Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దైనందిన ఆహారపదార్ధాల తయారీలో అల్లం ఉపయోగించడం సర్వసాధారణం. ఇందులోనూ టీ అలవాటున్నవారు ఈ చలి కాలంలో అల్లంతో చేసిన టీ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అల్లం ఉపయోగించడం వల్ల చలికాలంలో రొంప పట్టదు. అంతే కాదు అల్లం వల్ల చర్మం, జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...
- తలలో చుండ్రు సమస్య సాధారణంగా వస్తుంటుంది. ఎన్ని రకాల షాంపూలు వాడినా ఉపశమనం దొరకదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెట్టి పార్లర్లకు వెళ్ళి చికిత్సలు చేయించుకుంటారు. కానీ వాటి స్థానంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీమోక్రోబియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది.
- అల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి జుట్టుకు పోషణను అందించి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
- పొడిగా మారిన జుట్టు పెళుసుగా మారి సులువుగా తెగిపోతుంది. ఇలాంటప్పుడు అల్లం సహజమైన కండీషనర్‌గా పనిచేసి జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. ఇది జట్టులోని తేమను కోల్పోనివ్వదు.
- అల్లంలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణను అందించి ఆరోగ్యంగా, బలంగా మారుస్తాయి. ఇందులో ఉండే ''జింజెరాల్'' రక్తనాళాలను విశ్రాంత పరచి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది కేశాలకు అవసరమైన పోషణను అందించి జుట్టును పెరిగేట్టు చేస్తుంది.
హెయిర్ మాస్క్ తయారు చేసుకునే విధానం
- టేబుల్ స్పూన్ తురిమిన అల్లంను చిన్న గిన్నెలో తీసుకుని దానికి కొబ్బరినూనె చేర్చి బాగా కలపాలి. ఐదునిమిషాలు ఆగి, జుట్టును పాయలుగా విడదీస్తూ మొత్తం పట్టేలా తలకు రాయాలి. ఐదు నిమిషాలు పాటు మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.
- తురిమిన అల్లం 2 టేబుల్ స్పూన్లు తీసుకుని దీనిలో కొద్దిగా నిమ్మరసం, నువ్వులనూనె చేర్చి బాగా కలపాలి. దీన్ని ఐదు నిమిషాలు పాటు జుట్టుకు మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత జుట్టును షాంపూ ఉపయపోగించి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచింది.
- 2 టేబుల్ స్పూన్ల తురిమిన అల్లం, టేబుల్ స్పూన్ తురిమిన దోసకాయ, 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె 1 టేబుల్ స్పూన్ తులసి నూనె ఒకదాని తరువాత ఒకటి వేసి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఐదు నిమిషాలు ఆగి జుట్టుకు పట్టించాలి. ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. దోసకాయలో ఉండే విటమిన్ ఎ, సిలికా, సల్ఫర్ జుట్టు రాలడాన్ని అరికట్టి ఎదుగుదలకు సహకరిస్తాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.