Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెలుగులు విరజిమ్మే ఇంట్లో దిగులుకు చోటే ఉండదు. ఎల్లవేళలా ఆ ఇల్లు సంతోషానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆఫీస్ నుంచి ఒత్తిడితో ఇంటికి రాగానే వెలుగులతో అందంగా అలంకరింపబడ్డ ఇల్లు ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి ఇంటీరియర్ లైటింగ్ గొప్పదనాన్ని తెలుసుకోండి. మీ ఇంటికి సరిపడే లైటింగ్‌ను ఎంచుకోండి. ఆయా గదుల అవసరాన్ని బట్టి లైటింగ్‌ను చక్కగా వాడుకుంటే ఇల్లు ఆనందదాయంగా కనిపిస్తుంది.
లివింగ్ రూం హాల్: గెస్ట్‌లు వచ్చినపుడు వారి దృష్టిని మొదటగా ఆకర్షించేది హాల్ అనే విషయాన్ని మీరు విస్మరించకూడదు. మీ ఇంటిపై వారు ఓ అభిప్రాయానికి రావడానికి హాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే ప్రదేశమిది. అందుకే హాల్ లైటింగ్ పై ప్రత్యేక శ్రద్ద కనబరచాలి. మూడు లేదా నాలుగు కార్నర్స్ నుంచి లైటింగ్ పడే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. డెకరేటివ్ ఐటమ్స్‌ని హైలైట్ చేసే విధంగా లైటింగ్ ఉండాలి. సాయంత్రం రిలాక్స్ కావడానికి డిమ్‌గా ఉండే లైట్లను ఏర్పాటు చేసుకోవాలి.
బెడ్ రూం: విశ్రాంతి కోసం అందరూ ఎంచుకునే గది బెడ్ రూం. అందుకు తగ్గట్టే బెడ్ రూంలో బెడ్ సైడ్ లాంప్స్కి ప్రాధాన్యం ఇవ్వండి. లైట్లను ప్రశాంతంగా ఉన్నవి ఎంచుకోండి. బెడ్ సైడ్ లాంప్స్ దొరకకపొతే ఫ్లోర్ లాంప్స్కి ప్రాధాన్యం ఇవ్వండి. మీ బెడ్‌కు ఎదురుగా ఉండే గోడపై కూడా దృష్టి పెట్టండి. ఆ గోడపై కూడా లైటింగ్ చక్కగా పడేలా ఏర్పాట్లు చేస్తే బెడ్ రూంకి అందమైన లుక్ వస్తుంది.
కిచెన్: కిచెన్‌లో వెలుతురు చక్కగా ఉండడం ఎంతో అవసరం. ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు సరైన పదార్థాలను వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి వెలుతురు అవసరం. డిమ్మెర్ ఉన్న ఓవర్ హెడ్ లైటింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. అండర్ కేబినేట్ లైట్స్‌ను కూడా వాడవచ్చు. కిచెన్ కార్నర్స్కి అలాగే సింక్‌కి వెలుతురు సరిగ్గా చేరడానికి అమిత ప్రాధాన్యతనివ్వండి.
డైనింగ్ హాల్: కుటుంబం అంతా కలిసి కూర్చునే ప్రదేశం డైనింగ్ హాల్. కాబట్టి ఇక్కడ సరైన వెలుతురు ఉండడం ముఖ్యం. అందమైన జ్ఞాపకాలకు డైనింగ్ హాల్ నెలవుగా మారుతుంది. అందరూ కలిసి చక్కగా ముచ్చటించుకుంటూ భోజనం చేస్తారిక్కడ. అందుకే గ్రాండ్ లుక్ కోసం డైనింగ్ టేబుల్ పైన షాన్డిలియర్ని ఏర్పాటు చేసుకోండి.
బాత్ రూం: అద్దానికి పైన మంచి లైటింగ్‌ని ఏర్పాటు చేయండి. రిలాక్సింగ్ షవర్స్ కోసం బాత్ రూంలో సరైన వెలుతురు అవసరం. ప్రకాశవంతమైన వెలుతురు కోసం ఓవర్ హెడ్ లైట్‌ను బాత్ రూంలో ఏర్పాటు చేసుకోండి.