Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల్ని ప్రయోజకులను చేయడానికి నిత్యం తపిస్తుంటారు. దీనికోసం ఎన్నో పద్ధతులను అనుసరిస్తారు. ప్రాథమిక స్థాయినుండే పిల్లల్ని కట్టడిచేస్తుంటారు. దీనికోసం కొందరు బుజ్జగిస్తే... మరికొందరు దండిస్తారు. అయితే పిల్లల ముందు తమ ప్రవర్తన ఎలా ఉందనే విషయాన్ని మాత్రం గ్రహించరు. అలా గ్రహించినప్పుడు మాత్రమే మీరు మీ పిల్లలకు సరైన మార్గాన్ని చూపించగలరు. అయితే పిల్లలు బాగా చదవాలన్నా, జీవితంలో ప్రయోజకులు కావాలన్నా కొన్ని సూత్రాలు తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం...
వంత పాడకూడదు
పిల్లల ముందే తల్లిదండ్రులు ప్రతి విషయానికి గొడవలు పడుతుంటారు. ఇలా భార్యాభర్తలు పిల్లల ఎదుటనే చీటికి మాటికి గొడవలు పడుతుంటే ఆ ప్రభావం పిల్లలపై కచ్చితంగా పడుతుంది అంటున్నారు పిల్లల నిపుణులు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడకూడదు. అలాగే తల్లి బిడ్డను మందిలిస్తుంటే ''పిల్లలకు తండ్రి వంత పాడకూడదు. అమ్మ చెప్పినట్టు వినాలి కదా'' అని పిల్లలకు సర్ధిచెప్పాలి. అప్పుడు తాము చేస్తుంది తప్పనే విషయం పిల్లలకు అర్థమవుతుంది. అలా కాకుండా ఆ సమయంలో భార్యను కోప్పడి, పిల్లలకు సపోర్ట్ చేస్తే వాళ్ళు తల్లి మాటలను పట్టించుకోరు.
'పక్కింటి పిల్లలు, బంధువుల పిల్లలు బాగా చదివేస్తున్నారు.. మీరెందుకు సరిగ్గా చదువుకోరు' అని పిల్లల్ని నిందించడం లాంటివి ముందుగా మానుకోవాలి. వారు చేసే ప్రతి పనిని మెచ్చుకోవాలి. తప్పు చేస్తే ఆ తప్పును వారు అర్థం చేసుకునే రీతిలో చెప్పాలి. దీంతో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పిల్లలూ బాగా చదువుకుంటారు.
పౌష్టికాహారం ఇవ్వండి
పిల్లలకు చదువుపట్ల ఆసక్తి పెరగాలంటే వారికి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. మీ గొడవల్లో మీరు పడి టీవీలను అతిగా చూడనీయకూడదు. ఎదిగే పిల్లలపై టీవీ ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. రాత్రి తొమ్మిది గంటల లోపుగా పిల్లలను నిద్రపోయేలా చూడాలి. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ
ఉదయం, రాత్రి తప్పనిసరిగా పళ్ళు శుభ్రం చేసుకునేలా అలవాటు చేయించాలి. ఇలా చేసిన వారిలో పంటి నొప్పులు రావు. పంటి బాధలు ఉండవు. అలాగే ప్రతి రోజూ మీ పిల్లల మలవిసర్జన చక్కగా అవుతున్నదో లేదో తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలి. మల విసర్జన కచ్చితంగా ప్రతిరోజూ చక్కగా జరిగే పిల్లలు ఇతర పిల్లలకన్నా తెలివి కలిగి ఉంటారు. పైగా ఇలాంటి పిల్లల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. వీరికి అనారోగ్య సమస్యలు కూడా తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బయటకు తీసుకెళ్ళండి
ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపాలి. చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి లేదా సినిమాకు వెళ్ళాలి. మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి కుటుంబమంతా కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలి. జ్ఞానాన్నిచ్చే విహారయాత్ర అయితే ఇంకా మంచిది.
ఓపిగ్గా చెప్పాలి
పిల్లలు ఎప్పుడో ఏదో ఒక అనుమానాన్ని తల్లిదండ్రుల ద్వారా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలు అడిగిన ప్రతి విషయానికి ఓపిగ్గా సమాధానం చెప్పాలి. అలా చేయాలంటే మీరు వాటి గురించి ముందే అధ్యయనం చేసి ఉండాలి. ఒక వేళ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే తెలిసిన వారితోనైనా పిల్లల అనుమానాలను తీర్చాలి. అప్పుడే మీ పిల్లలు అన్ని విషయాల్లో నిష్ణాతులు కాగలరు.