Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భంలో బిడ్డ ఎదుగుదల కోసం గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణి పౌష్టికాహారం తీసుకోవాలి అనే అనుకున్నాం! కానీ గర్భం దాల్చడానికి ఎంతో ముందు నుంచే మహిళ తీసుకున్న ఆహారం ప్రభావం గర్భం దాల్చిన తర్వాత బిడ్డ మెదడు ఎదుగుదల మీద ఉంటుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆహార పరిశోధక సంస్థకు తమ తాజా పరిశోధనల వివరాలను అందజేస్తూ బిడ్డ మెదడు ఎదుగుదల మీద ఆహారం ప్రభావం గురించి వారు వివరించారు. ఒక మహిళ గర్భం దాల్చడానికి ఎంతో ముందు నుంచి, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు సమపాళ్లలో తీసుకుంటూ ఉంటే గర్భం దాల్చిన సమయంలో బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుందనీ, ప్రసవం తర్వాత కూడా బిడ్డ ఆరోగ్యం బాగా ఉంటుందని అంటున్నారు.
అలా కాకుండా పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటూ గర్భం దాల్చితే, పిల్లలు పుడుతూనే సెరెబ్రల్ పాల్సీ, ఆటిజం లాంటి రుగ్మతలను వెంట తెచ్చుకోవడంతో పాటు, పిల్లలు నెలలు నిండకుండా పుట్టే ప్రమాదం కూడా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఒమేగా-3, ఒమేగా-6... ఈ రెండు ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే మన దేశంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ల పరిమాణం పెరుగుతూ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల పరిమాణం తరుగుతోంది. దీని వల్ల తేలికగా ఇన్ఫ్లమేషన్స్కు గురవడం, తక్కువ తెలివితేటలు మొదలైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఆహారంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ల నిష్పత్తి 1:5 గా ఉండాలని పరిశోధకులు చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ వాడకం ఎక్కువ. మన ఆహారశైలి అలాంటిది కావడంతో ఒమేగా-6 ఎక్కువగా, ఒమేగా-3 తక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి అలవాటు వల్ల ఒమేగా-6 శరీరంలో ఎక్కువగా చేరిపోయి, అంతో ఇంతో ఆహారం ద్వారా అందిన ఒమేగా -3 శరీరంలో శోషణ జరగకుండా మిగిలిపోతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే రెండింటి నిష్పత్తిని సక్రమంగా ఉంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం ఒమేగా-3 ఎక్కువగా ఉండే సోయా, పామ్, వేరుసెనగ, ఆవ నూనెలను మార్చి మార్చి వాడుతూ ఉండాలి. మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండే ఓలిక్ యాసిడ్ భరిత పొద్దు తిరుగుడు నూనెను కూడా వాడాలి. అవొకాడో, కొబ్బరి నూనె, ఆలివ్ నూనెల్లో కూడా ఓలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.