Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్న : మాకు కరీంనగర్లో నాలుగు షాపులున్నాయి. వాటిని అద్దెకు ఇచ్చాం. మూడు షాపుల వాళ్ళు బాగానే క్రమం తప్పకుండా అద్దె ఇస్తున్నారు. నాలుగో షాపు అతను గత ఐదు నెలలుగా అద్దె ఇవ్వడం లేదు. బిజినెస్ సరిగా ్గలేదు కుదిరినప్పుడు ఇస్తానని చాలా పొగరుగా చెప్తున్నాడు. షాపు ఖాళీ చేయమంటే చేయకపోగా తప్పుడు అడ్రస్ పెట్టి కోర్టులో కేసు ఫైల్ చేసి స్టే ఆర్డర్ తీసుకువచ్చాడు. పైగా అద్దె కట్టడం లేదు. ఈ ఆర్డర్ ఉంటే అద్దె కట్టకూడదా? ఇతని ఖాళీ చేయించాలంటే మేము ఏమి చేయాలి? అద్దె నియంత్రణ చట్టం గురించి వివరంగా చెప్పండి.
జవాబు : పట్టణ, పల్లె ప్రాంతాలలో భవనాలు బాడుగకు ఇచ్చేందుకు అడ్వాన్సుగా ఎక్కువ మొత్తాన్ని భవనసొంతదారులు వసూలు చేస్తుండడంతో పాటు అద్దె పదేపదే పెంచడం వల్ల సొంత ఇల్లు లేనివారు అనేక ఇబ్బందులకు గురైతున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం 1960లో 'అద్దె నియంత్రణ చట్టం' రూపొందించారు. కార్పోరేషన్ పరిధిలో నెలకు 3,500రూపాయలు, మేజర్ పంచాయితీ పరిధిలోని నెలకు 2.000 రూపాయలు మించి అద్దె ఉండే ఇండ్లు, దుకాణాలు, గోదాములు తదితర భవనాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం అడ్వాన్సు ఒక నెల అద్దె మొత్తం కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలులేదు. అలాగే అద్దె క్రమం తప్పకకుండా ఇవ్వాలి. యజమానికి , అద్దెకు ఉండే వారి మధ్య వివాదం నెలకొంటే ఇరు వైపుల వారు ఆయా ప్రాంత పరిధిలోని జూనియర్ సివిల్ జడ్డి(రెంట్ కంట్రోలర్) వారి ఎదుట అర్జీలు దాఖలు చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ మేరకు ఇరుపార్టీలు ఆమోదించిన అద్దె మొత్తం లేదా కోర్డు వారు తీర్మానించిన మొత్తం అద్దెను యజమానికి చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. అద్దె చెల్లించిన మొత్తానికి యజమాని నుంచి రశీదు పొందేందుకు చట్టప్రకారం కిరాయిదారుడు హక్కు కలిగి ఉన్నాడు. ఏదైనా కారణంతో ఇంటి యజమాని అద్దె తీసుకోవడానికి నిరాకరిస్తే ఇంటియజమాని బ్యాంకు అకౌంట్ నెంబరు కోరుతూ యజమానికి చట్టరీత్యా నోటీస్ జారీ చేయవచ్చు. యజమాని అకౌంటు నెంబర్ తెలియచేస్తే ఇంటి అద్దె క్రమం తప్పకుండా ప్రతినెలా అద్దె మొత్తాన్ని అకౌంట్లో జమచేయాలి. ఇంటి యజమాని అకౌంట్ నెంబర్ తెలియని పక్షంలో మనియార్డర్ ద్వారా చెల్లించాలి. యజమాని మనియార్డర్ తీసుకోవడానికి నిరాకరిస్తే తన పరిధిలోని కోర్టులో అద్దెమొత్తాన్ని జమ చేయవచ్చు. ప్రతినెలా అద్దె మొత్తాన్ని చెల్లించకపోతే అతన్ని భవనం ఖాళీ చేయవల్సిందిగా కోరుతూ యజమాని కోర్టులో అర్జీ దాఖలు చేసుకోవచ్చు. యజమాని సొంత అవసరం నిమిత్తం కిరాయిదారులను ఖాళీ చేయమని కోరినా ఖాళీ చేయని పక్షంలో యజమాని కోర్టును ఆశ్రయించవచ్చు. ఇరు పార్టీల వాదనలు విన్న తర్వాత యజమానికి ఇంటి అవసరం ఉందని నిరూపణ అయితే కిరాయిదారులను ఖాళీ చేయవల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఒకవేళ అద్దె ఇచ్చిన భవనాలకు ఏదేని మరమ్మత్తులు అవసరమైతే అందుకు గాను కిరాయిదారుడిని భవనం ఖాళీ చేయమని కోరుతూ యజమాని కోర్టులో అర్జీ దాఖలు చేసుకోవచ్చు. మరమ్మత్తులు చేసిన తర్వాత
తిరిగి అదే కిరాయిదారుడికే అద్దెకు ఇవ్వాలి.
పదవి విరమణ చేసిన సైనిక, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు వారు పదవి విరమణ చేయుటకు ఏడాది ముందు నుంచి, ఏడాది లోపు అద్దెకిచ్చిన ఇంటిని ఖాళీ చేసి స్వాధీనం చేయమని కోరే హక్కు వారికి ఉంది. అలాగే సీనియర్ సిటిజన్లు(65 ఏండ్లు పై బడినవారు), వితంతువులు, వికలాంగులు కూడా అద్దె ఇంటిని ఖాళీ చేసి స్వాధీనం చేయమని కోరే హక్కు కలిగి ఉన్నారు.
కాగా కొందరు యజమానులు కిరాయిదారులను ఖాళీ చేయించడం కష్టమని తలచి భవనాలకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వసతుల కు ఆటంకం కలిగించినా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. భవననిర్మాణం జరిగి 15ఏండ్లు లోపు ఉన్న ఇండ్లకు ఈ చట్టం వర్తించదు. ప్రభుత్వ భవనాలకు కూడా ఈ చట్టం వర్తించదు. కావున ఇరుపార్టీలు ఈ చట్టంలోని నిబంధనలు తెలుసుకోని వివాదాలు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళవచ్చు.
ఇక మీ కేసు విషయంలో త్వరగా మీరు లాయర్‌ను సంప్రదించి సెక్షన్ 8 రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మీకు రావల్సిన అద్దె బాకాయి మొత్తంను, ప్రతినెల చెల్లించాల్సిన అద్దెను కోర్టులో డిపాజిట్ చేయమని పిటిషన్ ఫైల్ చేయండి. దానితో పాటు తప్పుడు అడ్రసు ఇచ్చి కోర్టు వారిని మోసం చేసినందుకు అతనికి శిక్ష కూడా పడుతుంది. అతనితో మీరు సెటిల్మెంట్ చేసుకోవల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన అద్దె ప్రతినెల కోర్డు ద్వారా మీ అకౌంట్లో పడుతుంది.
మీ సమస్యలు రాయల్సిన చిరునామా..
ఎడిటర్, లీగల్ కాలమ్, మానవి, నవతెలంగాణ తెలుగు దినపత్రిక, ఎంహెచ్ భవన్, ప్లాట్ 21/1, ఫస్ట్‌ఫ్లోర్ , అజామాబాద్ ఇండిస్టియల్ ఏరియా, హైదరాబాద్ 500020. ఎaఅaఙఱఏఅaఙa్‌వశ్రీaఅస్త్రaఅa.షశీఎ