Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జుట్టు కళ తప్పినట్టు కనిపిస్తుంటే.. కప్పు గోరువెచ్చటి నీళ్లలో కాస్త వెనిగర్.. రెండు చెంచాల తేనె కలిపి రాసుకోవాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు కాంతిమంతంగా మారతాయి. దాంతోపాటు ఉసిరి, శీకాయ పొడిని రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు నీళ్లని వడకట్టి.. కాఫీ పొడి కలిపి మరిగించాలి. ఇలా మరిగిన నీళ్లను చల్లార్చి... గోరింటాకు పొడిలో కలిపి తలకు పెట్టుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేసి కండిషనర్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు హానిచేసే కారకాలు దూరమవుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. ఇంట్లోనే స్పా చికిత్స చేసుకున్న ఫలితం లభిస్తుంది.
- ప్రత్యేకంగా అలంకరించుకోవడానికి ముందు ఆల్కహాల్ లేని క్లెన్సర్‌తో ముఖం తుడుచుకోవాలి. అలానే గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ను కలిపి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి. అలానే పొడిచర్మం ఉన్నవారు... లిక్విడ్ ఆధారిత మాయిశ్చరైజర్ రాయాలి. జిడ్డుచర్మతత్వం ఉన్నవారు నూనెలు లేని మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. అలానే పెరాక్సైడ్ క్రీమును రాసుకోవడం వల్ల మొటిమలు, బ్రేక్అవుట్స్ కనిపించవు. వీటన్నింటితోపాటు సున్నిత, పొడిచర్మతత్వం ఉంటే పీల్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది.
- కళ్ల కింద నల్లమచ్చలు ఉన్నవారు ఆరెంజ్ ఆధారిత క్రీములు రాసుకోవాలి. దీనివల్ల పిగ్మెంటేషన్ తగ్గి సమస్య దూరమవుతుంది. రాత్రిపూట ఐ మాస్క్‌లు ప్రయత్నించడం వల్ల ఫలితం ఉంటుంది. తరచూ కళ్ల కింద బాదం నూనెతో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
- ఈ కాలంలో పెదాలు పొడిబారి... పొట్టులా రాలిపోతుంటాయి. అలాంటప్పుడు ఆలివ్‌నూనెతో మర్దన చేసుకోవాలి. లిప్‌స్టిక్ వేసుకోవడానికి ముందు లిప్‌బామ్ లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవడం వల్ల పెదాలు అందంగా కనిపిస్తాయి.
- మెడ చుట్టూ నల్లగా మారిపోతే ఇలా చేయొచ్చు... పాలమీగడ, పెరుగు, కాస్త చక్కెర తీసుకుని నల్లగా ఉన్నచోట మర్దన చేయాలి. వారానికి మూడు సార్లు స్నానానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.