Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంశీ పెద్దగా చదువుకోలేదు. రియల్ఎస్టేట్ చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. ఇదే పని మీద ఓ వ్యక్తిని కలవడానికి ఉమెన్స్ కాలేజీ వద్ద నిలబడ్డాడు. దాదాపు రెండు గంటల పాటు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నాడు. అప్పుడే తన స్నేహితులతో కబుర్లు చెబుతున్న వసూ అతని కంట పడింది. సన్నగా, తెల్లగా, అందంగా గలగలా మాట్లాడుతున్న ఆమె వంశీకి బాగా నచ్చింది.
తనవైపే చూస్తున్న వంశీని వసూ కూడా గమనించింది. తర్వాత రోజు కూడా అదే సమయానికి వంశీ కాలేజీ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు కూడా వసూ కనిపించింది. అలా ఓ నాలుగు రోజుల పాటు ఇద్దరూ కండ్లతోనే పలకరించుకున్నారు. తర్వాత వంశీ ధైర్యం చేసి వసును పలకరించాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఇద్దరూ స్నేహితులుగా మారారు.
వసూ హాస్టల్లో ఉంటూ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వంశీ పరిచయమయిన దగ్గర నుంచి ఆమె ప్రతి అవసరాన్ని అతనే చూసుకునేవాడు. ఫోన్ కూడా కొనిపించాడు. వసూ చదువు పూర్తయిన తర్వాత పెండ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వంశీ వాళ్ళ ఇంట్లో అతనికి పెండ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దాంతో అతను వెంటనే పెండ్లి చేసుకుందామని వసూని అడిగాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పైగా 'మా ఇంట్లో మన పెండ్లికి ఒప్పుకోవడం లేదు. నన్ను మర్చిపో' అంది.
వసూను ఎంతో బతిమలాడాడు. అయినా ఒప్పుకోలేదు. రోజూ అతనితో మాత్రం మాట్లాడేది. వంశీకి తులసి అనే అమ్మాయితో నిశ్చితార్థం అయింది. ఈ విషయాలేవీ వసూకి తెలియదు. ఓ రోజు అతని ఫోన్లో ఫొటోలు చూసి నిలదీసింది.
'మీ ఇంట్లో మన పెండ్లికి ఒప్పుకోరాన్నావు. ఎంత బతిమలాడినా నువ్వు కూడా ఒప్పుకోవడం లేదు. మరి ఇంకేం చేయాలి. మా ఇంట్లో పెండ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఒప్పుకున్నాను. మరో వారంలో పెండ్లి తేదీ నిర్ణయించారు' అన్నాడు. దాంతో వసూ పెద్ద గోల చేసింది. ''నన్ను కాదని వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటే చచ్చిపోతాను' అన్నది.
ఎంత బతిమలాడినా తనతో పెండ్లికి ఒప్పుకోని వసూ ఇప్పుడు ఇలా రివర్స్ కావడంతో షాక్ తిన్నాడు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని అతను అస్సలు ఊహించలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేది లేక 'పెండ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాను' అని చెప్పి వెళ్ళిపోయాడు.
వసూకి మాట అయితే ఇచ్చాడు కానీ పెండ్లి ఇలా ఆపాలో వంశీకి అర్థం కాలేదు. అలా మూడు రోజులు గడిచిపోయాయి. ఒకపక్క వసూ ఫోన్లు చేసి తెగ ఇబ్బంది పెడుతుంది. 'మరో రెండు రోజుల్లో పెండ్లి ఉంది. ఇప్పుడు ఈ పెండ్లి ఆగిపోతే ఓ అమ్మాయికి జీవితం నాశనం అయిపోతుంది. నన్ను క్షమించు. ఎవరి జీవతం వాళ్ళు చూసుకుందాం' అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. పైగా లెటర్లో అతని పేరు రాసి పెట్టి మరీ చచ్చిపోతానంది. నిద్ర మాత్రలు తెచ్చుకుని వాట్సాప్‌లో ఫోటో పెట్టింది. దాంతో భయపడిన వంశీ 'ఈ పెండ్లి ఆగిపోవాలంటే ఒకటే మార్గం. నువ్వు వెళ్ళి నాపై పోలీస్ స్టేషన్లో కంప్లెయిట్ ఇవ్వు. అప్పుడు పోలీసులు వచ్చి ఈ పెండ్లి ఆపుతారు' అని సలహా ఇచ్చాడు. అతను చెప్పిన ప్రకారమే పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చింది. అనుకున్న ప్రకారమే పోలీసులు వంశీని పిలిపించారు.
ఇరువైపులా తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరికీ పెండ్లి చేసి పంపించారు. కొడుకు తనను మోసం చేశాడని తండ్రి, వంశీతో మాట్లాడటం మానేశాడు. అటు వసూ తల్లి దండ్రులు కూడా వీళ్ళను పట్టించుకోలేదు. కొత్త జంట ఓ గది తీసుకుని కాపురం పెట్టారు.
రెండు రోజుల తర్వాత తులసి, వంశీకి ఫోన్ చేసి 'ఇలా ఎందుకు చేశావు. నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించిన విషయం ముందే చెబితే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదుకదా..?' అని బాధపడింది. ఆమె బాధను చూడలేక వంశీ అప్పుడప్పుడు ఆమెతో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయం వసూకి తెలిసింది. ఇక అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
వసూ, వంశీని దగ్గరకు రానిచ్చేది కాదు. 'నన్ను వదిలి పెట్టి వెళ్లిపో, నేను చచ్చిపోతాను' అంటూ గోల చేసేది. వంశీ ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. దాంతో తులసితో మాట్లాడడం మానేశాడు. కానీ వసూ అతన్ని నమ్మడం లేదు. పైగా రోజు రోజుకు ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. వాళ్ల కొత్త కాపురం ఓ నరకంలా మారిపోయింది. ఒక పక్క తల్లిదండ్రులు తనతో మాట్లాడకపోవడం, ఊళ్ళో పరువు పోవడం, ఇక్కడ వసూ ఇలా పిచ్చి దానిలా ప్రవర్తించడం ఇదంతా వంశీకి కష్టంగా అనిపించింది. చివకు అతను ఆమెపై చేయిచేసుకునే స్థితికి వచ్చాడు. ఇద్దరూ ప్రేమించుకుని పెండ్లి చేసుకున్నా శత్రువుల్లా మారిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే వసూ, వంశీని తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. వాళ్ళు వంశీతో మాట్లాడితే 'మేడం ఇద్దరం ప్రేమించి పెండ్లి చేసుకున్నాం. అసలు ఆమె ముందే మా పెండ్లికి ఒప్పుకుంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. చివరి నిమిషంలో పెండ్లి ఆగిపోవడంతో నేను మా వాళ్ళందరికీ శత్రువునయ్యాను. ప్రేమించిన అమ్మాయినే పెండ్లి చేసుకున్నా కదా... సంతోషంగా ఉండొచ్చనుకున్నా. కానీ ఇప్పుడు ఈమెకూ శత్రువునయ్యాను. పెండ్లి చెడిపోయిందనే బాధలో ఉన్న తులసితో ఎప్పుడో రెండు సార్లు ఫోన్లో మాట్లాడాను. వసూకి ఇష్టం లేదని తెలిసి మానేశాను. అయినా అనుమానం పోలేదు. ఈ టార్చర్ భరించలేకపోతున్నా. ఎన్ని సార్లు చెప్పినా నా మాట వినదు. నోరు తెరిస్తే చాలు గొడవలే. ఇంట్లో సరిగ్గా వంట చేయదు. రోజూ బయటే తినాలి. మొత్తానికి నాకు నరకం చూపిస్తుంది' అని బాధపడ్డాడు.
వసూతో మాట్లాడితే 'అతను ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నాడు. నేనంటే అస్సలు ఇష్టం లేదు. బలవంతం చేస్తేనే పెండ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాతో సరిగ్గా ఉండడం లేదు. నాకు ఎవ్వరూ లేరని ఇలా ప్రవర్తిస్తున్నాడు' అని పెద్దగా ఏడ్చేసింది.
దాంతో లీగల్‌సెల్ సభ్యులు 'నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని బాధపడుతున్నావు. నిన్ను వదిలించుకునేవాడైతే ఇంత వరకు వచ్చేవాడు కాదు. ఎప్పుడో నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోయేవాడు. పెండ్లి ఆపడానికి నీకు సలహా ఇచ్చింది కూడా అతనే. ఆ పెండ్లి ఆగిపోతే వచ్చే సమస్యల గురించి తెలిసినా నువ్వు తన జీవితంలోకి వస్తే సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ నువ్వు లేని పోని అనుమానాలతో ఇటు నీ జీవితం అటు వంశీ జీవితం పాడు చేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు కాస్త ఆలోచిస్తే నీ కాపురాన్ని నిలబెట్టుకోవచ్చు. ప్రతి విషయానికీ అనుమానపడకు' అన్నారు.
'పెండ్లి కాక ముందు నేను ఎంత గొడవ చేసినా ఎన్ని మాటలు అన్నా నన్ను వదిలి పెట్టి వెళ్ళే వాడు కాదు. అప్పుడు కూడా నేనే ఇలాగే చాలా కోపంగా ఉండేదాన్ని. తప్పు నేను చేసినా అతనే సారీ చెప్పేవాడు. ఇప్పుడు అలా లేడు. పూర్తిగా మారిపోయాడు. నాపైన చేయి చేసేకుంటున్నాడు' అంది.
'అతను అలా మారడానికి కారణం నువ్వే. తల్లిదండ్రులను వదిలి నీ కోసం వచ్చాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ప్రేమగా చూసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. పెండ్లి తర్వాత బాధ్యలు వస్తాయి. వాటికి కట్టుబడి ఉండాలి. ఏది ఏమైనా వంశీ నీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే నువ్వు రమ్మన వెంటనే మా దగ్గరకు వచ్చాడు. అనవసరంగా నీ పిచ్చి అనుమానంతో చేతులారా నీ బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు. నవ్వు అతనితో కాస్త ప్రేమగా ఉంటే చాలు. కచ్చితంగా అతను నీతో ప్రేమగా ఉంటాడు. అతనికి ఇప్పుడు కావల్సింది మానసిక ప్రశాంతత. నీ ప్రవర్తనతో నువ్వే అతనికి దూరం అవుతున్నావు' అన్నారు.
దాంతో వసూ కాస్త ఆలోచించడం మొదలుపెట్టింది. కోపాన్ని తగ్గించుకుంటానంది. 'ఓ వారం రోజులు అతను ఏమన్నా నువ్వు నోరు తెరిచి మాట్లాడకు. మౌనంగా ఉండు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం' అని లీగల్‌సెల్ సభ్యులు అతనికి చెప్పి పంపించారు.
తర్వాతి వారం మళ్ళీ ఇద్దరూ వచ్చారు. 'నేను మాట్లాడకుండా ఉంటే వంశీనే వచ్చి మాట్లాడిస్తున్నాడు. చేయి కూడా చేసుకోవడం లేదు. మంచిగానే ఉన్నాడు' అని చెప్పింది. 'నువ్వు కాస్త ఓపిగ్గా, ప్రేమగా ఉంటే అతను మారతాడు. ఎందుకంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను కాపాడుకోవల్సిన బాధ్యత నీదే. లేని పోని అనుమానాలతో శత్రువులుగా మారిపోయారు అంతే. ఇకపై ఇద్దరూ ప్రేమగా ఉండండి. జీవితం సాఫీగా సాగిపోతుంది' అని చెప్పి మళీ ్ళ రెండు వారాల తర్వాత రమ్మని చెప్పి పంపించారు.
సలీమ