Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్ల కౌమారం నుండి యవ్వనానికి మారే దశ ఒక అందమైన ప్రయాణం. ఈ దశలో ఆడపిల్లలో ఎత్తు, బరువులో గణనీయనీయమైన పెరుగుదల ఉంటుంది. అలాగే లైంగిక పరికత్వత పొందుతారు. ఈ దశనే రజస్వల అంటారు. రజస్వల అవడం యవ్వనంలో ముఖ్యమైన భాగం. ఇలాంటి సమయంలో అమ్మాయిలు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. అలాంటప్పుడే తల్లి సహాయం బిడ్డకు అవసరముంటుంది. పైగా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చిన్న వయసులోనే జరస్వల అవుతున్నారు. అలాంటి అమ్మాయిల పట్ల మరింత శ్రద్ధ చూపించాలి. అలా చూపించాలంటే తల్లులకు వీటిపట్ల కొంత అవగాహన అవసరం.
ఈ దశలో సంభవించే హార్మోన్ల మార్పులు, గర్బాశయం, అండాశయాలు వంటి పునరుత్పత్తి అవయవాల పరిమాణం పెరుగుతుంది. లైంగిక పరిపక్వత సంకేతాలు కూడా కనిపిస్తాయి. వీటినే సెకండరీ లైంగిక లక్షణాలు అని పిలుస్తారు. ఆ లక్షణాలు ఏమిటంటే...
రొమ్ము అభివృద్ది మొట్టమొదటి సంకేతం. రొమ్ము పెరుగుదల ప్రారంభంలో రెండు వైపులా అసమానంగా ఉంటుంది. దీనికి ఆందోళన చెందాల్సిన పని లేదు.
రొమ్ము అభివృద్ధి తరువాత జననాంగాల్లో జుట్టు బయటికి వస్తుంది. చంక కింద జుట్టు పెరుగుతుంది. ఈ సమయంలో జననాంగల పరిశుభ్రత అనేది ఆందోళన కలిగించే విషయం.
పై రెండు లక్షణాలు కనిపించిన సమయంలోనే రుతుస్రావం ప్రారంభం అవుతుంది. ఈ దశలో అమ్మాయిలు శారీరక, భావోద్వేగ ఆందోళనకు గురవుతారు. ఇలాంటప్పుడే వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం తల్లులుగా మన బాధ్యత.
ఈ రోజుల్లో అమ్మాయిల్లో 8 ఏండ్ల వయసులోనే రజస్వల సంకేతాలు కనిపిస్తున్నాయి. 2 నుంచి 3 దశాబ్దాలు కిందటితో పోలిస్తే ఇప్పుడు సుమారు 5 సంవత్సరాలు మందే అవుతున్నారు. ఇది తల్లులకు, అమ్మాయిలకు ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ మార్పుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేమిటంటే...
ఊబకాయం: 25కి పైన ఉన్న బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన బాలికలు తొందరగా రజస్వల అవుతున్నారు. ఎన్నో అధ్యయనాలు ఈ రెంటికి మధ్య సంబంధాన్ని నిరూపించాయి. కాబట్టి అధికబరువును అదుపులో ఉంచాలి.
ఆహారపదార్థాలు: పిల్లలు బర్గర్స్, చిప్స్ వంటి అధిక కాలరీలు ఉన్న ఫాస్ట్ ఫుడ్స్, కోలా, తీపి పానీయాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిలో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇలాంటి ఆహారం అమ్మాయిలు త్వరగా రజస్వల కావడానికి కారణమవుతుంది. ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి.
నిశ్చల జీవనశైలి: నేటి పిల్లలు పోటీ ప్రపంచంలో జీవిస్తున్నారు. చదువులో అత్యంత ప్రతిభ చూపండం, అన్నింట్లో విజయాలు సాధించడం చాలా ముఖ్యం. అలాగే సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటివి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి. వీటికి అలవాటు పడి వ్యాయామం, శరీరక శ్రమ చేయడానికి సమయం దొరకడం లేదు. ఈ అనిశ్చలమైన జీవనశైలి మరొక కారణం.
పర్యావరణ ప్రభావం: గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రపంచీకరణలోనూ పెను మార్పులు వచ్చాయి. దీనివల్ల రసాయనాల వాడకం, పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. త్వరిత రజస్వల, పర్యావరణ రసాయనాల మధ్య సంబంధాన్ని కొన్ని అధ్యయనాలు రుజువుచేశాయి.
ఒత్తిడి: ఒత్తిడి మన జీవితంలో భాగం అయిపోయింది. దీనికి యువత మినహాయింపు కాదు. విద్య, సాంఘిక నియమాలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారి నుండి ఒత్తిడి, శరీర ఆకృతి ఇబ్బందులు... ఇలా కారణాలు ఎన్నో కావచ్చు. ఇది త్వరిత రజస్వలకి కారణమై ఒత్తిడిని మరింత పెంచుతుంది.
వైద్య అనారోగ్యం: కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యత లేదా ఎండోక్రైన్ కణితుల వంటి వైద్య సమస్యలు త్వరిత రజస్వలానికి దారితీస్తాయి.
ఇది అమ్మాయిల జీవితంలో సాధరణమైన విషయమే. అయినప్పటికీ దీనిపై పూర్తి అవగాహన లేకుండానే తమకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతుంటారు. ఈ త్వరిత రజస్వల ఉద్వేగతంతో కూడుకున్న ఒత్తిడికి దారితీస్తుంది. దీని కారణంగా రొమ్ము క్యాన్సర్ పెరిగిన సంఘటనలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కాలేదు.
అందుకే రజస్వల సమయంలోని శాస్త్రీయతను అర్థం చేసుకొని అమ్మాయిలకు అవగాహన కలిగించడం తుల్లులుగా మన బాధ్యత. మీరు మీ బిడ్డలో తొలి సంకేతాలను గమనిస్తే, వైద్యపరంగా పరిశీలించి అలాగే కౌమార వైద్య నిపుణుడి ద్వారా సలహా ఇప్పించి దీని కారణంగా జరిగే ఇతర విషయాల గురించి వారికి అవగాహన కల్పించాలి.