Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని రకాల జ్వరాల వల్ల జుట్టు రాలిపోతుంది. ఇన్ఫెక్షన్లు, వైరల్, బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల జుట్టు విపరీతంగా ఊడుతుంది. క్యాన్సర్ల లోనూ, క్యాన్సర్ చికిత్సలో వాడే మందులకి, రేడియేషన్కి జుట్టు మొత్తం ఊడుతుంది. వయసులో ఉన్న వారికి ఆ చికిత్స పూర్తి కాగానే మళ్లీ జుట్టు పెరుగుతుంది. కొన్నిసార్లు జుట్టు తిరిగి రాకపోవచ్చు. ఇటువంటి సందర్భాలలో కొందరు తమ జుట్టుని క్యాన్సర్ బాధితుల కోసం డొనేట్ చేస్తుండటం మంచి పరిణామం. కొన్ని వాతావరణ పరిస్థితులు అతివేడి, అతి చల్లదనం జుట్టుకి పనికి రావు. జుట్టుని మాటిమాటికీ బ్లో డ్రయింగ్ చేయించడం కూడా జుట్టు కోల్పోడానికి కారణమవుతుంది. జుట్టుకి వేసే వివిధ రకాల రంగులకు చెందిన రసాయనాలు, షాంపూలూ, తలమీద వుండే చర్మాన్ని నాశనం చేయడంతో పాటు, జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. అందుకే డాక్టర్ సలహాతో మాత్రమే చుండ్రుకి సంబంధించిన, ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకి సంబంధించిన షాంపూలూ, లోషన్లూ వాడాలే గానీ వ్యాపార ప్రకటనలు చూసి కాదు.
కొంత మంది మానసిక రోగులలోనూ, మానసిక ఆందోళనకు గురి అయిన వారిలోనూ జుట్టు పీక్కునే అలవాటు వుంటుంది. దీనినే ''టయిఖో టిల్లో మానియా'' అంటారు. వీరిలో కూడా, తల మీద జుట్టు తగ్గిపోయి కనపడుతుంది. పైపైన రాసే నూనెల వలనా, షాంపూల వలనా పొందే ప్రయోజనం చాలా తక్కువ.
మంచి ఆహారం (ఆకు కూరలూ, పప్పులూ, గుడ్లూ, ఇతర ఖనిజాలూ కలిగిన సమతులాహారం) చక్కని నిద్రా, జుత్తు రాలిపోడానికి దారితీసే అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకోవడం, కాలుష్యం లేని వాతావరణంలో ఉండడం వంటివి చేయాలి. అనవసరమైన కెమికల్స్, రంగులూ జుట్టుకి హానిచేస్తాయని గ్రహించి, వయసుకు తగ్గట్టుగా జుట్టులో వచ్చే మార్పులను స్వీకరించడం మంచిది.