువగా అనుకరించే ప్రయత్నం చేస్తుంది. బోర్లా పడడం ప్రారంభమవుతుంది. అన్నీ నోట్లోకి పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది.
7వ నెల : వినికిడి శక్తి బాగా మెరుగవుతుంది. మాటలు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. అన్ని రంగులు చూడగలుగుతుంది. ఏం చేస్తే మీరు తన దగ్గరకు వస్తారో ఆ పనులు చేస్తుంటుంది. నేల మీద చేతులు ఆనించి, గోడ, సోఫా ఇలా ఏదోక ఆధారం చేసుకుని తనంతట తాను కూర్చుంటుంది. బొటనవేలు, చూపుడు వేళ్ళతో వస్తువులను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. నిటారుగా నిలబెట్టినపుడు కాళ్ళను గట్టిగా ఆనించి నిలబడుతుంది. పండ్లు, కూరగాయలు వంటివి గుజ్జుగా చేసి తినిపించవచ్చు.
8వ నెల : దూరంగావున్న వస్తువులైనా సరే గుర్తించి, పాకి వెళ్ళి దగ్గరకు లాక్కొంటుంది. వస్తువుల ఆకారాలను గమనిస్తుంటుంది. పాకడానికి ఏదైనా అడ్డు తగిలినా వాటిని సులువుగా గుర్తించగలుగుతుంది. తను వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళేందుకు నేల, మంచం మీద ఎక్కడైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటుంది. దాని మీదనే దృష్టి పెడుతుంది. పాకడం బాగా వస్తుంది. కొంత మంది చిన్నారులు పాకడానికి టైం పడుతుంది. కొందరు నేరుగా నడవడం ప్రారంభిస్తారు.
9వ నెల : మానసిక శక్తి బాగా మెరుగవుతుంది. తనకు సంబంధించిన వస్తువులను బాగా గుర్తించగలుగుతుంది. ఎక్కువగా పాకుతుంటుంది. ఎక్కువ సమయం కూర్చుంటుంది. తను చేసే శబ్దాలలో తేడా బాగా ఉంటుంది. ఎక్కువగా 'మా..మ్మా..', 'దా..దా..', 'పా.. పా..' వంటివి అంటుంటుంది. ఏవైనా తినిపిస్తుంటే దానిని తన వేళ్ళతో పట్టుకుంటుంది.
10వ నెల : తనకిష్టమైన గొంతులను సులువుగా గుర్తుంచుకుంటుంది. డోర్ బెల్, ఫోన్ రింగ్ వంటివి మోగగానే అటు వైపు దృషి ్ట సారిస్తారు. శబ్దాలు మాత్రమే కాదు కొన్ని సైగలు, పదాలు అర్థం చేసుకుని స్పందిస్తుంది. ఉదాహరణకు టాటా.. బై.. వంటివి చెప్పగానే స్పందించి తగిన సంజ్ఞ చేస్తుంటుంది. కాళ్ళతో చేతులతో ఏమేం చేయవచ్చో తెలుసుకుంటుంది. అత్త, అమ్మ, మామ, పాప, దాదా, తాత వంటి పదాలు స్పష్టంగా పలుకుతుంటుంది.
11వ నెల : దూరాలను, వస్తువులను సులువుగా చేరుకోగలుగుతుంది. ఏదైనా తనకు కావాల్సినది కనిపిస్తుంటే అటువైపు వేలు చూపిస్తుంటుంది. చిన్న చిన్న అడుగులతో నడక మెల్లగా సాగిస్తుంటుంది. కనిపించిన వాటిని నోటిలో పెట్టుకుని రుచి చూసే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి.
12 వ నెల : ఏ ఆధారం లేకుండానే నిలబడు తుంది. కొన్ని పదాలు స్పష్టంగా పలుకుతుంది. సరైన పోషణ ఉంటే 12వ నెల పూర్తయ్యే సరికి పుట్టినప్పటి బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. ఏవైనా తినిపిస్తుంటే తనే తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటుంది. టీవీ, ఫోన్లలో ఏవైనా కొన్ని సీన్లను చూస్తూ ఆనందిస్తుంది.