Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దన లేవగానే గుక్కెడు చారు గొంతులో దిగితేనే
కాలకృత్యాలు సజావుగా సాగుతాయి. పని ఒత్తిడిలో
కాస్త రిలీఫ్ కావాలంటే కప్పు టీ తాగాల్సిందే..
వణికించే చలి నుంచి ఉపశమనం కోసం గరంగరం
టీ కావల్సిందే. ఇటీవల సులభంగా తయారు
చేసుకునేలా టీబ్యాగ్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఆరోగ్యం కోసమంటూ హెర్బల్ టీ సేవించేవారు
ఎక్కువయ్యారు. ..ఇలా అనేక సందర్భాల్లో
టీ సగటు మనిషి జీవితంలో పెనవేసుకుపోయింది.
టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తించి ఆరోగ్యకరమైన,
నాణ్యమైన టీని 'ఎక్సోటిక్బ్లూమింగ్ టీస్'
పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం
చేస్తున్నారు ప్రముఖ క్రీడాకారిణి నీలిమాచౌదరి.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణీగా విదేశాల్లో తనకు నచ్చిన,
ఎందరో మెచ్చిన టీ ప్లేవర్స్‌ను హైదరాబాదీయులకు
రుచి చూపిస్తున్న ఆమె పరిచయం..
నాన్న కొత్త భాస్కరరావు. రైల్వేలో ఉద్యోగం. అమ్మ విజయలక్ష్మి. అన్నయ్య, నేను. చిన్నప్పుడు హూగ్లీలో ఉన్నాం. నాన్న జాబ్ అక్కడేలో కావడంతో నేను అక్కడే నాల్గోతరగతి వరకు చదివాను. ఆ తర్వాత విజయవాడకు వచ్చాం. ఐదోతరగతి నుంచి డిగ్రీవరకు అక్కడే చదివాను. ఆరోతరగతిలో బ్యాడ్మింటన్‌పై ఇష్టంతో ప్రముఖ కోచ్ భాస్కరబాబు వద్ద చేరాను. పదేండ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెట్టాను. మా కోచ్ సహాయంతో 'స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'కి సెలెక్ట్ అయ్యాను. సింగిల్స్, డబుల్స్‌లో రెండింటిలోనూ ఆడాను. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో పతకాలను సాధించాను. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రెండో ర్యాంక్ వరకు వచ్చాను. కామన్వెల్త్ గేమ్స్‌లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. 2002 వరకు బ్యాడ్మింటన్‌నే కెరీర్‌గా ఎంతో కష్టపడ్డాను. అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం గెలిచాను. ఆ తర్వాత పెండ్లితో ఆటకు బ్రేక్ పడింది. ఇంటి బాధ్యతలు, ఇద్దరు పిల్లల పెంపకంతో బిజీగా ఉండి దాదాపు 14 ఏండ్లు పోటీలకు దూరంగా ఉన్నాను. అయినా బ్యాడ్మింటన్ ఆడటం ఆపలేదు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంతో పాటు కాంస్య పతకం గెలిచాను.
మక్కువ ఎక్కువ..
ప్రతి ఉదయం దాదాపు అందరి ఇండ్ల నుంచి గుప్పుమని వచ్చే వాసన టీదే. నాకు టీ అంటే చాలా ఇష్టం. క్రీడాకారిణిగా అనేక దేశాలకు వెళ్ళాను. మన ఇంట్లో చేసే టీ కాస్త చేదుగా, వగరుగా అనిపిస్తుంది. గ్రీన్‌టీలో కూడా చక్కెర వేసుకుని తాగుతారు. ఇతర దేశాల్లో టీ రుచి చాలా వెరైటీగా అనిపించేది. చాలా దేశాల్లో.. టీ చేయడానికి పొడి రూపంలో ఉండే టీపౌడర్‌ను ఉపయోగించరు. ఆకుల రూపం ఉన్న టీ ఆకులనుంచే టీ తయారుచేస్తారు. వీటిని 'హయ్యండ్ టీ' లుగా పిలుస్తారు. అవి మన దేశంలో కొన్ని చోట్ల మాత్రమే లభిస్తున్నాయి. ఆయా ప్లేవర్ ్స బాగా నచ్చడంతో విదేశాల నుంచి టీ సరంజామా తెచ్చుకునేదాన్ని. అయినా కొద్దిరోజులకు అవి అయిపోగానే మళ్లీ ఇక్కడ లభించే టీ పొడి వాడాల్సి వచ్చేది. దాంతో కొత్త ఆలోచన వచ్చింది. నా మాదిరిగానే చాలామంది మంచి టీ కోసం ఆరాటపడుతుంటారు కదా అనిపించింది. డార్జిలింగ్ నుంచి టీ ఆకులను తెప్పించి రకరకాల టీలను తయారు చేస్తూ ఎన్నో కొత్త ప్లేవర్స్‌ను ట్రై చేసాను. అయితే చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాల్లో టీలో చాలా ప్లేవర్స్ ఉంటాయి. అరబ్ దేశాల్లో మసాలా టీలు ఆహ్లాదాన్నిస్తాయి. అలా విదేశాల్లో, ఉత్తర భాతరదేశంలో లభించే టీ ప్లేవర్స్పై పరిశోధన చేసాను.
ఆరోగ్యం కోసం..
ఇటీవల ఆరోగ్యం కోసమంటూ చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. మరింత సులభంగా గ్రీన్ టీ చేసు కునేలా టీ బ్యాగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఓపెన్ చేసి చూస్తే అందులో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ గా కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలంలో అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా విదేశాల్లో మాదిరిగానే టీ ఆకులతో చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేను ప్రయోగాలు చేసిన టీ ప్లేవర్స్‌ను టెస్టారోసాలో టీ ప్రేమికులకు అందించాం. చాలామంది వెరైటీ టెస్ట్‌ను ఆస్వాదించారు. వీటన్నింటినీ ఆలోచించి ప్రత్యేకంగా టీ కోసమే ఒక షాపు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. నా ఆలోచనకు మా వారు, స్నేహితులు, బంధువులు కూడా మద్దతునిచ్చారు. దాంతో ఇంట్లో సెల్లార్లో ఖాళీగా ఉన్న ప్లేస్‌ను మోడిఫై చేయించి 'ఎక్సోటిక్ బ్లూమింగ్ టీస్' పేరుతో వెరైటీ ప్లేవర్స్ టీ బొటిక్ ఏర్పాటు చేసాను. గత 18నెలలుగా టీ ప్రియులను మా బొటిక్ అలరిస్తుంది.
మెరుగైనా క్వాలిటీ..
గ్రీన్ టీ, లెమన్ టీ, పుదీనా టీ, అల్లం టీ ఇలా రెగ్యులర్‌గా తాగే వెరైటీలే కాకుండా రోజ్ టీ, లావెండర్టీ, యాపిల్ టీ, హైబిస్కస్ టీ వంటి అరుదైన వెరైటీ ప్లేవర్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. కావల్సిన టీలను రుచి చూసి, నచ్చిన, మెచ్చిన ఫ్లేవర్ల టీలను కొనుగోలు చేసుకోవచ్చు. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని భావిస్తాను. మా వద్ద మొత్తం హాట్ , కోల్డ్ వెరైటీలు కలిపి 40వరకు ఉన్నాయి. ఈ ఏడాది మరో 15ప్లేవర్స్ తీసుకువస్తున్నాం. టీ ప్లేవర్స్‌తో పాటు వైట్ హనీ, శాఫ్రాన్ హనీ, జామూన్ హనీ వంటి ఏడు రకాల తేనె, స్వచ్ఛమైన రోజ్ వాటర్ మా బొటిక్‌లో అందు బాటులో ఉంది. త్వరలో హిమాలయాల్లో లభించే 'శిలాజిత్' తో చిన్నారుల ఎనర్జీ పౌడర్ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటు న్నాం. కశ్మీర్ నుంచి మంచి కుంకుమపువ్వును తెప్పిస్తాం. మేరా కిషన్, క్యూమార్ట్ తదితర చోట్ల మా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మాతో అందుబాటులో ఉన్న టీ ప్లేవర్స్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ ప్యాక్‌లు కూడా తయారు చేస్తున్నాం. వీటితో పాటు వెరైటీ సైజ్‌ల్లో టీ కప్పులు, కెటిల్ లభిస్తాయి.
వీ హబ్ సహాయంతో..
ఔత్సాహిక మహిళా పారిశ్రా మిక వేత్తలను ప్రోత్సహించే వీహబ్‌లో ఎంపికయ్యాను. మూడువందల మంది తమ కొత్తకొత్త ఆలోచనలో ముందుకు రాగా అందులో 27మందిని ఎంపిక చేసారు. పరిశ్రమ, వ్యాపారాన్ని విస్తరించ డానికి కావల్సిన ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా అందిస్తారు. ఇప్పటి వరకు నా సొంతంగానే చేస్తున్నాను.. త్వరలో వీహబ్ సహాయంతో బ్రాంచ్‌లు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది.
బుక్‌లెట్‌గా టీ ప్రయోజ నాలు ప్రపంచ వ్యాప్తంగా వందలాది టీ ప్లేవర్స్ అందు బాటులో ఉన్నాయి. మనం వేడినీటిలో టీ ఆకులను వేసి మరిగిస్తాం. దాంతో ప్లేవర్ అంతా ఆవిరై.. ఒక విధమైన చేదు, వగరు వస్తుంది. ఈ రుచులను డామినెట్ చేయడానికి చక్కెర కలుపుతాం. ఈ విధమైన టీ తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మాతో లభించే టీ ప్లేవర్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని వాటిపై వేడి నీళ్లు పోయాలి. మూత పెట్టి నిమిషం తర్వాత కప్పులోకి ఫిల్టర్ చేసుకుంటే సరి. ఇందులో చక్కెర, తేనె వంటివి కలపాల్సిన అవసరం లేదు. 2.5గ్రాముల టీ ఆకులతో మూడుసార్లు టీ చేసుకోవచ్చు. ఇలాంటి వివరాలతో పాటు ఏ ప్లేవర్‌తో ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి వంటి అంశాలతో చిన్న బుక్లెట్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం
వి. యశోద